iDreamPost
iDreamPost
ఏపీలో శాసనమండలి వ్యవహారం ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది. కీలక బిల్లులను పదే పదే అడ్డుకుంటున్న నేపథ్యంలో ఎగువ సభను ఎత్తివేసే ప్రణాళికను ముందుకు తీసుకొచ్చారు. దానికి అనుగుణంగానే అసెంబ్లీ ఆమోదం వంటి తంతు ముగిసింది. కానీ బంతి కేంద్రం కోర్టులోకి వెళ్లిన తర్వాత ఏమవుతుందోననే ఉత్కంఠ అందరిలో కనిపిస్తోంది. కేంద్రం బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టకుండా జాప్యం చేస్తుందని విపక్షం ఆశిస్తుంటే, వీలయినంత త్వరగా ఆ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని పాలక వైఎస్సార్సీపీ ఆశిస్తోంది. రెండు శిబిరాలను తనవైపు ఆశాభావంతో ఎదురుచూసేలా చేయడంలో బీజేపీ పెద్దలు సక్సెస్ అయినట్టుగా మండలి వ్యవహారం చాటిచెబుతోంది. దాంతో వ్యవహారం ముదురుతున్నట్టు కనిపిస్తోంది.
ఫిబ్రవరి రెండోవారంలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతోంది. అసెంబ్లీతో పాటు శాసనమండలి సమావేశాలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. అదే జరిగితే రాష్ట్రపతి ఆమోదం దక్కే వరకూ మనుగడలో ఉండే మండలి కారణంగా ప్రభుత్వానికి మరిన్ని సమస్యలు తప్పకపోవచ్చు. పట్టువిడుపులతో కాకుండా ఇద్దరూ పట్టుదలకు పోవడంతో శాసనమండలి వ్యవహారం తుది దశకు చేరిన నేపథ్యంలో ఈసారి సమావేశాలు జరిగితే మండలి నుంచి మరింత ప్రతిఘటన ఉంటుందని చెప్పక తప్పదు. ఈ పరిణామాలను ఎలా ఎదుర్కోవాలన్నదే ప్రభుత్వానికి మింగుడుపడడం లేదు. బడ్జెట్ సమావేశాల్లో మనీ బిల్లులకు మండలిలో ప్రాధాన్యత లేనప్పటికీ ఇతర అంశాలలో కొర్రీలు వేస్తే ఏం చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది.
బడ్జెట్ సమావేశాల లోగానే పార్లమెంట్ లో ఆమోదం లభిస్తే ఏ పనయిపోతుందనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. కానీ పరిస్థితులు అందుకు సహకరిస్తాయా అన్నది సందేహంగానే కనిపిస్తోంది. ఈ విషయంలో బీజేపీ రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తోంది. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ నేరుగా రంగంలో దిగినట్టు ఆర్గనైజర్ పత్రిక వ్యాసాలు చాటుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీకి మేలు చేయని నిర్ణయాలను కాలయాపన చేసే వ్యూహాన్ని రచిస్తున్నట్టు కొందరు భావిస్తున్నారు. ఇప్పటికే జగన్ కోరికలను కేంద్రం బేఖాతరు చేసిన అనుభవాలున్నాయి. స్టీఫెన్ రవీంద్రను నిఘా విభాగానికి బాస్ గా నియమించుకోవాలని జగన్ ఆశించినా కేంద్రం కొర్రీలు వేసింది. దానికి మతం సహా అనేక కారణాలున్నట్టు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్క అధికారి నియామకంలోనే అనేకమార్లు విన్నవించినా స్పందించని కేంద్ర ప్రభుత్వం మండలి విషయంలో వేగంగా ముందుడుగు వేస్తుందనే ఆశావాహ పరిస్థితి కనిపించడం లేదు.
ప్రస్తుతం బంతి కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న తరుణంలో వారితో రాయబేరాలు కూడా తప్పవనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా శాసనమండలి రద్దయితే ఏపీలో బీజేపీ మూడు ఎమ్మెల్సీ స్థానాలు కోల్పోతుంది. అందులో ఒకటి నేరుగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి గెలిచినది కావడం విశేషం. దాంతో బీజేపీ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వ పెద్దలు సన్నద్దమవుతున్నట్టు సమాచారం. అందుకు తగ్గట్టుగా ఒక రాజ్యసభ సీటుని ఆఫర్ చేసేందుకు సిద్ధమనే సంకేతాలు మొదలయ్యాయి. రాబోయే ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వాస్తవానికి నాలుగు సీట్లను వైఎస్సార్సీపీ దక్కించుకోవడం ఖాయం. కానీ అందులో ఒకటి బీజేపీకి కేటాయించేందుకు సైతం వెనకాడబోరని సమాచారం. అలాంటి ఆఫర్ ద్వారా బీజేపీ మరింత ప్రయోజనం కలిగించే యత్నంలో వైఎస్సార్సీపీ పెద్దలున్నట్టు తెలుస్తోంది.
రాజ్యసభలో బీజేపీకి బలం పెరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో వరుసగా అధికారం కోల్పోతున్న పార్టీ పెద్దల సభలో పట్టు నిలుపుకోవడం కష్టంగా మారుతోంది. అలాంటి సమయంలో ఒక రాజ్యసభ ఎంపీ సీటు ఏపీ నుంచి దక్కితే అది బీజేపీ కి బాగా మేలు చేస్తుందనే అంచనాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి పార్లమెంట్ లో ప్రాతినిధ్యం లేదు. గతం నుంచి ఈ రాష్ట్రానికి చెందిన వారిని వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పంపించే ఆనవాయితీ కొనసాగుతోంది. గతంలో వెంకయ్య, ప్రస్తుతం జీవీఎల్ వాటిని దక్కించుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో నేరుగా బీజేపీకి బోణీ కొట్టే అవకాశం దక్కుతుందనుకుంటే కమలదళం కూడా సిద్ధపడే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. దాంతో వైఎస్సార్సీపీ ఆఫర్ కి సిద్ధపడితే బీజేపీ నేతలు మండలిపై తుది నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతారా అన్నది ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. తెరవెనుక ప్రయత్నాలు ఒనగూరే అవకాశాలు ఏమేరకు ఉన్నాయన్నది వేచి చూడాల్సిన అంశం.