ఏపీలో కమలవికాశం కలేనా..?

ఉత్తరభారత దేశ పార్టీగా ముద్రపడిన భారతీయ జనతాపార్టీ(బీజేపీ) దక్షిణాధిలో పాగా వేసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటక మినహా మరే రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చే బలం లేదు. 2014లో దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత కేంద్రంలో స్వంత బలంతో ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అదీ బీజేపీ కావడం విశేషం. కాంగ్రెస్‌ పార్టీ రెండు పర్యాయాల పాలనలో కుంభకోణాలు, మోడీ ఛరిష్మాతో బీజేపీ తన మిత్రపక్షాలపై అధారపడకుండా 282 సీట్లలో కేంద్రంలో కూర్చుకుంది. ఈ పరిణామంతో బీజేపీ పెద్దలకు దక్షిణాదిన పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనలు రూపుదిద్దుకున్నాయి. మోడీ, అమిత్‌ షా లాంటి కొత్త తరం నేతల సారథ్యంలో ఉన్న బీజేపీ ఆ దిశగా అడుగులు కూడా వేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఆ పార్టీ విషయం పరిశీలిస్తే ఏపీ కన్నా తెలంగాణలో పరిస్థితి కొంచెం మెరుగయిందని చెప్పవచ్చు.

ఇక ఏపీలో ఆ పార్టీ బలోపేత చర్యలు ఒక అడుగు ముందుకు మూడు అడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. మోడీ ప్రభుత్వం మొదటి సారిగా కొలువుదీరన తర్వాత మధ్యలో ఏపీకి చెందిన నేత ముప్పువరపు వెంకయ్యనాయుడును ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న వెంకయ్య అయిష్టాపూర్వకంగానే ఉపరాష్ట్రపతిగా వెళ్లాల్సి వచ్చింది. ఈ పరిణామంతో బీజేపీ అధినాయకత్వం ఏపీలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిందన్న చర్చ సాగింది. అంతకు ముందు వరకూ ఏపీలో బీజేపీ అంతా వెంకయ్యనాయుడు చేతిలో ఉండేది. ఆయన హాయంలో పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంలా ఉండేది. బాబు కనుసన్నల్లోనే వెంకయ్యనాయుడు రాజకీయాలు చేసేవారనే విమర్శలున్నాయి. చంద్రబాబుకు అవసరమైన పనులు తప్పా.. బీజేపీ బలోపేతంపై ఏనాడు దృష్టి పెట్టలేదు. ఈ క్రమంలో వెంకయ్యనాయుడను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పించి, ఉపరాష్ట్రపతిగా నియమించడంతో ఆయన చేతులు, కాళ్లు, నోరు కట్టేశారు.

వెంకయ్యనాయుడు కూడా తన కాళ్లు, చేతులు, నోరు కట్టేశారని పలు సందర్భాల్లో వాపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ పెద్దలు ఏపీపై ప్రత్యేక దృష్టి సారించారని విశ్లేషణలు సాగాయి. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో అటు తెలంగాణతోపాటు, ఏపీలోనూ ఒంటరిగా పోటీ చేసింది. తెలంగాణలో 17 ఎంపీ సీట్లలో నాలుగు గెలుచుకుని సత్తా చాటింది. ఏపీలో మాత్రం నిరుత్సాహం తప్పలేదు. కానీ కేంద్రంలో 2014 కన్నా 2019లో అధికంగా సీట్లు( 303) సాధించింది.

2019 ఎన్నికల తర్వాత పార్టీ బలాలు, బలహీనతలపై దృష్టి పెట్టిన అమిత్‌ షా.. ఏపీకి ప్రత్యక పరిశీలకుడుగా సునిల్‌ డియోధర్‌ను నియమించింది. సునిల్‌ డియోధర్‌ రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచారు. త్రిపురలో కమ్యూనిస్టుల ప్రభుత్వం కూలదోసి మొదటి సారి బీజేపీ అధికారంలోకి రావడానికి సునిల్‌ వ్యూహాలే ఉపకరించాయని ఆ పార్టీ పెద్దలు భావించారు. ఈ క్రమంలోనే ఆయన్ను ఏపీకి పంపారు. జనసేతో పొత్తు పెట్టుకోవడం కూడా సునిల్‌ వ్యూహంలో భాగమేనన్న వార్తలొచ్చాయి.

అయితే ఏపీలోని రాజకీయ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండడంతో బీజేపీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఎన్నికలకు ముందు, తర్వాత కాంగ్రెస్, టీడీపీ పార్టీల నుంచి వచ్చిన నేతల వల్ల ఆ పార్టీకి లాభించకపోగా మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. రాష్ట్రంలో బలపడాలన్న ఆ పార్టీ లక్ష్యానికి వలస నాయకులు గండికొడుతున్నారు. పార్టీ విధానానికి భిన్నంగా పని చేస్తూ నష్టం చేకూరుస్తున్నారు. అటు తెలుగుదేశానికి ఇటు వైసీపీకి సమానదూరం పాటించి ప్రత్యామ్నాయ శక్తిగా రాజకీయాలు చేసి ఎదగాలనే బీజేపీ లక్ష్యం వలస నేతల వల్ల నీరుగారుతోందని ఇటీవల జరిగిన పరిణామాలు స్పష్టం అవుతున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లు బీజేపీలో ఉన్నా.. టీడీపీ నేతల్లా రాజకీయాలు చేస్తున్నారనే బలమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ పార్టీకి ఏ సంబంధంలేని నిమ్మగడ్డ వ్యవహారంలో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లు తలదూర్చడంతో ఆ పార్టీకి అనుకొని చిక్కులు ఎదురవుతుండడం ఇక్కడ గమనార్హం.

బీజేపీలో మొదటి నుంచి సోము వీర్రాజు, పైడికొండల మాణిక్యాలరావు, జీవీఎల్‌ నరశింహారావు, విష్ణువర్థన్‌ రెడ్డి, మాధవ్‌ తదితరులు పార్టీ లైన్‌కు అనుగుణంగా రాజకీయాలు చేస్తున్నారు. పార్టీ వాణిని వివిధ వేదికలుగా వినిపిస్తూ బీజేపీ ఉనికిని సొంతంగా చాటుతున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యతను తమ పార్టీ భర్తి చేయగలదనే విశ్వాసాన్ని ప్రజల్లోకి పంపుతున్నారు. భవిష్యత్‌లో వైసీపీ తామే ప్రత్యామ్నాయమనే సంకేతాలు బలంగా పంపుతున్నారు. అయితే వీరి ప్రయత్నాలకు తెలుగు బీజేపీ నేతలుగా పిలుస్తున్న సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ తదితరులు గండికొడుతున్నారు.

ఏపీలో బీజేపీ బలపడాలంటే.. తన సొంత బలంపై ఆధారపడాల్సిన అవసరం ఉంది. ఆది నుంచి ఉన్న నేతలతోపాటు కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవాలని పరిశీలకులు చెబుతున్నారు. వలస నాయకులపై ఆధారపడితే కుక్క తోక పట్టుకుని గోదారిని ఈదినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేసుల నుంచి రక్షణ, వ్యాపార సామ్రాజ్యాలు కాపడుకోవాలనే లక్ష్యంతో అధికారం కోసం వచ్చిన వలస నేతలు ఎప్పుడైనా బండి దిగేవారేనని చెబుతున్నారు. పరిగెత్తిపాలు తాగడం కన్నా.. నిలబడి నీళ్లు తాగడం మేలనే సామెతలా.. నిదానంగానైనా ఏపీలో అధికారమే లక్ష్యంగా సొంత బలం, బలగంతో బీజేపీ రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు.

Show comments