Idream media
Idream media
సెవెన్ సమురాయ్ (1954) కంటే ముందే అలాంటి కథాంశంతో తెలుగులో సినిమా వచ్చింది. అది పల్లెటూరి పిల్ల (1950). ఊళ్ల మీద పడి దోచుకునే కంపన్న దొరకి వ్యతిరేకంగా ప్రజలకి హీరో ఎన్టీఆర్ శిక్షణ ఇస్తాడు. సెవెన్ సమురాయ్ పక్కాగా ఇదే పాయింట్‌పై నడుస్తుంది. అయితే పల్లెటూరి పిల్లలో ట్రయాంగిల్ లవ్‌స్టోరీతో త్యాగం, ఉపదేశాలు, పరివర్తన ఇలా చాలా కలిసిపోయి కథని తేలిక చేసేస్తాయి.
ఈ సినిమాలో ఫస్ట్ సీనే అద్భుతంగా ఉంటుంది. ఊరి మీద పడి దోచుకోడానికి వచ్చిన జయంత్ (ఎన్టీఆర్)ని శాంత (అంజలీదేవి) చెంప మీద కొట్టి నువ్వు మనిషివేనా అని నిలదీస్తుంది. దాంతో అతనిలో మార్పు వచ్చి ముఠా నాయకుడు కంపన్న దొరని ధిక్కరించి, ఆ ఊరికి వచ్చి శాంతని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అప్పటి వరకూ ఆమెని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డ వసంత్ తన ప్రేమని త్యాగం చేస్తాడు. శాంతకి ఒక కొడుకు పుడతాడు. ఇంతలో జయంత్ మీద పగ పెంచుకున్న కంపన్న మోసంతో అతన్ని బంధిస్తాడు. వసంత్ వెళ్లి విడిపిస్తాడు. ఈ ఘర్షణలో అతను చనిపోతాడు. ఇది కథ.
ఇద్దరు హీరోలు కలిసి నటించిన మొదటి సినిమానే కాదు, ట్రయాంగిల్ లవ్‌స్టోరీ కథల్లో కూడా ఇదే మొదటిది. ఎన్టీఆర్ హీరోగా మొదటి సినిమా ఇదే అయినా , షావుకారు దీనికంటే ముందు విడుదలైంది. దర్శకుడు బీఏ సుబ్బారావుకి , సంగీత దర్శకుడు ఆదినారాయణరావుకి (అంజలి భర్త) ఇదే మొదటి సినిమా.
బీఏ సుబ్బారావు శోభనాచల స్టూడియోలో మేనేజర్. దీని యజమాని మీర్జాపురం రాజా. ఈ స్టూడియో తర్వాత రోజుల్లో వీనస్ స్టూడియోగా మారింది. చెన్నై తేనాంపేటలో ఇప్పుడు ఇది లేదు. అపార్ట్‌మెంట్‌గా మారిపోయింది. ఒకరోజు రాజావారితో సుబ్బారావు తన మనసులోని మాట చెప్పాడు. సినిమాను నిర్మించి దర్శకత్వం చేయాలని ఉందని. రాజావారు సరేనని తాను భాగస్వామిగా ఉంటానన్నారు.
ఇంగ్లీష్ సాహిత్యం బాగా చదివే అలవాటున్న సుబ్బారావుకి షెరిడాన్ రచించిన పిజారో నాటకం బాగా నచ్చింది. దాన్ని అనుకరించి పల్లెటూరి పిల్ల కథ తయారు చేశాడు. తాపి ధర్మారావు , ఆదినారాయణరావు సహకరించారు. అప్పటికే రచయితగా పేరున్న ధర్మారావు దీనికి మాటలు కూడా రాశాడు. మీర్జాపురం రాజా తీసిన హిట్ సినిమా కీలుగుర్రంకి కూడా పనిచేశాడు కాబట్టి అంతా తెలిసిన వాళ్లే కావడంతో ధర్మారావు పని సులభమైంది.
మొదట వసంత్ పాత్రకి ఈలపాట రఘురామయ్యని తీసుకోవాలనుకున్నారు. కానీ అది ANRకి దక్కింది. ఇక తాను హీరోగా మారుస్తున్న NTR భవిష్యత్‌లో ముఖ్యమంత్రి అవుతాడని ఆ రోజు సుబ్బారావుకి తెలియదు.
అంజలిదేవిని ఒక ఎద్దు పొడవడానికి వస్తే NTR వెళ్లి కాపాడుతాడు. ఈ సీన్‌లో డూప్ లేకుండా నటించడమే కాకుండా ఎద్దుని నిజంగా కంట్రోల్ చేయాలని చూస్తే అది విసిరికొట్టింది. చేయి విరిగితే , పిండి కట్టుతో మరుసటి రోజు షూటింగ్‌కి వచ్చాడు.
SV రంగారావుకి అప్పటికి గుర్తింపు లేదు. తాతగా చిన్నపాత్ర వేశాడు. 32 ఏళ్ల వయసులో తాతగా వేయడం ఆయనకే చెల్లింది.
ఈ సినిమా ఏడు సెంటర్లలో శత దినోత్సవం చేసుకొంది. దేవదాస్‌తో హిట్ డైరెక్టర్‌గా మారిన వేదాంతం రాఘవయ్య దీనికి నృత్య దర్శకుడు.
నిజానికి బీఏ సుబ్బారావు దృష్టిలో NTR లేడు. ఒకసారి LV ప్రసాద్ ఆఫీస్‌లో NTR ఫొటో చూసి ఇతనే తన హీరో అనుకున్నాడు. అయితే కొత్త నటుడిపై అంత భారం (లీడ్ హీరో) మోపడం కరెక్ట్ కాదేమో అని LV ప్రసాద్ అన్నాడు. దాంతో NTRని వారం రోజులు పరిశీలించి ఆయన నడక, హావభావాలు అన్నీ జైహింద్ సత్యం ఫొటోలు తీశాడు. అన్నీ చూసి సంతృప్తి చెందాకే ఎన్టీఆర్‌కి అవకాశం దక్కింది.
ఇక ANR పల్లెటూరి నుంచి వచ్చాడు కాబట్టి సినిమాలో ఎడ్లని తోలడం, కర్రసాము అన్నీ సహజంగా కనిపిస్తాయి. క్లైమాక్స్‌లోనే ఆయన డూప్ సులభంగా దొరికిపోతాడు.
పాతాళభైరవి నుంచి గురూ అనే ఊతపదం పాపులర్ కావచ్చు కానీ, ఈ సినిమాలో నల్లరామ్మూర్తి జంట ఊత పదం అదే.
ఈ సినిమాని తమిళ్‌లో డబ్ చేశారు. హిందీలో ఇన్ సానియత్ (1955) అని రీమేక్ చేశాడు. జెమినీవాసన్ తీశారు. దిలీప్‌కుమార్ , దేవానంద్ నటించారు.
ఇద్దరు అగ్రనటులు తర్వాత 14 సినిమాల్లో కలిసి నటించారు.