iDreamPost
iDreamPost
రెండేళ్ల క్రితం వచ్చిన హిట్ ఫస్ట్ కేస్ పెద్దగా అంచనాలు లేకుండా మంచి విజయం సాధించింది. విశ్వక్ సేన్ ని కొత్త కోణంలో ఆవిష్కరించిన క్రైమ్ థ్రిల్లర్ అది. దానికి కొనసాగింపు ఉంటుందని ఫస్ట్ పార్ట్ లోనే కొన్ని క్లూస్ ఇచ్చి వదిలేసిన దర్శకుడు శైలేష్ కొలను ఇప్పుడు సీక్వెల్ తో వచ్చారు. పేరుకి ఇది కేస్ 2 కానీ పూర్తిగా సంబంధం లేని కొత్త కథను తీసుకున్నారు. మేజర్ తో ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన అడవి శేష్ హీరో కావడంతో పాటు హిట్ సిరీస్ కున్న బ్రాండ్ వేల్యూ మంచి ఓపెనింగ్స్ వచ్చేలా చేసింది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇంతగా హైప్ తెచ్చుకున్న ఈ హిట్ 2 నిజంగా దానికి తగ్గట్టే ఉందా రివ్యూలో చూద్దాం
కథ
వైజాగ్ ఎస్పి కృష్ణదేవ్(అడవి శేష్)కు దూకుడెక్కువ. నేరస్తులంటే చాలా చిన్న చూపుతో పాటు వాళ్ళవి కోడి బుర్రలని ఈజీగా పట్టుకోవచ్చనే ఫీలింగ్ తో ఒకరకమైన ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రవర్తనలో చూపిస్తుంటాడు. ప్రేమించిన అమ్మాయి ఆర్య(మీనాక్షి)తో సహజీవనం చేస్తూ ప్రశాంతంగా ఉంటాడు. ఓసారి బార్ లో పనిచేసే సంజనా మృతదేహం ముక్కలుగా దొరకడంతో కృష్ణదేవ్ కు కొత్త సవాల్ మొదలవుతుంది. హంతకుడిని పట్టుకునే క్రమంలో అమాయకుడు బలవుతాడు. దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్న ఎస్పి తన ప్రాణాలకు తెగించి ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. ఇదంతా చేసిందెవరనేది తెరమీద చూడాలి
నటీనటులు
స్క్రిప్ట్ సెలక్షన్ లో చాలా జాగ్రత్తగా ఉంటూ విలక్షణత ప్రదర్శిస్తున్న అడవి శేష్ చాలా అలవోకగా కెడి పాత్రలో ఒదిగిపోయాడు. గూఢచారి, మేజర్ రేంజ్ కెరీర్ బెస్ట్ గా చెప్పలేం కానీ ఇంతకన్నా మంచి ఆర్టిస్టు ఇంకెవరా అని ఆలోచిస్తే సమాధానం దొరకదు కాబట్టి తనవరకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేశాడు. ముఖ్యంగా సైకో కిల్లర్ తో నేరుగా తలపడే ఎపిసోడ్ లో ఎక్స్ ప్రెషన్స్ తో పాటు ఇంటెన్సిటీ ప్రదర్శించిన విధానం బాగుంది. హిట్ 3 లో తాను ఉండడనే క్లారిటీ ఇచ్చేశారు కాబట్టి ఇక రిపిటీషన్ ఉండదు. చివర్లో నాని ఎంట్రీ ఉంటుందని ప్రీ రిలీజ్ లో వాళ్ళే చెప్పేశారు కాబట్టి సస్పెన్స్ ఏమి లేదు. ఆ సీన్ స్క్రీన్ మీద బాగా పండింది.
మీనాక్షిది రెగ్యులర్ హీరోయిన్ తరహాలో మొక్కుబడిగా సాగే పాత్రే. హీరోతో పాట పాడుకోవడం, చివరికి విలన్ చేతికి చిక్కడం తప్ప పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. స్పేస్ తక్కువే అయినా లుక్స్, నటన రెండూ బాగున్నాయి. రావు రమేష్ ది రెగ్యులర్ రోలే. డిపార్ట్ మెంట్ కోసం స్వార్థం నిండిన చిన్న సెల్ఫిష్ టచ్ ఇచ్చారు. హర్షవర్ధన్ ఉన్నది కాసేపే అయినా పెళ్ళాం చేతిలో మోసపోయిన వాడిగా బేల చూపులతో తన అనుభవాన్ని ప్రదర్శించారు. సుహాస్ కు ఇలాంటివి కొత్త కాదు కాబట్టి మరీ డిఫరెంట్ గా అనిపించడు. తనికెళ్ళ భరణి, పోసాని, శ్రీకాంత్ అయ్యంగార్ రెండు సీన్లకే పరిమితం. కెడి గ్యాంగ్ లో అసిస్టెంట్లు చక్కగా కుదిరారు. క్యాస్టింగ్ బాగుంది
డైరెక్టర్ అండ్ టీమ్
క్రైమ్ ఆధారంగా రాసుకునే కథలన్నీ హత్యల చుట్టే తిరుగుతాయి. అవి కూడా ఆడవాళ్లను చంపితేనే ఆడియన్స్ లో సానుభూతి కలుగుతుంది కాబట్టి దాదాపు రచయితలంతా ఈ యాంగిల్ లోనే మర్డర్లు డిజైన్ చేస్తారు. వంశీ అన్వేషణ నుంచి మొదలుపెట్టి హిట్ వన్ దాకా చూసుకుంటే అన్నింటిలో సెంట్రల్ పాయింట్ ఫిమేల్ కిడ్నాప్ లేదా హతం చేయడం. హిట్ 2 కూడా ఇదే లైన్ మీద రాసుకున్నారు శైలేష్ కొలను. ఒక సైకో బయటికి కనిపించకుండా ఎలాంటి క్లూస్ దొరక్కుండా పోలీసులకు కొరకరాని కొయ్యగా మారడం బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడులోనూ ఆ మధ్య చూశాం. హిట్ 2 ఇంచుమించు పైన చెప్పిన ఉదాహరణల తీరులోనే సాగుతుంది
అలా అని పూర్తిగా వాటితో పోలిక రాకుండా శైలేష్ కొలను రాసుకున్న పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే, సన్నివేశాల్లో డిజైన్ చేసుకున్న ఇంటెన్సిటి ఏదో కొత్త నేరాన్ని చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి. టేకాఫ్ లో హర్షవర్షన్ ట్రాక్ ని ఎక్కువ సాగదీయకుండా ఎస్టాబ్లిష్ చేసిన తీరు ఏం చూడబోతున్నామో మనల్ని ముందే ప్రిపేర్ చేస్తుంది. అయితే ఎలా ఎవరు చేస్తారనే క్లూస్ నామమాత్రం ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఫస్ట్ హాఫ్ రాఘవుడి అరెస్ట్ చేసి అతన్ని కేసులో ఇరికించాక అతను తప్పేమి చేయలేదని ఈజీగా అర్థమైపోతుంది. ఇది సాగదీశారే అనే భావన కలుగుతుండగానే అడవిలో ఎన్కౌంటర్, ఆ తర్వాత ఇంటర్వెల్ బ్లాక్ ని ఊహాతీతంగా చూపించి శైలేష్ మెప్పించాడు.
సెకండ్ హాఫ్ మొదలయ్యాక జరిగే ప్రొసీడింగ్స్ కొంత నెమ్మదిగా సాగడం క్షమించదగ్గ ల్యాగ్ కు కారణమయ్యింది. థ్రిల్లింగ్ అనిపించేవి, మైండ్ బ్లోయింగ్ తరహా మలుపులు లేకుండా కెడి విచారణ ఎలా చేస్తున్నాడనే లైన్ మీద సింపుల్ గా చెప్పుకుంటూ పోయారు. ఇదేమీ విసిగించలేదు కానీ ఇక్కడ సూపర్ ట్విస్ట్ ఇచ్చాడే అనిపించుకోవడంలో తడబడ్డాడు. అయినా కూడా విసుగు రాకుండా నడిపించడంలో శైలేష్ ఫెయిల్ కాలేదు. మీనాక్షితో లవ్ ట్రాక్, ఆమె తల్లితో ఏదో లైట్ కామెడీ ట్రై చేశారు అదంత ఎఫెక్ట్ ఇవ్వలేకపోయింది. హీరోయిన్ ని కథలో ముడిపెట్టడం బాగున్నా ఆ లింక్ ని ఇంకా బాగా కనెక్ట్ చేసే అవకాశం ఉన్నా పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయారు
ఇది ఓటిటి జమానా. భాషతో సంబంధం లేకుండా మారుమూల గ్రామంతో మొదలుపెట్టి హైదరాబాద్ మెట్రో దాకా అందరికీ వరల్డ్ వైడ్ కంటెంట్ అందుబాటులో ఉంది. లెక్కలేనన్ని వెబ్ సిరీస్ లు, ఇండిపెండెంట్ మూవీస్ ఎక్కువ ఇలాంటి థ్రిల్లర్ సబ్జెక్టులతోనే వస్తున్నాయి. ఎక్కడిదాకో ఎందుకు హిట్ 2 వచ్చిన రోజే ప్రైమ్ లో రిలీజ్ చేసిన ఎస్జే సూర్య వదంది సిరీస్ కూడా ఈ పాయింట్ కు దగ్గరగా ఉంటుంది. అంతగా అప్డేటెడ్ ఎంటర్ టైన్మెంట్ దొరుకుతున్నప్పుడు ఆడియన్స్ ఊహలకు అందని విధంగా మెస్మరైజ్ చేసే కథలు చెప్పాలి. ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదే అన్న ఇంప్రెషన్ తెచ్చుకోవాలి. దానికి చాలా కసరత్తు అవసరం.
హిట్ 2 ఈ విషయంలో పాస్ అయ్యింది కానీ మరీ స్టేట్ ఫస్ట్ అని చెప్పుకునే మార్కులతో కాదు. ఫస్ట్ క్లాస్ కు దగ్గరగా నిలిచిపోయింది. స్వతహాగా డాక్టర్ అయిన శైలేష్ కొలను తన వైద్య పరిజ్ఞానాన్ని వాడుకున్న తీరుని మెచ్చుకోవచ్చు. ఎంత కన్విన్సింగ్ గా చెప్పినా కొన్ని లాజిక్స్ మాత్రం మిస్ అయ్యాయి. చిన్నప్పుడే హత్యలు మొదలుపెట్టిన సైకో అంత తెలివిగా క్లూస్ లేకుండా ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడన్న దానికి కన్విన్సింగ్ ప్రెజెంటేషన్ లేదు. సీన్లలో ఉన్న డెప్త్ వల్ల ఇది గుర్తుకు రాకుండా జాగ్రత్త పడ్డారు. కిల్లర్ తాలూకు ఫ్లాష్ బ్యాక్, అతను ఎందుకలా మారాడన్న కారణం మరీ సూపరనిపించే స్థాయిలో లేదు కానీ అంతకు మించి స్కోప్ దొరకలేదు కూడా.
క్రైమ్ డ్రామాలో మరొక్క కీలకమైన అంశం కిల్లర్ క్యారెక్టర్ వేసే ఆర్టిస్టుకి చూసేవాళ్ల మైండ్ లో ఏ మాత్రం రిజిస్టరయ్యే అవకాశం లేని క్యారెక్టరైజేషన్ తో పాటు ఆ మొహం మీద ఎలాంటి అభిప్రాయం లేకపోవడం చాలా అవసరం. కానీ హిట్ 2 సెకండ్ హాఫ్ లో అతనెవరో తెలిసిపోయే లూజ్ ఎండ్స్ కొంత థ్రిల్ ని తగ్గించే అవకాశం లేకపోలేదు. ఇంతకు ముందు చెప్పిన అన్వేషణలో రాళ్ళపల్లి మీదకు అనుమానం రాకుండా చాలా ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. అక్కడ పని చేసింది కమెడియన్ గా ఆయనకున్న ఇమేజ్. హిట్ 2 లో అలాంటి హాస్య నటుడిని తీసుకోవాలని కాదు కానీ అవుట్ అఫ్ ది బోర్డ్ డిఫరెంట్ ఇమేజ్ ఉన్న నటుడైతే నెక్స్ట్ లెవెల్ లో పండేది
పరిమితుల సంగతి పక్కనపెడితే హిట్ 2 నిరాశపరచలేదు. ఈ జానర్ ని ఇష్టపడేవాళ్లకు పైసా వసూల్ అనిపిస్తుంది. మరీ విపరీతంగా క్రైమ్ పుస్తకాలు, సినిమాలు, సిరీస్ లు చూసేవాళ్లుకు ఓ మోస్తరుగా ఓకే అనిపించవచ్చు కానీ విపరీతమైన అంచనాలు లేకుండా వీటి మీద రెగ్యులర్ గా ఆసక్తి చూపించని వాళ్లకు హిట్ 2 సర్ప్రైజ్ ప్యాకేజే. హింస కోణంలో ఏ సర్టిఫికెట్ ఇచ్చారు కానీ మరీ అంత భీభత్సమైన విజువల్స్ ఏమి లేవు. ట్రైలర్ లో చూపించిన ముక్కలుగా చంపబడిన అమ్మాయి శరీరం, చివర్లో చనిపోయాక సైకో మొహం మినహాయించి మొహం తిప్పుకునే రేంజ్ లో భీభత్సం చేయలేదు. అలా అని చిన్నపిల్లలకు రికమండ్ చేసేది కాదు
చాలా కాలం తర్వాత ఎంఎం శ్రీలేఖ ట్యూన్ ఇచ్చిన సినిమా ఇది. సురేష్ బొబ్బిలి మరో పాట అందించారు. దీనికి వాటి పెద్ద అవసరం రాలేదు కాబట్టి ఒక్కటే వాడుకున్నారు. మెలోడీ కనక అలా వెళ్లిపోయింది. జాన్ స్టివర్ట్ ఏడూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పించింది. అదిరిపోయేలా కాదు కానీ మూడ్ ని క్యారీ చేసేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. ఎస్ మణికందన్ ఛాయాగ్రహణం గురించి కొత్తగా పొగిడేందుకు ఏమి లేదు. తన బెస్ట్ వర్క్ మరోసారి ఇచ్చారు. గ్యారీ ఎడిటింగ్ సిన్సియర్ గా ఉంది. రెండు గంటలు నిడివికి కట్టుబడటం చాలా ప్లస్ అయ్యింది. నాని నిర్మాణ విలువలు బాగున్నాయి. రిస్క్ లేని బడ్జెట్ తో ఇలాంటివి ఎన్ని తీసినా హ్యాపీనే
ప్లస్ గా అనిపించేవి
స్క్రీన్ ప్లే
అడవి శేష్ పాత్ర
తక్కువ నిడివి
కీలకమైన ట్విస్టులు
మైనస్ గా తోచేవి
హై మూమెంట్స్ లేకపోవడం
స్పెషల్ గా అనిపించని సైకో ఫ్లాష్ బ్యాక్
క్లైమాక్స్ ఇంపాక్ట్ తగ్గడం
కంక్లూజన్
ఒక హంతకుడు, వాడిని పట్టుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్, ఎలాంటి ఆధారాలు లేని క్లిష్టమైన కేసు. ఈ టెంప్లేట్ లో ఇప్పటికే లెక్కలేనన్ని సినిమాలు వచ్చినా దర్శకులు ఈ రోజుకీ ఇదే లైన్ ట్రై చేయడానికి కారణం తమ రైటింగ్ టాలెంట్ తో కొత్తగా వీటిని చూపించవచ్చనే తాపత్రయమే. శైలేష్ కొలను కూడా ఇలాగే ఆలోచించాడు. ఎలాంటి అనవసర అంశాలకు చోటు ఇవ్వకుండా అనుకున్న దాన్ని కొలతలు తప్పకుండా తెరకెక్కించిన తీరు హిట్ 2ని ఈజీగా వన్ టైం వాచ్ క్యాటగిరీలో నిలబెట్టేసింది. ముందే చెప్పినట్టు విపరీతమైన క్రైమ్ కంటెంట్ చూసే క్రిమినల్ బుర్ర కాకపోతే ఈ సీక్వెల్ కానీ సీక్వెల్ ఓకే అనిపించేస్తుంది
హిట్ 2 – రైట్ కేస్
రేటింగ్ : 2.75/5