Idream media
Idream media
కరోనా వైరస్ వ్యాప్తిని ఆదిలోనే అరికట్టేందుకు దేశం లాక్ డౌన్ దిశగా భారతదేశం పయనిస్తోంది. ఆ బాటలోనే తెలుగు రాష్ట్రాలు పయనించాయి. నిన్న ఆదివారం జనతా కర్ఫ్యూకు కొనసాగింపుగా ఈ రోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాలను లాక్ డౌన్ చేస్తున్నట్లు ఆయా రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ ప్రకటించారు. దీని ఫలితంగా పేదలు, బడుగు బలహీన వర్గాలు ఉపాధిలేక తిండికి ఇబ్బంది పడకూడదని ఉద్ధీపన చర్యలు చేపట్టాయి.
తప్పని పరిస్థితుల్లో లాక్‌డౌన్ చేస్తున్నామని ప్రకటించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ పేద కుటుంబాలు ఇబ్బంది పడకుండా ఉద్ధీపన చర్యలు చేపట్టారు. ప్రతి కుటుంబానికి నెలకు సరిపడా బియ్యం, వెయ్యి రూపాయల నగదు ఇస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ నెల 29వ తేదీలోపు బియ్యం, వచ్చే నెల 4వ తేదీన వెయ్యి రూపాయల నగదు వాలంటీర్లు అందజేస్తారని వైఎస్ జగన్ వెల్లడించారు. నిత్యవసర వస్తువుల ధరలు పెరగకుండా కట్టడికి ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్రం కూడా లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. సీఎం కేసీఆర్ కూడా ప్రజలకు అండగా నిలిచేలా చర్యలు చేపట్టారు. రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ నెలకు సరిపడా 12 కేజీల బియ్యం, కుటుంబానికి నెలకు 15 వందల రూపాయలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
రేషన్‌కార్డు ఉన్న వారికి ప్రభుత్వాల చేయూత అభినందనీయం. అయితే రేషన్‌కార్డులేని నిరుపేదల పరిస్థితి ఏంటనేదే ప్రస్తుత ప్రశ్న. కార్డులేని వారు తెలుగు రాష్ట్రాల్లో వేలాది కుటుంబాలున్నాయి. రెక్కాడితే డొక్కాడని బతుకులు వారివి. ఈ విపత్కర కాలంలో వారి పరిస్థితి ఏంటి..? వీరుగాక గూడులేని ఆభాగ్యులు రోడ్లు వెంబడి, ఫుట్‌పాత్‌లపై, ఫై ఓవర్ల కింద కాలం వెల్లదీస్తున్నారు. దేశ సంచారం చేస్తూ ఆట బొమ్మలు, ఇతర వస్తువులు అమ్ముకుని జీవించే సంచార జాతుల వారు ఉన్నారు. బిక్షాటన చేసి కడుపునింపుకునే వారున్నారు. జన సంచారం లేక వారి కడుపు నిండడంలేదు. వీరందరి గురించి కూడా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సంచార జాతుల వారు మినహా మిగతా వారందరూ పట్టణాలు, నగరాల్లోనే ఉంటారు. కాబట్టి పురపాలక సంఘాల ద్వారా వారికి భోజనం అందేలా చర్యలు తీసుకోవాలి. అందుకోసం మొబైల్ క్యాంటిన్లు ఏర్పాటు చేయాలి. లేదా లాక్‌డౌన్ కొనసాగినన్ని రోజులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, వారందరికీ ఆశ్రయం కల్పిస్తే వారికి ఎంతో ఊరట లభిస్తుంది. లేదంటే ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియని లాక్‌డౌన్ వల్ల అభాగ్యులు ఆకలితో ఆలమటించి అసువులుబాసే ప్రమాదం ఉంది.