బెంగాల్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న మృతదేహాల ఖననం

పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య తరచుగా మాటల యుద్ధం నడుస్తుంది. కరోనా కేసుల సంఖ్యను బెంగాల్ తక్కువగా చూపిస్తుందని అమిత్ షా ఆరోపిస్తే, కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ వలన తాము ఆర్థికంగా నష్టపోయినట్లు సీఎం మమత ప్రత్యారోపణలతో విరుచుకుపడింది. తాజాగా 13 గుర్తు తెలియని మృతదేహాల దహన సంస్కారాలకు సంబంధించి వైరల్‌గా మారిన ఒక వీడియో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష సిపిఎం మధ్య ఆరోపణల పర్వానికి నాంది పలికింది.

గత బుధవారం మధ్యాహ్నం కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్ వాహనం 13 గుర్తు తెలియని మృతదేహాలను దహన సంస్కారాల కోసం గారియా శ్మశానవాటికకు తీసుకురావడంతో సమస్య మొదలైంది.కరోనా వైరస్ సోకిన రోగుల మృతదేహాలు కావచ్చునని భయపడి దాదాపు 200 మంది స్థానిక నివాసితులు సమావేశమై నిరసన తెలిపారు.మొత్తం 13 మృతదేహాలను ఒకేసారి దహనం చేసే ప్రయత్నం జరిగిందని వారు ఆరోపించారు.అలాగే దాదాపుగా కుళ్ళిపోయిన మృతదేహాలను ఒక వ్యక్తి హుక్ ద్వారా లాగడాన్ని గమనించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా వైరల్ కావడంతో అధికార,విపక్షాల మధ్య విమర్శలు జోరు ఊపు అందుకుంది.

స్థానిక నివాసితుల తరపున గారియా శ్మశానవాటికకు తీసుకెళ్లిన గుర్తు తెలియని మృతదేహాలపై వివరణ కోరుతూ సిపిఎం జాదవ్‌పూర్ ఎమ్మెల్యే సుజన్ చక్రవర్తి కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్ (కెఎంసి) నిర్వాహకుల బోర్డు ఛైర్మన్ ఫిర్హాద్ హకీమ్‌కు లేఖ రాశారు.అందులో ఆ మృతదేహాలను గారియా శ్మశానవాటికకు ఎందుకు తీసుకువచ్చారు? మృతదేహాలతో వచ్చిన వారు ఒకేసారి అన్ని మృతదేహాలను దహనం చెయ్య బోయారు. ఎందుకు? ఆ మృతదేహా శరీరాలలో కోవిడ్‌కు సంబంధించినవిగా ఉన్నాయా? ”అని ప్రశ్నించారు..అలాగే సిపిఎం యువజన విభాగం డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్ఐ) స్థానిక పోలీసు స్టేషన్ ముందు గురువారం ఆందోళనకు దిగింది.

మృతదేహాలను పారవేస్తున్న తీరుపై స్పందించిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంఖర్ ఆవేదన వ్యక్తం చేశాడు.గవర్నర్ ట్విట్టర్‌లో “మృతదేహాలను పారవేయడంపై మనస్ఫూర్తిగా వర్ణించలేని అన్‌సెన్సిటివిటీతో కోపంగా ఉంది.సున్నితత్వం కారణంగా విషాదకర వీడియోలను షేర్ చేయటం లేదు.మన సమాజంలో సాంప్రదాయం ప్రకారం మృతదేహానికి అత్యధిక గౌరవం ఇవ్వటమే కాక దహన సంస్కారాలకు కొన్ని ఆచారాలు ఉన్నాయి” అని పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారంను అత్యవసరంగా తనకు అప్డేట్ చేయాలని హోం శాఖ కార్యదర్శిని గవర్నర్ ఆదేశించారు.అలాగే మృతదేహాల గుర్తింపుపై పారదర్శకత పాటించాలని,రోగిని ఎప్పుడు చేర్పించారు. ఏ ఆసుపత్రిలో ఏ వ్యాధికి చికిత్స ఇచ్చారు,మరణానికి కారణం ఏమిటి…? బెడ్ హెడ్ టికెట్ నెంబర్‌తో సహా అన్ని వివరాలను వెల్లడించాలని ఆయన ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కోరారు.

అయితే గత మే నెల 29 న కెఎంసి ముఖ్య మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ధాపా శ్మశానవాటికను హిందూ కోవిడ్ -19 మృతదేహాల దహన సంస్కారాలకు ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చాడని ఓ సీనియర్ సివిక్ బాడీ అధికారి తెలిపాడు.ఈ ఉత్తర్వులలోనే క్లెయిమ్ చేయని మృతదేహాలను గారియా ఆది మహాసాసన్ వద్ద దహనం చెయ్యాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.కాబట్టి దాచడానికి ఏమీ లేదు, ఆ మృతదేహాలు కోవిడ్ -19 తో కేసులకు సంబంధించినవి కావని స్పష్టం చేశారు.

వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలలో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న పార్టీలకు గతంలో రాజకీయ హింసాత్మక సంఘటనలు,ఎన్‌ఆర్‌సి,సిఎఎ, త్రిపుల్ తలాక్ వంటి సున్నితమైన అంశాలు విమర్శలకు ఉపయోగపడ్డాయి.కాగా ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో కేసుల సంఖ్య మరియు మరణాలు,వలస కార్మికుల సమస్యలు,లాక్‌డౌన్‌ సృష్టించిన ఆర్థిక నష్టాలు వంటి పలు అంశాలు రాజకీయ పార్టీల విమర్శలకు ముడిసరుకుగా ఉపయోగపడుతున్నాయి.

Show comments