iDreamPost
iDreamPost
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీగా రూపొందుతున్న వకీల్ సాబ్ లోని మొదటి ఆడియో సింగల్ ఇవాళ లిరికల్ వీడియో రూపంలో వచ్చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యూనిట్ దీన్ని విడుదల చేసింది. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సిద్ శ్రీరామ్ గాత్రంలో రామజోగయ్య శాస్త్రి సాహిత్యంతో తమన్ స్వరపరిచిన మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ మగువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అంటూ సమాజంలో స్త్రీ నిర్వర్తిస్తున్న బాధ్యతలను, గొప్పదనాన్ని వివరిస్తూ స్ఫూర్తినిచ్చే విధంగా సాగడం విశేషం.
ఈ మధ్య కాలంలో విమెన్ ఎంపవర్ మెంట్ గురించి వచ్చిన అద్భుతమైన గీతంగా దీన్ని చెప్పుకోవచ్చు. పదాల కూర్పు, సిద్ శ్రీరామ్ వాయిస్, తమన్ హార్ట్ టచింగ్ ట్యూన్ వెరసి మరోసారి మంచి మ్యూజికల్ ఆల్బం వస్తుందన్న హామీ కలిగించాయి. పాట ఉచ్చారణలో శ్రీరామ్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తుంది.
మథర్ తెరెసా, సుధా మూర్తి, దుర్గాభాయ్ దేశముఖ్, సరోజినీ నాయుడు, తిమ్మక్క లాంటి స్పూర్తిమణుల ఫోటోలను వీడియోలో చూపించడం ద్వారా పాట ఉద్దేశాన్ని స్పష్టపరిచారు. ఎక్కడా పవన్ కాని హీరొయిన్ ఇతర క్యాస్టింగ్ కాని ఎవరిని ఇందులో రివీల్ చేయలేదు.
నీ కాటుక కనులు విప్పారక పోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడక పోతే ఏ మనుగడ కొనసాగదుగా అంటూ అడుగుడుగునా మన నిత్య జీవితంలో మహిళ పోషించే పాత్రను శాస్త్రి వర్ణించిన తీరు మరోసారి అవార్డు తేవడం ఖాయం అనిపించేలా ఉంది. నీరు నీరు రైతు కంట నీరు తర్వాత ఈయన రాసిన మరో హృద్యమైన గీతంగా దీన్ని పేర్కొనవచ్చు. వకీల్ సాబ్ మీద ఇప్పటికే విపరీతమైన అంచనాలు ఉన్నప్పటికీ సినిమాలో ఏముందో ముందే తెలియపరిచే ఉద్దేశంతో మగువ మగువ ట్రాక్ ని రిలీజ్ చేసి మంచి పని చేశారు. మొత్తానికి విమెన్స్ డే నాడు పవన్ ఫ్యాన్స్ కి మాత్రమే కాక మహిళలకు ఒక మంచి పాట కానుక రూపంలో అందింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న వకీల్ సాబ్ మేలో విడుదల కానుంది.
Watch Song Here @ http://bit.ly/2vFya6e