iDreamPost
android-app
ios-app

సార్ ఆజ్ ఢిల్లీ మే…

సార్ ఆజ్ ఢిల్లీ మే…

ఢిల్లీ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారో అని టెన్షన్ తో టీవీ చూడటం మొదలుపెట్టింది దేవి.. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్పినట్లు AAP అధికారంలోకి వస్తుందా ? లేక “మోషా”మ్యాజిక్ తో బీజేపీ అధికారంలోకి వస్తుందా అన్న ఆలోచన దేవి మనసులో తిరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో AAP ఘన విజయం సాధించింది.. బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యింది. దాంతో నాయకులు ఢిల్లీ ఎన్నికల విషయంలో ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఒక్కొక్కరికి వాట్సాప్ లో మెసేజ్ చేసింది దేవి..

ముందుగా ఓడిపోయిన బాధలో ఉన్న అమిత్ షా కి మెసేజ్ చేసి ఓదార్చాలని ప్రయత్నం చేసింది.

దేవి: హాయ్ అమిత్!!

అమిత్ షా: హాయ్ దేవి..

దేవి: ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయారు కదా.. బాధగా ఉందా?

అమిత్ షా: ఎన్నికల్లో మేం ఓడినా నైతిక విజయం మాత్రం మాదే..

దేవి: అదెలా సాధ్యం.. ?

అమిత్ షా: పోయిన సారి 3 సీట్లే వచ్చాయి.. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఐదు సీట్లు పెరిగాయి. అంటే రెట్టింపు కన్నా ఎక్కువ సీట్లే పెరిగాయి.. దీన్ని బట్టి అర్ధం చేసుకో.. ఢిల్లీ ప్రజలు AAP పార్టీపై ఎంత వ్యతిరేకతో ఉన్నారో..

దేవి: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు, దేశంలో అన్నిచోట్లా గెలిచి,దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఎందుకు గెలవలేక పోతున్నారు…?

అమిత్ షా: ఇదంతా జమ్మూ కాశ్మీర్ బోర్డర్ లో పాకిస్తాన్ వాళ్ళు చేసిన కుట్ర.. అసలే కేజ్రీవాల్ ఉగ్రవాదాయె..

దేవి: ఉఫ్.. ఇప్పటికైనా అర్ధం అయ్యిందా ఆవు పాలిస్తుంది కానీ, ఓట్లివ్వదని…

అమిత్ షా: చెప్పానుగా పాకిస్తాన్ వాళ్ళు JNU లో కేజ్రీవాల్ తో కలిసి చేసిన కుట్ర ఇదని.. త్వరలో NRC,CAA ద్వారా దేశంలో దాక్కున్న ఉగ్రవాదుల పని పడతాం ..

దేవి: (చింత చచ్చినా పులుపు చావదనుకుంటా అని మనసులో అనుకుని) ఓహో.. సరే బై అమిత్ జై శ్రీరామ్..

అమిత్ షా: జై శ్రీరామ్

ఢిల్లీ వెళ్లిమరీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ని బీజేపీ ఓటమి బాధించిందేమో అనుకుని పవన్ కి మెసేజ్ చేసింది దేవి..

దేవి : నమస్తే కళ్యాణ్ గారు.. టీవీ చూస్తున్నారా?

పవన్ కళ్యాణ్ : నమస్తే దేవి.. టీవీ కాదు.. స్క్రిప్ట్ ఇంకా రాలేదేంటా అని చూస్తున్నా..

దేవి: బాధగా ఉంది కదా మీకు?

పవన్ కళ్యాణ్: అవును పింక్ మూవీ రీమేక్ స్క్రిప్ట్ ఇంకా రాలేదని బాధగా ఉంది..

దేవి: మీరు దేని గురించి మాట్లాడుతున్నారు.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడినందుకు బాధగా లేదా మీకు?..

పవన్ కళ్యాణ్ : అదేంటీ మొన్నే కదా ఎన్నికల్లో మోడీ గెలిచింది.. మళ్ళీ ఢిల్లీ ఎన్నికలు అంటావేంటి.. ?

దేవి: ఓహో సరే మీరు హ్యాపీగా సినిమా చేసుకోండి సర్.. బై..

పవన్ కళ్యాణ్ : నీ మెసేజ్ రావడం ఆలస్యం స్క్రిప్ట్ చేతికి వచ్చింది.. బై దేవి..

ఢిల్లీ ఫలితాల గురించి బాబు గారు ఏమంటారో కనుక్కుందాం అని దేవి బాబుకు మెసేజ్ చేసింది..

దేవి: నమస్తే బాబు గారు..

చంద్రబాబు: చెప్పమ్మా దేవి.. ఎలా ఉన్నావ్?

దేవి: నేను బానే ఉన్నాను.. టీవీ చూస్తున్నారా..

చంద్రబాబు: చూస్తున్నా దేవి.. నేను చెప్పినట్టే చేసాడు.. నేను అనుకున్నట్లే జరిగింది..

దేవి: ఏం చెప్పారు..? ఏం అనుకున్నారు ..?

చంద్రబాబు: కేజ్రీవాల్ కి ఎలా గెలవాలో చెప్పింది నేనే.. నేను చెప్పినట్లు చేసాడు కాబట్టి కేజ్రీవాల్ గెలిచాడు. అంతా నేను అనుకున్నట్టు జరిగింది.

దేవి: మీకింకా తగ్గలేదా?

చంద్రబాబు: అమెరికా పోతున్నానమ్మ..

దేవి: ఎందుకూ ట్రీట్మెంట్ కా.. ?

చంద్రబాబు: నాతో చమత్కారం వద్దమ్మా.. ట్రంప్ ని గెలిపించడానికి పోతున్న..

దేవి: అదేంటి అమెరికా ఎన్నికలకి ఇంకా టైం ఉందికదా.. అయినా నాకెందుకులే.. జాగ్రత్తగా వెళ్లి రండి..

మొన్న జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించిన హుషారులో ఉన్న కేసీఆర్ కు మెసేజ్ చేసింది దేవి..

దేవి: నమస్తే సార్.. టీవీ చూస్తున్నారా?

కేసీఆర్: చూస్తున్న బిడ్డ.. మస్తు ఖుషీగా ఉన్నా..

దేవి: ఎందుకు సార్ అంత సంతోషం..

కేసీఆర్: మొన్నే మునిసిపల్ ఎలక్షన్స్ లో కారుతో కమలాన్ని చిత్తుచిత్తుగా తొక్కి గెలిచాం బిడ్డ..ఇప్పుడేమో ఆ తొక్కిసలాటలో చిత్తైన కమలాన్ని చీపురుతో ఊడ్చేసిండ్రు.. అందుకే మస్తు ఖుషీగా ఉన్నా..

దేవి: మీరొక్కరే ఖుషీగా ఉంటే చాలా సర్..

కేసీఆర్: అట్లా అంటావేంది.. అల్లుణ్ణి తీసుకుని ఇంటికొచ్చెయ్.. పార్టీ చేసుకుందాం..

దేవి: ఇప్పుడే వస్తున్నా సర్..

కేసీఆర్: జల్దీ రా.. బోటి కూర వండిస్తా ..

ఢిల్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, మూడోసారి ఢిల్లీ పీఠం ఎక్కుతున్న కేజ్రీవాల్ ని అభినందించడానికి మెసేజ్ చేసింది దేవి..

దేవి: నమస్తే సార్..ఢిల్లీలో మళ్ళీ గెలిచినందుకు శుభాకాంక్షలు సర్..

కేజ్రీవాల్: థాంక్స్ అమ్మా.. “నాకు తగ్గింది దగ్గే కానీ ప్రజాదరణ కాదని ” ఈ ఫలితాలు నిరూపించాయి కానీ గెలిచినందుకు అంతగా సంతోషంగా లేదమ్మా..

దేవి: అదేంటి సర్. 62 సీట్లు గెలిచారుగా.. ఇంకెందుకు బాధ..

కేజ్రీవాల్: గత ఎన్నికల్లో 67 గెలిచాము.. ఇప్పుడేమో 5 తగ్గాయి.. అందుకే బాధగా ఉంది..

దేవి: (ఓడినోడు అక్కడే ఏడిస్తే గెలిచినోడు ఇంటికెళ్ళి ఏడ్చాడట అలా ఉంది మీ పరిస్థితి) అదేం లేదు సర్ ముందు గెలుపును ఎంజాయ్ చేయండి ముందు..

కేజ్రీవాల్: షుగర్ పేషేంట్ ని ఢిల్లీ ప్రజల క్షేమం కోసం నిరాహారదీక్ష చేసినా ఐదు సీట్లు వాళ్లకి ఇచ్చేసారమ్మ.. అందుకే గెలుపులోనూ విషాదం కనిపిస్తుంది నాకు..

దేవి: సరే సార్ .. ఐదు సీట్లు తగ్గాయి కదా అని నిరాహార దీక్షలు చేయకండి.. ఆరోగ్యానికి మంచిది కాదు..

కేజ్రీవాల్: ఉగ్రవాది అన్నా బాధపడలేదు నేను.. కానీ ఐదు సీట్లు నాకు రాకుండా చేసారని బాధగా ఉందమ్మా..

దేవి: (గెలుపులోనూ అలుపు చూడటం అంటే ఇదేనేమో) ఓకె హ్యాపీగా బాధపడండి సర్ ఉంటున్న బై…

కేజ్రీవాల్: బై అమ్మా..

Written By Anamika