iDreamPost
iDreamPost
జనసేన అధినేత తడవకో పార్టీతో పొత్తు పెట్టుకొన్నప్పుడో , క్రియాశీలంగా మారినప్పుడో , స్తబ్దుగా ఉన్నప్పుడో , ఎన్నికలప్పుడో , ఎన్నికలు ఏమీ లేక సినిమాలు చేస్తున్నప్పుడో ఇలా ప్రతి సందర్భంలో ఎవరో ఒక సీనియర్ నేత రాజీనామా చేయడం పరిపాటి అయిపోయింది.
ఈక్రమంలో భాగంగా ఈ రోజు జనసేన కీలక నేత గత ఎన్నికల్లో వైజాక్ నుండి ఎంపీ గా పోటీ చేసిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ vv లక్ష్మీనారాయణ సైతం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖలో కారణాలు పేర్కొంటూ పూర్తి జీవితం ప్రజాసేవకే అంకితమని గతంలో పేర్కొని ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తున్నారని కావున మీకు నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక్కడే లక్ష్మీనారాయణ గారి రాజీనామా ఉద్దేశ్యాన్ని అనుమానించాల్సి వస్తుంది . పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూ పార్టీకి , ప్రజలకి సమయం వెచ్చించలేదు అని ఆరోపిస్తే సబబు అనుకోవచ్చు.
Read Also: పవన్ కళ్యాణ్ కి మరో షాక్ – జేడీ రాజీనామా
కానీ విధి విధానాల్ని , సినిమాలకు కాలం వెచ్చించటాన్ని ఏ విధంగా ముడిపెడతారు . పార్టీ అధినేత పార్టీ కోసం సమయం వెచ్చించకుండా స్వలాభం కోసం కాలం గడపటంతో గతంలో నిర్దేశించుకొన్న విధి విధానాలు మారతాయా ??
విశ్లేషకుల అంచనా ఏంటంటే జనసేన 2019 ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించి ఎన్నికల తర్వాత కేంద్రంలో , రాష్ట్రంలో అధికారంలో భాగస్వామి అవుతుందని తద్వారా ఏదొక మంత్రి పదవి తనను వరిస్తుందని ఆశ పడ్డ మాజీ జేడీ తాను స్వయంగా ఓడిపోవటమే కాక జనసేనకి వచ్చిన ఫలితాలు చూసి కూడా డీలా పడ్డాడని సమాచారం.
ఈ ఎన్నికల అనంతరం కూడా పవన్ ప్రవర్తన రాజకీయ ఎత్తుగడలు ఏవిధంగానూ ఆశాజనకంగా లేకపోవడంతో జనసేనని వదిలించుకోవడానికి సరైన అదను కోసం ఎదురు చూస్తూ సినీ రంగ పునఃప్రవేశాన్ని సాకుగా చూపి తప్పుకొంటున్నాడని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు అన్ని వ్యాపారాలున్నాయా..? బాంబు పేల్చిన పవన్ కల్యాణ్
రాజకీయాల పై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకొని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న సీబీఐ ఉద్యోగాన్ని వదిలేసి జనసేనలో చేరిన మాజీ జేడీకి ఇక్కడా కాలం కలిసి రాలేదనే చెప్పొచ్చు . మరి వీరి భవిష్యత్ పయనం ఏ పార్టీ వైపో కాలమే చెప్పాలి.
ఇహ పవన్ గారికి నమ్మకంగా మిగిలిన నేతలు ఇద్దరే ఒకటి అన్న నాగబాబు , రెండూ సమ స్థాయిలో వ్యవహారాలు నడుపుతూ అంతర్గతంగా తాను బలపడుతున్న నాదెండ్ల మనోహర్ . నాగబాబు మోయక తప్పని బరువు . నాదెండ్ల పోతే మిగలదు ఆ కాస్త పరువు . ఇదీ ప్రస్తుతం పవన్ పరిస్థితి
కొసమెరుపు ఏంటంటే గతంలో ఓ సందర్భాన జగన్ సక్రమంగా పరిపాలిస్తే తాను సినిమాలు చేసుకొంటానని పవన్ చేసిన వ్యాఖ్యలు ఈ vv లక్ష్మీ నారాయణ గారు వినలేదేమో అని రిటైర్మెంట్ పై వైసీపీ అభిమానులు ట్రోల్ చేయడం విశేషం .