Idream media
Idream media
కరోనా వైరస్‌పై అపోహలొద్దు. అదేమీ రాకూడని వ్యాధి కాదు. వస్తే తగ్గని వ్యాధి కాదు. సాధారణ జ్వరం లాంటిదే కరోనా వైరస్ వ్యాధి. చికిత్స తీసుకుంటే తగ్గిపోతుంది. కాకపోతే వైద్యుల పర్యవేక్షణలో జాగ్రత్తగా ఉండాలి. వైరస్ లక్షణాలు ఉన్న వారు స్వచ్ఛందంగా ముందుకు రండి. పరీక్షలు చేయించుకోవడం వల్ల మీతోపాటు మీ కుటుంబ సభ్యులకు మంచిది. ఇదీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న విషయం.
కరోనా వైరస్ అంటే అనవసరమైన భయాందోళనలు వీడి, జాగ్రత్తగా ఉండాలని సీఎం వైఎస్ జగన్‌తోపాటు, వైద్యులు, అధికారులు చెబుతున్నారు. పత్రికలు, టీవీ ఛానెళ్లు ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. అయినా ప్రజల్లో మార్పు రాకపోతే.. ఒక్కసారి ఈ ఘటన గురించి తెలుసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా మరణం సంభవించింది. విజయవాడ శివారు కుమ్మరిపాలెంకు చెందిన సుభాని అనే 55 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తన ప్రమేయం లేకుండానే ఆయనకు వైరస్ సోకింది. సుభాని కుమారుడు గత నెల 14,15 తేదీల్లో ఢిల్లీలోని జమాత్ సదస్సుకు వెళ్లి 17వ తేదీన తిరిగి ఇంటికి వచ్చారు. కుమారుడు ద్వారా తండ్రికి వైరస్ సోకింది.
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నాలుగు రోజుల క్రితం ఢిల్లీ జమాత్‌కు వెళ్లి వచ్చిన వారికి కరోనా సోకిందని తేలడంలో ఆ సదస్సుకు వెళ్లి వచ్చిన సుభాని కుమారుడు కూడా వైద్య పరీక్షలకు విజయవాడలోని జనరల్ ఆస్పత్రికి వచ్చారు. ఆయన తండ్రి కూడా పరీక్షల నిమిత్తం వచ్చారు. 30వ తేదీన ఇద్దరి నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. సుభాని అప్పటికే షుగర్, బీపీ సమస్యలతో బాధపడుతుండంతో పరీక్షలు చేసిన గంటలోపే మరణించారని ప్రభుత్వం తెలిపింది. మరుసటి రోజు అంటే మార్చి 31వ తేదీన సుభాని కుమారుడు ఫలితాలు కూడా వచ్చాయి. అందులో కరోనా పాజిటివ్ అని తేలింది.
విషయం తెలిసి, అప్రమత్తం అయ్యే లోపు సుభాని ప్రాణాలు కోల్పోయారు. కుమారుడు కారణంగా తండ్రి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక్కడ తండ్రి చేసిన తప్పేమీ లేదు. కానీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కరోనా వైరస్ ప్రమాదం కాకున్నా.. అజాగ్రత్తగా ఉంటే మాత్రం ప్రాణాలు తీస్తుందని రుజువైంది. కరోనా వైరస్ కేవలం వృద్ధులు, పిల్లలు, గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ సోకిన వారిలో ఒకటి, రెండు శాతం మందే మరణిస్తున్నారు. అదీ కూడా వారికి అంతకు ముందే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటేనే ప్రాణాపాయం ఉంటోంది. లేదంటే వృద్ధులైనా సరే కోలుకుంటున్నారు. ఇక యువకులు, 50 ఏళ్ల లోపు వారికి ఎలాంటి హాని జరగదు. ప్రాణపాయం అస్సలే ఉండదు.
సుభాని ఘటన తర్వాతైనా రాష్ట్ర ప్రజల్లో మార్పు రావాలి. కరోనా వైరస్ అనేది ఎవరికైనా వస్తుందని తెలుసుకోవాలి. దగ్గు, జలుబు ఉంటే.. కరోనా కాదు. కానీ పరీక్షలు చేయించుకోవడం వల్ల తప్పేమీ లేదన్న విషయం మైండ్‌కు ఎక్కించుకోవాలి. దాని వల్ల తమతోపాటు తమ కుటుంబంలోని తల్లి తండ్రి, భార్య బిడ్డలకు శ్రేయష్కరం. నిర్లక్ష్యం, భయం, ఆందోళన, బిడియం, అవమానం.. వదిలేయాలి. కరోనా ఏమీ ఎయిడ్స్ వ్యాధి కాదన్న విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మన ప్రమేయం లేకుండానే అది వస్తుంది.. చికిత్స తీసుకుంటే పోతుందని గుర్తించాలి. ఈ విపత్కర కాలంలో అప్రమత్తతే మనకు రక్ష.. అని ప్రతి ఒక్కరూ నిత్యం మననం చేసుకోవాలి.
ఢిల్లీ వెళ్లి వచ్చిన వారే కాదు, వారి సన్నిహితులు, బంధువులు, వారితో దగ్గరగా ఉన్న వారే కాదు.. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సూచనలు పాటించాలి. ఇందు కోసం మనం చేయాల్సింది 104కి ఫోన్ చేయడమే. రూపాయి ఖర్చు లేకుండా పరీక్షలు చేసి, అవసరం అనుకుంటే చికిత్స కూడా ఉచితంగా అందిస్తారు.