iDreamPost
android-app
ios-app

బాబు హయాంలో వైసీపీ నేతలకు పదవులు ఇచ్చి కోవర్ట్ లను తయారు చేశాడా?

బాబు హయాంలో వైసీపీ నేతలకు పదవులు ఇచ్చి కోవర్ట్ లను తయారు చేశాడా?

తన ప్రభుత్వ హయాంలో తన పార్టీకి ఓట్లేయని వారికి ప్రభుత్వ పథకాలు ఎందుకివ్వాలని ప్రశ్నించిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకంగా వైఎస్సార్‌సీపీ నేతకు ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చారు. అవును.. మీరు చదువుతున్నది నిజమే. ఈ విషయం స్వయంగా చంద్రబాబే చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కర్నూలుకు చెందిన బిర్రు ప్రతాప్‌ రెడ్డి అనే వ్యక్తి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అయితే ఈయన వైఎస్సార్‌సీపీ నేత అని తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. చంద్రబాబు మాటలు విన్న తెలుగు తమ్ముళ్లు వైఎస్సార్‌సీపీ నేతకు రాష్ట్ర స్థాయి పదవి ఎలా ఇచ్చారంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఏ ప్రయోజనం, కారణం లేకుండా చంద్రబాబు ఏమీ చేయరన్న విషయం రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో పొత్తు కోసం ఏకంగా కాంగ్రెస్‌ జెండానే చంద్రబాబు మొడలో వేసుకున్నారు. ఇప్పుడు తాను పదవి ఇచ్చిన తన పార్టీ నేతను.. వైఎస్సార్‌సీపీ నేత అని చెప్పడం వెనుక కూడా ఓ కారణం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతో మొత్తం రిజర్వేషన్లు 59.85 శాతానికి చేరుకున్నాయి. రిజర్వేషన్లు 50 శాతం దాటడం రాజ్యాంగ విరుద్ధమంటూ బిర్రు ప్రతాప్‌ రెడ్డి హైకోర్టు, సుప్రిం కోర్టులకు వెళ్లారు. ఈ వ్యవహారంలో బిర్రు ప్రతాప్‌ రెడ్డి గెలిచారు. 50 శాతం లోపే రిజర్వేషన్లు ఉండాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో బీసీలకు కేటాయించిన 34 శాతం రిజర్వేషన్లలో 9.85 శాతం కోత పడుతోంది.

తమది బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు.. తన పార్టీకి చెందిన బిర్రు ప్రతాప్‌ రెడ్డి వల్ల బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు పోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇది చివరికి తమ మెడకు చుట్టుకుంటుందని భయపడుతున్నారు. ఫలితంగా బీసీలకు మరింత దూరమవుతారని భావించిన చంద్రబాబు.. ఆ నెపం వైఎస్సార్‌సీపీపై నెట్టేందుకు నడుం బిగించారు. కళ్లార్పకుండా, మాట తదబడకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబుకు మరొకరు సాటి రారనే పేరును నిజం చేస్తూ బిర్రు ప్రతాప్‌ రెడ్డి వైఎస్సార్‌సీపీ వ్యక్తేనని నిన్న మీడియా ముఖంగా ప్రకటించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వైఎస్‌ జగన్‌లతో అతను ఫొటోలు దిగాడని, రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడంటూ చెప్పుకొచ్చారు.

చంద్రబాబు చెప్పినట్లు బిర్రు ప్రతాప్‌ రెడ్డి వైఎస్సార్‌సీపీ నేత అయితే… ఆయనకు తన హాయంలో ఉపాధి హామీ పథకం రాష్ట్ర డైరెక్టర్‌ పదవి ఎలా ఇచ్చారో ఆయనే చెప్పాలి. ప్రజలకు కాకపోయినా కనీసం తన పార్టీ వారికైనా ఆ రహస్యం చంద్రబాబు చెప్పడం కనీస ధర్మం. టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తే.. తనకు తెలియకుండానే ఆయనకు పదవి వచ్చిందని చంద్రబాబు చెప్పినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక వేళ చంద్రబాబు ఇలా చెప్పినా.. తప్పించుకునే అవకాశం లేదు. ఎందుకంటే తనకు పదవి ఇచ్చిన సందర్భంగా బిర్రు ప్రతాప్‌ రెడ్డి చంద్రబాబుకు, తన రాజకీయ గురువు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి, బాబూ రాజేంద్రప్రసాద్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయం తెలుగుదేశం అనుకూల పత్రికైన ఈనాడులోనే వచ్చింది. ఆ వార్త క్లిప్పింగ్‌ చూపిస్తే చంద్రబాబు ఏమంటారో..?