Idream media
Idream media
బిహార్ ఎన్నికల్లో నడుస్తోన్న పొత్తు రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ, జేడీయూ కూటమి, కాంగ్రెస్, ఆర్‌జేడీ కూటమిగా పోటీ చేస్తుండగా ఎల్ జె పి.. జేడీయూతో విభేధించి ఒంటరిగా పోటీలో నిలిచింది. మూడు దశల్లో జరగాల్సిన బిహార్ ఎన్నికల్లో తొలి దశ పూర్తయింది. ప్రస్తుతం రెండో దశ పోలింగ్ ప్రచారం సాగుతోంది. ఆయ పార్టీల రాజకీయ నాయకుల విమర్శలు, ప్రకటనలతో బిహార్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
ఇటీవల ఎల్ జె పి చీఫ్ చిరాగ్ పాశ్వాన్ చేసిన ప్రకటన బిహార్ ఎన్నికలను రసవత్తరంగా మార్చాయి. బిహార్‌లో వచ్చేది బీజేపీ, ఎల్ జె పి ప్రభుత్వమేనని చిరాగ్ పాశ్వాన్ చేసిన ప్రకటన సంచలనమైంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, జేడీయూ మధ్య, కాంగ్రెస్, ఆర్‌జేడీల మధ్య పొత్తు నడుస్తోంది. ఒంటిరిగా పోటీ చేస్తున్న ఎల్ జె పి .. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ, ఎల్ జె పి ప్రభుత్వమేనని ఆ పార్టీ ఛీప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ.. జేడీయూతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుంటే.. ఎల్ జె పి తో కలసి బీజేపీ ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే సందేహం అందరికీ రావొచ్చు.
రాజకీయాల్లో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఇది బిహార్ రాజకీయాల్లో ఇప్పటికే ఒక సారి నిరూపితమైంది. ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్న జేడీయూ చీఫ్ నితీష్ కుమార్.. నాడు బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎన్నికైన నరేంద్ర మోదీ నాయకత్వాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చారు. ఆ తర్వాత జరిగిన బిహార్ శాసన సభ ఎన్నికల్లో ఆర్‌జేడీతో పొత్తుపెట్టుకుని పోటీ చేశారు. ఆర్‌జేడీ కన్నా జేడీయూ తక్కువ సీట్లు సాధించినా.. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం నితీష్‌కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. బీజేపీ ప్రతిపక్ష స్థానంలో కూర్చుంది. ఆ తర్వాత ఏడాదిన్నరకే నితీష్‌కుమార్.. ఆర్‌జేడీకి హ్యాండ్ ఇచ్చి బీజేపీతో మళ్లీ జతకట్టారు. ఆర్‌జేడీ, జేడీయూ ప్రభుత్వం పోయి.. మళ్లీ నితీష్‌కుమార్ ముఖ్యమంత్రిగా బీజేపీ, జేడీయూ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఎన్నికల్లోనూ బీజేపీతో కలసి పోటీ చేస్తున్నారు.
వాస్తవంగా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఎన్‌డీఏలో భాగంగా బీజేపీ, జేడీయూ, ఎల్ జె పి లు కలసి పోటీ చేయాల్సి ఉంది. అయితే సీట్ల పంపిణీలో జేడీయూతో విభేదాలు తలెత్తడంతో కూటమి నుంచి ఎల్ జె పి వైదొలగింది. జేడీయూకు వ్యతిరేకంగా ప్రస్తుతం ఎల్ జె పి రాజకీయాలు చేస్తోంది. జేడీయూ అభ్యర్థులు బరిలో ఉన్న చోట ఎల్ జె పి పోటీ చేస్తోంది. బీజేపీతో సఖ్యతగా ఉంటూనే.. మరో వైపు బీజేపీ మిత్రపక్షమైన జేడీయూపై ఎల్ జె పి చీఫ్ చిరాగ్ పాశ్వాన్ నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ, ఎల్ జె పి ప్రభుత్వం వస్తుందనే ప్రకటనలు చేస్తున్నారు. ఇది అసాధ్యం కాదని నితీష్‌కుమార్ నిరూపించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయా పార్టీలకు వచ్చే సీట్లను బట్టీ బిహార్ రాజకీయం సరికొత్త మలుపులు తిరిగే అవకాశం ఉంది. పోయిన సారి ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసి మరీ ఆర్‌జేడీకి హ్యాండ్ ఇచ్చిన నితీష్‌కుమార్‌కు.. ఇప్పుడు బీజేపీ ద్వారా అదే అనుభవం ఎదురుకాబోతోందా..? లేదా..? అనేది వేచి చూడాలి.