Idream media
Idream media
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీలో కాషాయి జెండా ఎగురువేయాలన్న బీజేపీ ఆశలు ఈ సారి కూడా అడియాశలైయ్యాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలకు చెక్ పెడుతూ.. రికార్డు మెజారిటీతో 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. అదే ఒరవడిని కొనసాగిస్తూ 2019లోనూ బీజేపీ ఘన విజయం సాధించి.. ప్రధానిగా మోదీ రెండో సారి బాధ్యతలు చేపట్టారు. 2013, 2015 ఎన్నికల్లో ఢిల్లీలో గెలుపు బావుటా ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. కేజ్రీవాల్ రూపంలో బీజేపీకి పెద్ద అడ్డంకి ఏర్పడింది. 2020లోనైనా కమలం వికచించేలా చేయాలన్న బీజేపీ పెద్దల ప్రయత్నాలు ఫలించడంలేదు. ఈ రోజు వెలువడుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ఆప్ స్పష్టమైన ఆధిక్యంతో ముందుకువెళుతోంది.
స్వాతంత్ర భారతం తర్వాత 1952లో ఢిల్లీ అసెంబ్లీ (48 సీట్లు)కి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం పీఠాన్ని సాధించింది. కాంగ్రెస్ 39 సీట్లు గెలవగా.. బీజేపీ ఐడు సీట్లకు పరిమితమైంది. సోషలిస్ట్ పార్టీ 2, అఖిల భారతీయ హిందూ మహాసభ ఒక స్థానంలోనూ, మరోస్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
1952లో సీ కేటగిరిలో ఉన్న ఢిల్లీ.. ఆ తర్వాత ఏర్పాటైన స్టేట్ రియార్గనేజేషన్ కమిషన్ (ఎస్‌ఆర్‌సీ) ప్రక్రియ వల్ల ఢిల్లీ అసెంబ్లీ రద్దయి, కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించింది. తిరిగి 1991లో 69వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర పాలిత ప్రాంతంతోపాటు శాసన సభ ఏర్పాటుకు అవకాశం కల్పించారు.
ఈ నేపథ్యంలోనే 1993లో ఢిల్లీ శాసన సభకు తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుబి మోగించింది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 49 సీట్లు గెలుచుకుంది. చిన్న వయస్సులోనే దివంగత కేంద్ర మంత్రి సుస్మా స్వరాజ్ సీఎం పీఠం అధిరోహించారు. 14 సీట్లతో కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. జనతాదల్ నాలుగు, స్వతంత్రులు మూడు చోట్ల గెలిచారు.
1998 ఎన్నికల్లో హస్తం పార్టీ ఢిల్లీ పీఠాన్ని గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 52 సీట్లు గెలుకుని అధికార బీజేపీని మట్టికరిపించింది. బీజేపీ 15 స్థానాలకు పరిమితమైంది. మిగిలిన మూడు స్థానాల్లో స్వతంత్రులు, ఇతర పార్టీలు గెలిచాయి. కాంగ్రెస్ తరఫున దివంగత నేత షీలా దీక్షిత్ ముఖ్యమంత్రి అయ్యారు.
2003 ఎన్నికల్లోనూ 1998 ఎన్నికల ఫలితాలే రిపీట్ అయ్యాయి. వరుసగా రెండో సారి కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. 47 స్థానాలు గెలుచుకుని షీలా దీక్షిత్ రెండో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. బీజేపీ 20 స్థానాలు గెలుచుకుంది. ఎన్సీపీ, జేడీఎస్, స్వతంత్రులు ఒక్కొక్క చోట గెలుపొందారు.
2008 ఎన్నికల్లోనూ హస్తం పార్టీ గెలిచి..హాట్రిక్ కొట్టింది. 43 స్థానాలతో వరుసగా మూడో సారి షీలా దీక్షిత్ సీఎంగా ఎన్నికయ్యారు. బీజేపీ ఈ సారి కూడా ప్రతిపక్ష స్థానానికే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 23 సీట్లు గెలుచుకుంది. బీఎస్పీ 2, లోక్‌జనసత్తా పార్టీ 1, స్వతంత్రులు ఒక్క స్థానంలో గెలుపొందారు.
2013 ఎన్నికల్లో ఢిల్లీలో త్రిముఖ పోరు నడిచింది. ఫలితంగా ఢిల్లీ అసెంబ్లీ చరిత్రలో తొలిసారి హంగ్ ఏర్పడింది. 70 స్థానాలకు గాను బీజేపీ 31 సీట్లు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. తొలిసారి పోటీ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ ఎనిమిది స్థానాలకు పడిపోయింది. కాంగ్రెస్ మద్దతుతో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా మాజీ ఐఆర్‌ఎస్ అధికారి అయిన అర్వింద్ కే జ్రీవాల్ బాధ్యతలు చేపట్టారు.
సంకీర్ణ ప్రభుత్వం కేవలం 13 నెలల మాత్రమే కొనసాగింది. సీఎం అర్వింద్ కేజ్రీవాల్ రాజీనామాతో 2015లో ఫిబ్రవరిలో ఢిల్లీ శాసన సభకు మళ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. 67 సీట్లు గెలుచుకుని ఢిల్లీ అసెంబ్లీలో రికార్డు విజయం సాధించింది. మిగిలిన మూడు స్థానాల్లో బీజేపీ గెలిచింది. సంకీర్ణ ప్రభుత్వంలో ఆప్‌ను ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. చరిత్రలో తొలిసారిగా ఆ పార్టీ కనీసం భోణి చేయలేదు.
1993 తర్వాత వరుసగా పదిహేనేళ్లు పాటు అధికారానికి దూరమైన బీజేపీ 2013, 2015 ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేపట్టాలన్న కృతనిశ్చయంతో పని చేసింది. అయితే ఆ పార్టీ ఆశలు అడియాశలయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీపై కాషాయ జెండా ఎగురవేయాలని పట్టుదలతో పని చేసింది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతోపాటు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల సీఎంలు ఢిల్లీలో ప్రచారం చేశారు. అయినా బీజేపీ ఆశలు ఈ సారి కూడా ఫలించలేదు. మరోసారి ఆప్‌కే దేశ రాజధాని ప్రజలు మద్దతు పలికారు. హస్తిన సీఎంగా మూడో సారి కేజ్రీవాల్ బాధ్యలు చేపట్టడం లాంఛనమే. 22 ఏళ్లుగా బీజేపీకి ఢిల్లీ అందని ద్రాక్షాగానే మిగిలింది.