iDreamPost
android-app
ios-app

మణిపూర్‌లో పతనం అంచున బిజెపి సంకీర్ణ ప్రభుత్వం

మణిపూర్‌లో పతనం అంచున బిజెపి సంకీర్ణ ప్రభుత్వం

కరోనా విలయతాండవం ఒకవైపు చైనా సరిహద్దులలో ఉద్రిక్తతలు మరోవైపు భారత్‌ను కుదిపేస్తున్నాయి. కానీ దేశంలో రాజకీయాల పార్టీల ఎత్తులు పై ఎత్తులకు మాత్రం విరామం ఉండడం లేదు. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేల రాజీనామా,భాగస్వామ్య పక్షాల మద్దతు ఉపసంహరణతో మణిపూర్‌లో ఎన్. బీరెన్ సింగ్ నాయకత్వంలోని బిజెపి సంకీర్ణ ప్రభుత్వం పతనం అంచున నిలిచింది.

బుధవారం బిజెపి,తృణమూల్,నేషనల్ పీపుల్స్ పార్టీలకు చెందిన మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు అధికారపక్షంను వీడి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిజెపికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సుభాష్ చంద్ర, టీటీ హాకిప్, శామ్యూల్ జెందాయ్ కాషాయం వదిలి హస్తం గూటికి చేరుకున్నారు.అలాగే నలుగురు మంత్రులు కూడా బీరెన్ సింగ్ మీద అసమ్మతి ప్రకటించి తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో డిప్యూటీ సీఎం జైకుమార్ సింగ్, గిరిజన శాఖ మంత్రి కయిషి, క్రీడా శాఖ మంత్రి లెట్ పావ్ హాకిప్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జయంతకుమార్ సింగ్ కూడా ఉన్నారు.అంతేకాకుండా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న నాగా పీపుల్స్ ఫ్రంట్,జిరిబామ్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న స్వతంత్ర ఎమ్మెల్యే బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్. బీరెన్ సింగ్ నేతృత్వంలోని బిజెపి సంకీర్ణ ప్రభుత్వం అసెంబ్లీలో బలం కోల్పోయి మైనార్టీలో పడింది.

మణిపూర్ అసెంబ్లీలో స్థానాల సంఖ్య 60 కాగా మెజారిటీకి 31 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.తాజాగా బిజెపి సారధ్యంలోని ఎన్డీయే బలం 18 కి పడిపోగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం కాంగ్రెస్ పార్టీ సాధించింది.

2017 మార్చిలో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలలో 28 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉద్భవించింది.ఆ ఎన్నికలలో బిజెపి పార్టీ నుండి 21 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచారు.అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా అవతరించి,మెజార్టీకి దగ్గరగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి గవర్నర్ నజ్మా హెప్తుల్లా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వలేదు.అసెంబ్లీలో మెజారిటీకి దూరంగా నిలిచి 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉన్న బీజేపీ పార్టీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.

కేంద్రంలోని మోడీ-అమిత్ షా ద్వయం అండదండలతో ఎన్. బిరెన్ సింగ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్ యేతర ఎమ్మెల్యే లందరి మద్దతు కూడగట్టుకుంది. మణిపూర్‌లో గవర్నర్ రాజ్యాంగ సాంప్రదాయాలకు తిలోదకాలు వదలడంతో ఏర్పడిన బిరెన్ సింగ్ ప్రభుత్వం మూడు సంవత్సరాల రెండు నెలలకు పైగా అధికారంలో కొనసాగుతోంది. కానీ ఎన్‌పిఎఫ్, ఎన్‌పిపి, తృణమూల్ పార్టీల మద్దతు ఉపసంహరణ,స్వపక్ష ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధం కావాల్సి ఉంది.

ఇక 2014 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రంలో నరేంద్ర మోడీ అధికార పీఠం అధిరోహించిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలలో బిజెపి హవా మొదలైంది.దీంతో ఒక్కొక్క రాష్ట్రాన్ని చేజార్చుకుంటూ కాంగ్రెస్ అధికారానికి దూరమయింది.మణిపూర్ వంటి రాష్ట్రాలలో బలమైన నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ అమిత్ షా రాజకీయ చాణక్యంతో 2017 మార్చి 15న తృటిలో అధికార పీఠం నుండి దూరంగా లాగ బడింది.

గత రాజకీయ పరిణామాలు ఏమైనప్పటికీ ప్రస్తుతం మణిపూర్‌లో రాజకీయ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఓక్రామ్ ఇబోబి సింగ్ మరొకసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడం ఖాయమైనట్లే భావించవచ్చు.