iDreamPost
android-app
ios-app

మళ్ళీ ఎన్నికలు పెట్టినా మార్పేముంటుంది మహాశయా..?!

మళ్ళీ ఎన్నికలు పెట్టినా మార్పేముంటుంది మహాశయా..?!

ఆడలేక మద్దెల ఓడ అన్న చందంగా ఉంది ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీల తీరు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అలా ప్రకటించారో లేదో.. అందరూ కూడబలుక్కుని మాట్లాడినట్లుగా ఎన్నికలను మళ్లీ మొదట్నుంచి జరపాలని డిమాండ్‌ చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నుంచి మొదలుకుని జనసేనాని పవన్‌ కళ్యాణ్, బీజేపీ సారధి కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ రామకృష్ణ, చివరకు కాంగ్రెస్‌ నూతన సారధి సాకే శైలజానాథ్‌ వరకూ అందరూ ఒకే పాట పాడారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలు ఎక్కువగా ఏకగ్రీవమయ్యాయనే ఒకే ఒక్క ఉమ్మడి కారణాన్ని వారందరూ చెప్పారు.

ప్రతిపక్షాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వ్యవహరించాలనే రీతో ఆయా పార్టీల నేతలు ఈ ప్రకటనలు చేసినట్లు స్పష్టం అర్థమవుతోంది. ఎన్నికలను మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలనే డిమాండ్‌ చేయడం వారికి బాగానే ఉన్నా.. దాని వల్ల ఆయా పార్టీలు సాధించేదేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. స్థానిక సంస్థల్లో ఆయా పార్టీలు దాఖలు చేసిన నామినేషన్ల సంఖ్యను పరిశీలిస్తే.. అవి ఎంత బలంగా ఉన్నాయో అర్థమవుతుంది. టీడీపీ మినహా ఏ పార్టీ కూడా చెప్పకోదగ్గ స్థాయిలో నామినేషన్లు దాఖలు చేయలేదు.

రాష్ట్రంలో 9696 ఎంపీటీసీ, 652 జడ్పీటీసీలకు ఎన్నికల నోటిఫికే షన్‌ జారీ చేయగా.. 50,064.,  4,778 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ అత్యధికంగా ఎంపీటీసీ స్థానాలకు 23,121, జడ్పీటీసీ స్థానాలకు 1866 నామినేషన్లు దాఖలు చేసింది. ఆ తర్వాత స్థానంలో టీడీపీ నిలిచింది. టీడీపీ 18,242., 1413 చొప్పున నామినేషన్లు దాఖలు చేసి అధికార పార్టీకి పోటీగా నిలిచింది. పొత్తు పెట్టుకుని మరీ పోటీ చేసిన బీజేపీ, జనసేనలు కనీసం సగం స్థానాలకు కూడా నామినేషన్లు దాఖలు చేయలేదు. బీజేపీ 1816., 433, జనసేన 2,027., 270 చొప్పున నామినేషన్లు వేశాయి. ఇక రామకృష్ణ సారథ్యం వహిస్తున్న సీపీఐ ఎంపీటీసీ స్థానాలకు 238, జడ్పీటీసీ స్థానాలకు 40 నామినేషన్లు వేసింది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ కూడా సీపీఐతో పోటీ పడింది. ఎంపీటీసీలకు 395, జడ్పీటీసీలకు 368 నామినేషన్లు దాఖలు చేసింది.

నామినేషన్ల గణాంకాలు పరిశీలిస్తే అందరికీ అర్థమయ్యే ఒకే ఒక్క విషయం.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మినహా మరే పార్టీ కూడా కనీసం పోటీనిచ్చే స్థాయిలో నామినేషన్లు దాఖలు చేయలేదు. రాష్ట్రంలో తామే మూడో ప్రత్యామ్నాయం, 2024లో మేము అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న బీజేపీ, జనసేల పార్టీలు రెండూ కలసి 9696 ఎంపీటీసీ స్థానాలకు కేవలం 3843 నామినేషన్లనే దాఖలు చేసింది. ఒక్కొ స్థానానికి ఒక్కొక్క నామినేషన్‌ను పరిగణలోకి తీసుకున్నా.. ఇంకా 5853 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులే లేరని చెప్పవచ్చు. ఇక సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీల గురించి రాయాలంటే.. ఒక వాక్యానికి ఎక్కువ.. రెండు వాక్యాలకు తక్కువ అనే పరిస్థితి.

అన్ని స్థానాలకు కాకపోయినా కనీసం చెప్పకొదగ్గ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసినా.. ఆ పార్టీలు చేస్తున్న రీ నోటిఫికేషన్‌ అనే డిమాండ్‌లో అర్థం ఉంటుంది. నామినేషన్లు వేసిన టీడీపీ అభ్యర్థులు సైతం వైసీపీ గాలికి తలవంచి.. ఎందుకొచ్చిన ఖర్చు అంటూ.. నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. అందుకే దాదాపు 2400 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అలాంటిది స్థానిక సంస్థల ఎన్నికలను మళ్లీ మొదటి నుంచి నిర్వహించినా.. ఈ పార్టీలు ఇప్పుడు దాఖలు చేసిన సంఖ్య కన్నా ఎక్కువ నామినేషన్లు దాఖలు చేయగలవా..? అంటే నిస్సందేహంగా చేయలేవనే చెప్పవచ్చు. మరి మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చినా.. మార్పు ఏముంటుంది మహాశయా..?. తర్కం లేని డిమాండ్‌ చేస్తున్న పార్టీలు.. పంచాయతీలు, పురపాలికలకు కేంద్రం నుంచి రావాల్సిన 5800 కోట్ల రూపాయల గురించి మాత్రం ఏ చింతాలేనట్లుగా ఉన్నాయి.