iDreamPost
iDreamPost
బాలయ్య సినిమా మరేదైనా టైమ్ లో విడుదలవుతుంటే అంచనాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ ఆయన సంక్రాంతికి వస్తున్నాడంటే మాత్రం అంచనాలు మామూలుగా ఉండవు. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ అలా ఉంది మరి. పండక్కి వస్తే కచ్చితంగా బాక్సాఫీస్ కొల్లగొడతాడు బాలయ్య. గతంలో ఒకట్రెండు సార్లు మినహా చాలా సార్లు బాలయ్య బాక్సాఫీస్ ను కుమ్మేసాడు. ఇప్పుడు ఈయన సంక్రాంతికి జై సింహా అంటూ వస్తున్నాడు. ఓ వైపు అచ్చొచ్చిన సింహా టైటిల్.. మరోవైపు నయనతార.. ఇంకోవైపు సంక్రాంతి పండగ ఇలా అన్ని సెంటిమెంట్లను కలుపుకుని వస్తున్నాడు ఈ హీరో. జనవరి 12న జై సింహా విడుదల కానుంది. జై సింహాను కేవలం 70 రోజుల్లోనే పూర్తి చేసాడు నటసింహ.
ఈ మధ్యే ఈ చిత్ర సెన్సార్ పూర్తయింది. యు బై ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే సినిమా ఫస్టాఫ్ అంతా ఎంటర్ టైనింగ్ గానే సాగుతుందని తెలుస్తుంది. ఒకట్రెండు సీన్స్ అయితే కడుపులు చెక్కలయ్యేలా దర్శకుడు కేఎస్ రవికుమార్ డిజైన్ చేసాడని తెలుస్తుంది. దానికితోడు బ్రాహ్మణుల గురించి బాలయ్య చెప్పే సీన్ చాలా బాగుంటుందని.. ఆ ఒక్క సీన్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నాడు సి కళ్యాణ్. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందని.. సెకండాఫ్ లో మరో బాలయ్య విశ్వరూపం చూపిస్తాడని వినిపిస్తున్న వార్తలు. దానికితోడు సెకండాఫ్ లో వైజాగ్ సిటీలో 1500 మంది జూనియర్ ఆర్టిస్టులతో తెరకెక్కించిన యాక్షన్ సీన్ మేజర్ హైలైట్ అంటున్నాడు దర్శకుడు కేఎస్ రవికుమార్. రొటీన్ కథ ఉండటం ఒక్కటే జై సింహాకు కాస్త మైనస్ కానుందని తెలుస్తుంది. ఈ ఏజ్ లోనూ బాలయ్య చేసిన డాన్సులు.. ఫైట్లు చూసి అభిమానులు మాత్రం ఫిదా అయిపోతారంటున్నారు సెన్సార్ సభ్యులు. సి కళ్యాణ్ ఈ చిత్రానికి నిర్మాత. మరి చూడాలిక.. జై సింహా రచ్చ ఎలా ఉండబోతుందో..?