iDreamPost
android-app
ios-app

జాకీలు పెట్టి లేపినా అమరావతి ఉద్యమం విఫలం: ఐవైఆర్‌

జాకీలు పెట్టి లేపినా అమరావతి ఉద్యమం విఫలం: ఐవైఆర్‌

అమరావతి ఉద్యమం పేరుతో టీడీపీతో సహా బీజేపీ, జనసేన నేతలు చేస్తున్న ఆందోళనలపై బీజేపీ నేత, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు మరోసారి విమర్శలు గుప్పించారు. మూడు రాజధానుల ప్రక్రియకు వ్యతిరేకంగా మీడియాలోని ఒక వర్గం, తెలుగుదేశం పార్టీ జాకీలు పెట్టి లేపినా ప్రజల నుంచి స్పందన కరువైందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైన వారంలోనే దావానంలాగా రాష్ట్రం అంతా వ్యాపించిందని గుర్తు చేశారు. అమరావతి ఉద్యమం విఫలమైన విషయాన్ని ఇకనైనా బీజేపీ, జనసేన కూటమి గ్రహించాలని సూచించారు. తమ ఎదుగుదలకు ఇంకేదైనా అజెండాను ఎంచుకొని ముందుకు పోతే మంచిదని స్పష్టం చేశారు. ట్విట్టర్‌ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర అభివృద్ధికి పరిపాలనా వికేంద్రీకరణ అవసరమని ఐవైఆర్‌ కృష్ణారావు మొదటి నుంచీ వాదిస్తూనే ఉన్నారు. అమరావతి అనేది సాధ్యం కాని ఒక అభూత కల్పనని ఎన్నోసార్లు చెప్పారు. లక్షల కోట్లు అక్కడ ఖర్చు పెట్టడమంటే రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టడమేనని స్పష్టం చేశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే అక్కడ చంద్రబాబు రాజధానిని పెట్టారని విమర్శలు చేశారు. అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్న విశాఖను రాజధానిగా ఎంపిక చేయడం వల్ల రాష్ట్రానికి ఎంతో ఖర్చు తగ్గడంతోపాటు మరో 10–15 ఏళ్లలోనే హైదరాబాద్‌తో పోటీపడగలదని పేర్కొన్నారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు.. మూడు రాజధానుల ప్రక్రియకు అడ్డుపడతాడని, దాన్ని సమర్థంగా ఎదుర్కోవాలని సీఎం వైఎస్‌ జగన్‌కు సూచించిన విషయం తెలిసిందే.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకించినా ఆ పార్టీ నేత ఐవైఆర్‌ సపోర్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లిష్‌ మీడియం పేదలకు ఎంతో అవసరమని ఆయన గతంలో తేల్చిచెప్పారు. తెలుగుదేశం ఉచ్చులో పడి మోసపోవద్దని బీజేపీకి అప్పట్లోనే సూచించారు.