ఉత్తరాంధ్రలో వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు జనసేనాని పవన్ కల్యాణ్. అయితే యాత్ర రెండో రోజే ఆయనకు పోలీసులు షాక్ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌కు వైజాగ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రలో భాగంగా నిన్న విశాఖపట్నంలో జరిగిన సభలో ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పోలీసులు అన్నారు. ఈ యాత్రలో ఇకపై ఇలా రెచ్చగొట్టేలా వ్యవహరించకూడదని నోటీసుల్లో పేర్కొన్నారు. బహిరంగ సభలో పవన్ కల్యాణ్ నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు చెప్పారు.
వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ ఇలా వ్యవహరించకూడదని నోటీసుల్లో వెల్లడించారు పోలీసులు. ఈ మేరకు విశాఖ తూర్పు ఏసీపీ పవన్‌కు నోటీసులు ఇచ్చారు. పవన్ కల్యాణ్‌కు నోటీసులు ఇచ్చిన పోలీసులు.. రుషికొండలో ఆయన పర్యటనపై ఆంక్షలు విధించారు. జోడుగుళ్లపాలెం నుంచి ఎవర్నీ అనుమతించబోమని.. ర్యాడిసన్ బ్లూ హోటల్ నుంచి పవన్ కల్యాణ్ వెహికిల్‌కు అనుమతి ఉందన్నారు పోలీసులు. రుషికొండలోని నిర్మాణాల వద్దకు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి అని పోలీసులు చెబుతున్నారు.
అయితే పవన్ కల్యాణ్ రోడ్డు మార్గంలో అక్కడికి వెళ్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పోలీసులు స్పష్టం చేసినట్లు సమాచారం. పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు రోడ్డపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. రుషికొండకు వెళ్లే రూట్లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. రుషికొండ వద్ద రోడ్డుకు కుడివైపున వెళ్లొద్దని ఆంక్షలు విధించారు పోలీసులు. అక్కడ ఎడమవైపున మాత్రమే వెళ్లాలని షరతులు పెట్టారు. రుషికొండకు ఎదురుగా ఉన్న రోడ్డులో మాత్రమే పవన్ వెళ్లాలని తెలిపారు. అయితే గీతం కాలేజీ దగ్గర మీడియాతో ఆయన మాట్లాడొచ్చని చెప్పారు.