iDreamPost

Ghani Movie Review : గని రివ్యూ

Ghani Movie Review : గని రివ్యూ

గద్దలకొండ గణేష్ తర్వాత గ్యాప్ తీసుకున్న వరుణ్ తేజ్ కొత్త సినిమా గని ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. కరోనాతో పాటు రకరకాల కారణాల వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమయ్యాడు. అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీకి నిర్మాతగా ఇది డెబ్యూ మూవీ కావడం మరో విశేషం. గీత ఆర్ట్స్ సమర్పణలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన గనిలో ఉపేంద్ర ప్రత్యేక పాత్ర పోషించగా సునీల్ శెట్టి కీలక పాత్ర చేశారు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 లాంటి ప్యాన్ ఇండియా సినిమాల మధ్య బరిలోకి దిగిన ఈ గని బాక్సింగ్ రింగ్ లో గెలుపు అందుకున్నాడా లేదా రివ్యూలో చూద్దాం

కథ

తల్లి(నదియా)కి ఇష్టం లేకపోయినా బాక్సింగ్ అంటే ప్రాణమిచ్చే గని(వరుణ్ తేజ్)ఆమెకు తెలియకుండా ప్రాక్టీస్ చేస్తుంటాడు. తండ్రి విక్రమాదిత్య(ఉపేంద్ర)ఇదే ఆటలో కళంకితుడిగా మచ్చ తెచ్చుకుని ప్రాణాలు కోల్పోవడానికి బదులుగా తాను ఛాంపియన్ అవ్వాలని నిర్ణయించుకుంటాడు. దీనికి కారణమైన వాళ్లకు బుద్ధి చెప్పేందుకు ఒకప్పటి నాన్న అపోజిషన్ స్పోర్ట్స్ మ్యాన్(సునీల్ శెట్టి)సహాయం తీసుకుంటాడు. నిజ జీవితంతో పాటు బాక్సింగ్ రింగ్ లోనూ శత్రువుగా మారిన ఆది(నవీన్ చంద్ర)కి తద్వారా తన లక్ష్యం నెరవేర్చుకోవడంతో పాటు ప్రపంచానికి విక్రమాదిత్య గొప్పదనం ఏంటో చాటుతాడు. ఇంతకంటే స్టోరీ ఇంకేం లేదు

నటీనటులు

వరుణ్ తేజ్ గత కొన్నేళ్లుగా వైవిధ్యమైన స్క్రిప్ట్ లను ఎంచుకుంటూ నటనను మెరుగుపరుచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అందులో భాగంగా గద్దలకొండ గణేష్ లాంటి సీరియస్ జానర్, ఎఫ్2 లాంటి ఎంటర్ టైనర్ మంచి ఫలితాలు ఇచ్చాయి. గని విన్నప్పుడు కూడా ఇదే తరహాలో డిఫరెంట్ ఇమేజ్ అవుతుందని గుర్తించి ఒప్పుకున్నాడు. దానికి తగ్గట్టే చాలా కష్టపడ్డాడు. అది శారీరకంగా స్పష్టంగా కనిపిస్తుంది కూడా.అయితే ఎమోషనల్ గా హెవీ డ్రామా డిమాండ్ చేసే ఈ పాత్రను ఎక్స్ ప్రెషన్స్ పరంగా అంత న్యాయం చేయలేదనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఎఫర్ట్ విషయంలో వంక పెట్టేందుకు అవకాశం ఇవ్వలేదు.

హీరోయిన్ సయీ మంజ్రేకర్ ది మరీ మొక్కుబడి పాత్ర. తనకు రాసిన సీన్లే నాసిరకంగా ఉండటంతో పెర్ఫార్మన్స్ పరంగా చేయడానికి పెద్దగా ఏమి లేదు. దానికి తోడు సెకండ్ హాఫ్ కొన్ని నిముషాలు తప్ప మళ్ళీ కనిపిస్తే ఒట్టు. నదియాకు అలవాటైన పాత్ర. జగపతిబాబు లిస్టులో ఇంకో నెంబర్ యాడ్ అయ్యిందంతే. సునీల్ శెట్టి విగ్రహం పుష్టి ఫలితం నష్టి అన్నట్టు తయారవుతున్నాడు. నవీన్ చంద్ర సైతం అంతే. కమెడియన్ సత్య. హరితేజలను రెండు మూడు జోకులకు వాడుకున్నారు కానీ నవ్వు రాలేదు. ఉన్నంతలో ఉపేంద్ర స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. పవర్ ఫుల్ గా లేకపోయినా తన ఉనికిని బలంగా చాటుకున్నారు.

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు కిరణ్ కొర్రపాటికి మంచి బ్యానర్ దొరికింది. మెగా బ్రాండ్ ఉన్న హీరో ఎస్ చెప్పాడు. టాప్ మోస్ట్ మ్యుజిషియన్ తమన్ ని తీసుకొచ్చారు. తమన్నాతో ఐటెం సాంగ్. చాలా ఆలోచించి తెలుగు సినిమాలు చేసే ఉపేంద్ర కేవలం ఇరవై నిమిషాల కోసం ఎస్ అన్నారు. ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు ఒక డెబ్యూ డైరెక్టర్ తను చెప్పాలనుకున్న కథలో నవ్యత ఎంత మోతాదులో ఉందో చూసుకోవాలి. ఏదో నాని జెర్సీ ఆడేసింది కదా మనమూ అలాంటి ఆటను బ్యాక్ గ్రౌండ్ లో పెట్టుకుని అమ్మా నాన్న సెంటిమెంట్ ని దట్టించేస్తే ప్రేక్షకులు ఆహా ఓహో అంటారని అనుకోవడం అమాయకత్వం. గని ఈ విషయంలో కనీస అంచనాల దగ్గరకు కూడా వెళ్లలేకపోయింది.

అసలే జనానికి స్పోర్ట్స్ డ్రామాలు బోర్ కొట్టేస్తున్నాయి. లక్ష్య, గుడ్ లక్ సఖిలు అందుకే తిరస్కారానికి గురయ్యాయి. ఎమోషన్ అంటే రెండు మూడు బరువైన డైలాగులు పెట్టి అయ్యో పాపం అనిపించే ఫ్లాష్ బ్యాక్ పెట్టడం కాదు. సినిమా మొదలైనప్పటి నుంచి కథలో మనల్ని ఇన్వాల్వ్ చేయడం. కానీ గనిలో ప్రతిదీ చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ మరీ దారుణం. అర్థం లేని ఒక చిన్న ఇన్సిడెంట్ కి గని అంటే పడి చచ్చిపోయేంత ప్రేమలో పడుతుంది. అతగాడు బదులుగా ఆమెను అంగీకరించే వెర్షన్ కూడా అంతే. ఇంత సిల్లీగా ఎలా ఆలోచిస్తారని ఓ సగటు ప్రేక్షకుడు కూడా ఫీలయ్యారంటే అది ముమ్మాటికీ దర్శకుడి తప్పే.

గని లాంటి సబ్జెక్టులో కాంఫ్లిక్ట్ చాలా కీలకం. కథానాయకుడి లక్ష్యాన్ని నిర్దేశించే క్రమంలో ప్రేక్షకుడు ఉద్వేగానికి గురయ్యేలా ఎపిసోడ్స్ పండాలి. అలా అని మొత్తం సీరియస్ గానే చెప్పాలనే రూలేం లేదు. పవన్ కళ్యాణ్ తమ్ముడు ముప్పాతిక భాగం నవ్విస్తుంది. చివరి నలభై నిముషాలు గేమ్ తో కనెక్ట్ చేసి వాహ్ అనిపిస్తుంది. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయిలో జయసుధ రవితేజ మధ్య బంధాన్ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేశాకే హీరోకు ప్రకాష్ రాజ్ మీదున్న ద్వేషాన్ని సరైన టైంలో పూరి బయటపెడతాడు. ఇవన్నీ ఓ రేంజ్ లో పేలాయి. అక్కడ సినిమా మొత్తం బాక్సింగే ఉండదు. గని లాగే అందులోనూ ఐటెం సాంగ్ ఉంటుంది. కానీ ఎబ్బెట్టుగా అనిపించదు.

ఇలాంటి చాలా విషయాలను కిరణ్ కొర్రపాటి లైట్ తీసుకున్నారు. చూసేవాళ్ల ఇంటెలిజెన్స్ లెవెల్స్ ని తక్కువగా అంచనా వేస్తే దెబ్బ తినేది దర్శకులే అనే వాస్తవాన్ని వీలైనంత త్వరగా గుర్తిస్తే మంచిది. అసలు ఇవాళ ఈ సినిమాకు ఓపెనింగ్స్ తక్కువగా ఉండటానికి కారణమే ట్రైలర్. అక్కడే కనిపించని కొత్తదనం థియేటర్ లో ఉంటుందని పబ్లిక్ ఆశించలేదు. అందుకే మొదటి రోజే చూడాలన్న ఎగ్ జైట్మెంట్ చూపించలేదు. ఈ కారణంగానే కలెక్షన్స్ వీక్ గా కనిపిస్తున్నాయి. సో పికప్ కావాలంటే గని టాక్ కీలకం. చూసిన కొద్ది శాతం అబ్బే ఏముంది ఇందులో అనేస్తే హిట్టా ఫ్లాపా డిసైడ్ అయ్యేది ఇక్కడే కదా.

కిరణ్ కొర్రపాటి ఆలోచన మంచిదే కానీ దాన్ని ఎంగేజ్ చేసే విధంగా మలుచుకోకపోవడంతో గని చప్పగా అనిపిస్తుంది. శ్రీహరి భద్రాచలంతో మొదలుపెట్టి షారుఖ్ చెక్ దే ఇండియా దాకా ఎన్ని స్ఫూర్తిగా తీసుకుని మిక్స్ చేసి అల్లుకున్నా సరే టికెట్ కన్నా ఎక్కువగా ఆడియన్స్ టైంకి న్యాయం చేయగలిగినప్పుడు ఎవరికైనా హిట్టు దక్కే తీరుతుంది. అసలే ఆర్ఆర్ఆర్ లాంటి గ్రాండియర్లు చూస్తున్న జనాలు ఇలాంటి గనిల కోసం థియేటర్ దాకా రావాలంటే బలమైన కారణాలు డిమాండ్ చేస్తారు. అంతేతప్ప అరిగిపోయిన మొక్కుబడి కథాకథనాలు కాదు. ఒక మంచి అవకాశం కిరణ్ వృథా చేసుకున్న తీరు విచారకరం

తమన్ వీకెస్ట్ మ్యూజిక్ ఈ మధ్యకాలంలో గనినే అని చెప్పాలి. టైటిల్ సాంగ్ కొంతవరకు బాగానే అనిపించినా మిగిలినవి మాత్రం మరీ సోసోగా ఆయన స్థాయిలో లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో సైతం అక్కడక్కడా తప్పించి ఎలాంటి మెరుపులు లేవు. జార్జ్ సి విలియమ్స్ ఛాయాగ్రహణం బాగుంది. కొన్ని పాత్రలకు ఎక్కువ క్లోజప్ షాట్స్ పెట్టడం ఇబ్బంది పెడుతుంది కానీ ఫైనల్ గా ఓకే. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ తన అనుభవాన్ని ఉపయోగించింది. మరీ ఎక్కువ ల్యాగ్ లేదు కానీ కంటెంట్ లోనే ఉంది చిక్కంతా. ఏదో యాభై కోట్లు అయ్యిందని నిర్మాతలు చెప్పుకున్నారు మరీ అంత గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కనిపించలేదు.

ప్లస్ గా అనిపించేవి

వరుణ్ తేజ్ పడిన కష్టం
టైటిల్ సాంగ్
ఉపేంద్ర

మైనస్ గా తోచేవి

ఫస్ట్ హాఫ్
హీరోయిన్ తో లవ్ ట్రాక్
చప్పగా సాగే కథనం
రొటీన్ స్పోర్ట్స్ డ్రామా

కంక్లూజన్

ఆ మధ్య తమిళంలో ఆర్య హీరోగా సర్పట్ట పరంపరై అనే ఓటిటి మూవీ వచ్చింది. దానికి మంచి ప్రశంసలు దక్కాయి. ఇది కూడా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుంది. అసలిలాంటివి ఎలా వర్కౌట్ అవుతున్నాయో ఒక అనాలసిస్ చేసుకుని గని లాంటి కథలను తెరకెక్కిస్తే బాగుంటుంది. అంతే తప్ప ఎమోషన్లు లేకుండా పాత్రల మధ్య సంబంధాలు, వాటి తాలూకు ఫ్లాష్ బ్యాక్ లు ఏ సినిమానూ నిలబెట్టలేవు. హీరో కష్టపడి బాడీ బిల్డ్ చేసుకున్నాడనే సింపతీతో థియేటర్ కు రారుగా. దాన్ని సరైన రీతిలో వాడుకునే దర్శకుడు, టీమ్ దొరికినప్పుడే అతని కష్టం హిట్టు రూపంలో ఫలిస్తుంది. లేదంటే గార్డ్ లేకుండా బాక్సింగ్ చేసినట్టే గనిలాగా

ఒక్క మాటలో : లాభం లేదు గని

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి