iDreamPost
iDreamPost
ఏపీ రాజకీయాలు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటికే బీజేపీతో బంధం చిగురించిన సంతోషంలో ఉన్న జనసేనకు ఆ ఆనందం అంతలోనే ఆవిరి అవుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార వైఎస్సార్సీపీ తో కేంద్రంలో పాలక బీజేపీ సన్నిహిత సంబంధాలను ఆశిస్తోంది. జగన్ కూడా అదే ఆశిస్తున్నారు. దాంతో ఇరు పార్టీల మధ్య బంధం బలపడుతున్నట్టే కనిపిస్తోంది. ప్రస్తుతానికి బాహాటంగా కలిసి లేనప్పటికీ అన్ని విషయాల్లోనూ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇరువైపుల నుంచి కనిపిస్తోంది. కీలక బిల్లుల విషయంలో పార్లమెంట్ లో వైఎస్సార్సీపీ అండగా ఉంటే, ఏపీకి సంబంధించిన పలు అంశాల్లో బీజేపీ అధిష్టానం మద్ధతు తెలుపుతోంది. రాష్ట్ర నాయకత్వానికి రుచించకపోయినా కేంద్రం జోక్యం చేసుకోవడానికి ససేమీరా అంటూ జగన్ పరోక్షంగా అండదండలు అందిస్తున్నట్టు కనిపిస్తోంది.
తాజాగా ఢిల్లీలో పరాజయం తర్వాత ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి మరింత పెరుగుతోంది. దాంతో మోడీ అందరినీ మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. అందుకు అనుగుణంగానే జగన్ తో సుదీర్ఘ భేటీ నిర్వహించారు. కీలక అంశాలలో జగన్ కి అడ్డంకులు లేకుండా చూస్తాననే హామీ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. ఏప్రిల్ తర్వాత రాజ్యసభలో బీజేపీ బలం బాగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. దాంతో కీలక బిల్లులకు ఎగువ సభలో మోక్షం దక్కాలంటే అనేక మంది మిత్రపక్షాలు, బయటి నుంచి మద్ధతుగా ఉంటున్న పార్టీల తోడ్పాటు మోడీకి అవసరం ఉంటుంది. రాజ్యసభలో వైఎస్సార్సీపీ బలం కూడా ఒకేసారి ఆరుకి పెరుగుతుండడంతో మరింత కీలకంగా మారబోతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీతో బంధాన్ని బలపరుచుకునే యత్నంలో బీజేపీ ఉండగా, ఓవైపు రాష్ట్ర ప్రయోజనాలు, మరోవైపు జగన్ వ్యక్తిగత వ్యవహారాలకు అనుగుణంగా కేంద్రంతో సఖ్యత కోసం వైఎస్సార్సీపీ చూస్తోంది.
ఈ పరిణామాలు బీజేపీతో తాజాగా పొత్తు పెట్టుకున్న పవన్ ని సందిగ్ధంలోకి నెడుతున్నాయి. ఏపీలో జగన్ పని పడతానని, ఢిల్లీ పెద్దలతో చర్చించి సంగతి చూస్తానని ఆయన ఇప్పటికే హెచ్చరించారు. కానీ తీరా చూస్తే సీన్ వేరుగా ఉంది. సునీల్ దేవదర్, జేడీ జడ్డా వంటి వారితో పవన్ మంతాలు నడుపుతుంటే, మోడీ-షాతో నేరుగా జగన్ సంప్రదింపుల్లో ఉన్నారు. దాంతో పవన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారుతోంది. జగన్ కి అడ్డంకులు వేసేందుకు తాను కేంద్రంతో పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు బీజేపీ పెద్దలు నేరుగా జగన్ తో సఖ్యత పాటించడం అసలు రుచించే అవకాశం లేదు. ఇప్పటికే మూడు రాజధానుల విషయంలో ఇది స్పష్టం అయ్యింది. అమరావతిని కదిలించలేరని పవన్ ప్రకటన చేసినప్పటికీ కేంద్రం నుంచి జగన్ ఎజెండాకి సానుకూలత రావడంతో మార్పులు అనివార్యం అయ్యాయి. ఆఖరికి కర్నూలులో హైకోర్ట్ కి సై అనాల్సిన పరిస్థితి పవన్ కి ఏర్పడింది. రేపు విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కి కూడా జై కొట్టాల్సి వస్తుందేమో అన్నట్టుగా మారింది.
అమరావతి కోసం బీజేపీతో కలిసి లాంగ్ మార్చ్ చేస్తానని పవన్ ప్రకటించారు. కానీ బీజేపీ పెద్దలు బ్రేకులు వేయడంతో ఆ కార్యక్రమం పక్కకిపోయింది. అయినా పవన్ మాత్రం ఓవైపు సినిమాలతో బిజీగా గడుపుతూనే పొలిటికల్ గా తన ప్రభావం తగ్గకూడదనే లక్ష్యంతో సాగుతున్నారు. అందులో భాగంగానే కర్నూలు పర్యటనకు సొంతంగా సిద్ధం అయ్యారు. వాస్తవానికి చాలాకాలంగా చంద్రబాబు దత్తపుత్రుడిగా పవన్ మీద విమర్శలున్నాయి. బాబు ఎజెండాలో భాగమే పవన్-బీజేపీ పొత్తుగా వైఎస్సార్సీపీ ఆరోపణలు గుప్పించింది. కానీ ఇప్పుడు తీరా పవన్ కన్నా జగన్ కి బీజేపీలో ప్రాధాన్యత పెరుగుతుండడంతో జనసేనాని భవితవ్యం ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారడం అనివార్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ ఎజెండాను పూర్తిగా బలపరిచేలా సీఏఏ వంటి విషయాల్లో పవన్ స్టేట్ మెంట్స్ వినిపిస్తున్నారు. కానీ కమలనాధులు మాత్రం కనికరించకపోగా, జగన్ ని దగ్గర చేర్చుకునేలా వ్యవహరించడం మింగుడుపడడం లేదు.
వైఎస్సార్సీపీ, బీజేపీ బంధం బలపడితే అది పవన్ కి అశనిపాతం అవుతుంది. రాజకీయాల్లో ఆతృత పడినందుకు పవన్ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నికలు ఇప్పుడే లేకపోయినా పొత్తులకోసం ఆరాటపడిన పవన్ చివరకు తన గొయ్యి తానే అనుకున్నట్టు అవుతుంది. ఇప్పటికే నిలకడలేని నేతగా జనం భావిస్తున్న నేపథ్యంలో మరిన్ని చిక్కులు తప్పవు. జగన్ కి సహకరించే బీజేపీని సమర్థించలేక, అదే సమయంలో మిత్రపక్షంగా ఉన్న పార్టీ విధానాలను విమర్శించలేక పవన్ పార్టీ పూరత్ఇగా సతమతం కావడం ఖాయంగా మారుతోంది. ఇప్పటికే అలాంటి పరిస్థితి వచ్చేస్తోంది. ఇది జనసేన భవిష్యత్ కి పెద్ద ఆటంకంగా మారబోతోంది. ఎన్నికల నాటికి నాలుగేళ్ల తర్వాత మారబోయే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆపార్టీకి ముందరికాళ్ల బంధంగా పరిణామాలు మారుతున్నాయనడంలో సందేహం లేదు. మోడీ, జగన్ రాజకీయాలతో పవన్ పవర్ స్టార్ అనే పేరు కాస్త పేలవంగా మారిపోతున్నట్టుగా స్పష్టం అవుతోంది.