Idream media
Idream media
దేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిర్ధారణ పరీక్షలు చేసే కొద్ది ప్రతిరోజు కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రతి రోజు దాదాపు వెయ్యి కేసులు నమోదవుతున్నాయి. ఈ రోజుకి దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 13,515 గా నమోదైంది. కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికి 450 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,662 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. మహారాష్ట్రలో కేసుల సంఖ్య 3 వేలు దాటింది. ముంబై నగరంలోనే 2 వేల కేసులు నమోదయ్యాయి.
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉన్నట్లు నమోదైన కేసుల సంఖ్య ను బట్టి తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 534 కేసులు నమోదయ్యాయి. ఇందులో 14 మంది ప్రాణాలు కోల్పోగా 20 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఏపీలో గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా 122 కేసులు నమోదయ్యాయి. ప్రతి రోజూ దాదాపు మూడు వేల మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా హాట్ స్పాట్ గా ఉన్న ప్రాంతాలలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. అవసరమైన నిత్యావసరాలు, రేషన్ వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు.
ఇక తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 700 లకు చేరుకుంది. వైరస్ సోకిన వారిలో 186 మంది కోలుకోవడం గమనార్హం. మరో 18 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నగరంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో గానూ ఎనిమిది జిల్లాలను రెడ్ జోన్లుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వచ్చే నెల 3వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగనుండడంతో ఆ లోపు వైరస్ నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందని పాలకుల భావిస్తున్నారు.