సరిగ్గా రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ సెట్స్ మీదకు ఎక్కడం ఖాయం అయ్యింది. త్వరలోనే తాజా సినిమాతో రీ ఎంట్రీ షురూ అవుతోంది. ఇప్పటికే జనసేనని బీజేపీ చేతుల్లో పెట్టేశారు. రాజకీయ వ్యవహారాలతో కొంత కాలంగా గడుపుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల మీద ఆసక్తి చూపుతున్నారనే వార్తలకు అనుగుణంగా ఈనెల నుంచే కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నారు.
దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో హిందీ మువీ పింక్ రీమేక్ కి రెడీ అయ్యింది. బాలీవుడ్ లో అమితాబ్ పాత్రను టాలీవుడ్ లో పవన్ పోషించబోతున్నారు. ఈ సినిమా ని వీలయినంత త్వరగా పూర్తి చేసిన మే నెలలో విడుదల చేసే యోచనలో నిర్మాత ఉన్నారు. దానికి అనుగుణంగానే షూటింగ్ ప్రారంభం కాబోతోందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం ప్రారంభం అయ్యింది.
రెండు పడవలపై కాలు వేయడం సమంజసం కాదంటూ 2018 జనవరి 9 నాడు విడుదలయిన అజ్ఞాత వాసి తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు విరామం ప్రకటించారు. ఇకపై పూర్తిగా రాజకీయాలేనని ప్రకటించారు. ఆ సినిమా ఆడియో వేడుకలో అలాంటి ఆలోచన వద్దని చిరంజీవి వంటి వారు బహిరంగంగానే సూచన చేసినా పవన్ వెంటనే స్పందించారు. తన ఆలోచనలు, అభిప్రాయాలకు రాజకీయాలు అవసరం అని, అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నానంటూ ప్రకటించారు. సీన్ కట్ చేస్తే రెండేళ్ల తర్వాత పవన్ మనసు మారిపోయింది.
ఈ రెండేళ్లలో జనసేన కార్యక్రమాలకు ఆయన ప్రాధాన్యతనిచ్చారు. పార్టీ వ్యవహారాలను చక్కదిద్ది ఎన్నికల్లో పోటీకి దిగారు. కానీ పలితాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. చిరంజీవి ప్రజారాజ్యం స్థాయిలో కూడా ఫలితాలు లేక బోల్తా పడాల్సి వచ్చింది. మళ్లీ ఐదేళ్ల పాటు పార్టీని నడపడం పవన్ వల్ల అవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవయ్యాయి. అందుకు తగ్గట్టుగానే ఎన్నికలు లేకపోయినా ఆయన పొత్తులకు సిద్ధమయ్యారు. త్వరలో సంపూర్ణంగా జనసేన జెండా పక్కన పెట్టేసి బీజేపీ ఎజెండా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా రాజకీయంగా పవన్ ఆశించింది జరగకపోగా, అనూహ్యంగా ఎదురుదెబ్బలు తినడంతో మళ్లీ టాలీవుడ్ వైపు చూడక తప్పలేదు.
గతంలోనే ఆయనకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. ఏఎం రత్నం వంటి వారికి మాట ఇచ్చి ఉన్నారు. దిల్ రాజు వంటి వారి నుంచి సినిమాలకు అడ్వాన్సులు కూడా తీసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు వాటిని పూర్తి చేయాలనే ఆలోచనకు వచ్చినట్టు కనిపిస్తోంది. తొలుత దిల్ రాజు బ్యానర్ లో పింక్ తర్వాత ఏ ఎం రత్నం తగిన కథను సిద్ధం చేసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. ఇలా వరుసగా సినిమాలతో పవన్ ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది. జనసేన వ్యవహారాల భారం తగ్గుతుంది కాబట్టి అవసరమైన సమయంలో బీజేపీకి అనుగుణంగా ఓ ప్రకటన, ప్రచారం కోసం కొంత సమయం కేటాయించేందుకు అనుగుణంగా పవన్ సన్నద్దమవుతున్నట్టు కనిపిస్తోంది.
3925