iDreamPost
android-app
ios-app

పశ్చిమలో జనసేన–బీజేపీ పరిస్థితేంటి?

పశ్చిమలో జనసేన–బీజేపీ పరిస్థితేంటి?

స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెల 7న నోటిఫికేషన్లు వెలువడనున్నాయనే వార్తల నేపథ్యంలో పశ్చిమలోని పల్లెలు, పట్టణాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్టీలన్నీ అభ్యర్థులు, సామాజిక సమీకరణాల లెక్కల్లో మునిగితేలుతున్నాయి. దీంతో జిల్లాలో ఆయా పార్టీల ప్రభావం, సన్నద్ధతలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో భాగంగా జనసేన–బీజేపీ కూటమి ఎలాంటి ఫలితాలు సాధించేందుకు ఆస్కారం ఉంది. ఏయే నియోజకవర్గాల్లో ఈ కూటమి ప్రభావం చూపేందుకు అవకాశం ఉందో ఒకసారి చూద్దాం…..

ఇతర జిల్లాలతో పోల్చితే జనసేన రాజకీయాలు పశ్చిమగోదావరితో కొంచెం ఎక్కువగా ముడిపడి ఉంటాయి. చిరంజీవి కుటుంబ మూలాలు జిల్లాలోనే ఉండటమే దీనికి కారణం. పవన్‌ కళ్యాణ్‌ సొంత సామాజికవర్గం పశ్చిమలో పెద్ద సంఖ్యలో ఉంది…. పైగా ఆయన గత ఎన్నికల్లో భీమవరం అసెంబ్లీ నుంచి, నాగబాబు నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. పవన్‌ కళ్యాణ్‌ 8వేల పైచిలుకు ఓట్లతో ఓటమి చెందగా, నాగబాబు రెండున్నర లక్షలకు పైగా ఓట్లు పొందారు. అయితే ఎన్నికల అనంతరం ఆ పార్టీ కేడర్‌ కొంత అధికార పార్టీలో మళ్లారు. అయితే నేతలు మాత్రం చాలా వరకు జనసేన పార్టీనే అంటిపెట్టుకొని పనిచేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా పోటీ మాత్రం చేస్తామని చెప్తున్నారు.

ఎన్నికలేవయినా పశ్చిమలో జనసేన ప్రభావం కాస్తా కూస్తో కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 138 చోట్ల పోటీ చేయగా…కేవలం 16 స్థానాల్లోనే ఆ పార్టీకి డిపాజిట్లు దక్కాయి. అయితే వాటిలో 13 స్థానాలు పశ్చిమ, తూర్పుగోదావరిల్లోనే ఉండటం గమనార్హం. పశ్చిమలో జనసేన తరపున పాలకొల్లు నుంచి పోటీ చేసిన గుణ్ణం నాగబాబు, నరసాపురంలో బొమ్మిడి నాయకర్, తణుకులో పసుపులేటి రామారావు, తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్‌లు చెప్పకోదగ్గ స్థాయిలో ఓట్లు పొందారు. ఆయా నియోజకవర్గాల్లో పవన్‌ సామాజికవర్గం పెద్ద సంఖ్యలో ఉండటమే దీనికి ప్రధాన కారణం. కాగా, ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జనసేనకు ఈ నియోజకవర్గాల్లో.. కొన్ని స్థానిక పీఠాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా జనసేన–బీజేపీ మైత్రితో తాడేపల్లిగూడెం వంటి నియోజకవర్గాల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ఆస్కారం ఉంది. అక్కడ జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్‌ క్రియాశీలకంగా పనిచేస్తున్నారు….పైగా తాడేపల్లిగూడెంకే చెందిన మాజీ మంత్రి మాణిక్యాలరావుకు సైతం కొంత కేడర్‌ ఉంది. దీంతో తాడేపల్లిగూడెం మునిసిపాలిటీ, పంచాయతీ ఎన్నికల్లో జనసేన కూటమి గట్టి పోటీ ఇవ్వనుందని చెప్పొచ్చు. అలాగే భీమవరం నియోజకవర్గంలో మాజీ మునిసిపల్‌ చైర్మన్, జనసేన నియోజకవర్గ ఇంచార్జ్‌ కొటికలపూడి గోవిందరావు(చినబాబు) ఒకింత దూకుడుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా అధికార పార్టీపై పలు సవాళ్లు విసురుతూ వస్తున్నారు. ఇందులో భాగంగా భీమరవరంలో ఈ మధ్యే ఉద్రిక్త పరిస్థిలు సైతం తలెత్తాయి. వీటితోపాటు తణుకు, పాలకొల్లు, నరసాపురం నియోజకర్గాల్లో జనసేనకు కొంత అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే తొలిసారి గ్రామ, పురపోరులకు ఆ పార్టీ కొత్త కాబట్టి పరిస్థితులను ఎలా నెట్టుకొస్తుందో చూడాలి. అయితే సర్పంచ్, చైర్మన్‌ పదవులు పొందకపోయినా వార్డు మెంబర్, కౌన్సిలర్‌ పదవులను మాత్రం జనసేన దక్కించుకొనే అవకాశం ఉందని చెప్పొచ్చు.

ఇక ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏలూరు, ఉంగుటూరుల్లో మాత్రమే జనసేనకు చెప్పుకోదగ్గ నాయకత్వం కనిపిస్తోంది. పైగా ఈ రెండు నియోజకవర్గాల్లో కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉంది. ఏలూరులో జనసేనకు రెడ్డి అప్పలనాయుడు నాయకత్వం వహిస్తున్నారు. ఈయనకు ఏలూరు రూరల్‌ మండలాల్లోని తూర్పుకాపులపై మంచి పట్టుంది. పైగా జనసేన–బీజేపీ పొత్తు ఇక్కడ మంచి ఫలితాలను తెస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఏలూరులో ప్రముఖ నాయకుడిగా ఉన్న అంభికా కృష్ణ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఏలూరులో పెద్ద సంఖ్యలో ఉన్న వైశ్య సామాజికవర్గం బీజేపీ–జనసేన వైపు మొగ్గుతుందని ఆ పార్టీలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి. మిగిలిన నియోజకవర్గాలైన దెందులూరు, చింతలపూడి, పోలవరంలలో జనసేన ప్రభావం నామమాత్రమే. ఈ నియోజకవర్గాల్లో సరైన నాయకత్వమే కాదు….చెప్పుకోదగ్గ కేడర్‌ కూడా బీజేపీ జనసేనలకు లేదు. జిల్లాకు సంబంధించి బీజేపీ కార్యక్రమాలను మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, సోము వీర్రాజులు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఆ పార్టీకి కేడర్‌ లేకపోవడతో పూర్తిగా జనసేనపైనే ఆశలుపెట్టుకుంది.

పవన్‌ సొంత సామాజిక వర్గానికి చెందిన వారిలో నలభై ఏళ్ల లోపువారు జనసేన వైపు మొగ్గుతున్నారు. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీలతోపాటు ఇతర సామాజికవర్గాల్లో పట్టు సాధించలేకపోవడం జనసేనకు ప్రతిబంధకంగా కనిపిస్తోంది. మరి ఈ అడ్డంకులన్నీ దాటుకొని జనసేన జిల్లాలో ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు వేచిచూడాల్సిందే.