iDreamPost

లవర్ కోసం భర్తను చంపి హార్ట్ ఎటాక్ గా నమ్మించింది.. 3 నెలల తర్వాత

  • Published May 17, 2024 | 2:53 PMUpdated May 17, 2024 | 2:53 PM

Hyderabad: ప్రియుడితో కలిసి దారుణానికి తెగ బడింది ఓ మహిళ. భర్తను చంపి గుండెపోటు అంటూ డ్రామా ఆడింది. కానీ చివరకు పాపం పండింది.

Hyderabad: ప్రియుడితో కలిసి దారుణానికి తెగ బడింది ఓ మహిళ. భర్తను చంపి గుండెపోటు అంటూ డ్రామా ఆడింది. కానీ చివరకు పాపం పండింది.

  • Published May 17, 2024 | 2:53 PMUpdated May 17, 2024 | 2:53 PM
లవర్ కోసం భర్తను చంపి హార్ట్ ఎటాక్ గా నమ్మించింది.. 3 నెలల తర్వాత

సమాజంలో నేర ప్రవృత్తి విపరీతంగా పెరిగి పోతుంది. చిన్న కారణాలకే విచక్షణారహితంగా దాడి.. ఆఖరికి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు కొందరు. ఇక గురువారం రోజు పెంపుడు కుక్క ఇంట్లోకి వచ్చిందని.. దంపతులపై ఓ వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఓ దారుణం వెలుగు చూసింది. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను కాటికి పంపింది ఓ మహిళ. గుండెపోటుతో తన భర్త చనిపోయాడంటూ చక్కగా డ్రామా ఆడింది. కానీ మూడు నెలల తర్వాత ఊహించని సంఘటన చోటు చేసుకుని.. సదరు ఖిలేడీ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

పెళ్లై.. పిల్లలున్నా సరే ప్రియుడితో సంబంధం కొనసాగిస్తోన్న ఓ మహిళ.. చివరకు కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా హతమార్చింది. తన మీద అనుమానం రాకుండా ఉండేలా.. గుండెపోటుతో చనిపోయాడని బంధువులు సహా అందర్నీ నమ్మించింది. ఎవరికీ అనుమానం రాకుండా అంత్యక్రియలు పూర్తిచేసింది. ఇక, తన నేరం ఎప్పటికి బయటపడదని అనుకుంది. కానీ చేసిన పాపం ఏదో ఓ రోజు బయటకు రాక మానదు. సదరు ఖిలేడీ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆమె భర్తను హత్య చేసిన నిందితుల్లో ఒకడు పోలీసులకు లొంగిపోయి అసలు విషయం బయటపెట్టాడు. అతడు గుండెపోటుతో చనిపోలేదని, దారుణంగా చంపేశామని చెప్పాడు. దాంతో సదరు ఖిలేడీ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది

మూడున్నర నెలల కిందట హైదరాబాద్‌లోని మధురానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిగూడ జేపీ నగర్‌లో విజయకుమార్ (40) అనే వ్యక్తి తన భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే శ్రీలక్ష్మి పెళ్లికి ముందు రాజేశ్‌ అనే వ్యక్తిని ప్రేమించింది. పెళ్లై, పిల్లలు పుట్టినా సరే ప్రియుడిని మర్చిపోలేకపోయింది. భర్తకు తెలియకుండా అతడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. అయితే ఏదో ఒక రోజు తమ బంధం గురించి భర్తకు తెలిస్తే సమస్యలు తప్పవని భావించింది. దీంతో విజయ్‌కుమార్‌‌ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుని.. దాని గురించి ప్రియుడు రాజేశ్‌కు చెప్పింది. అతడు కూడా సరే అనడంతో.. లవర్ తో కలిసి ప్రియుడి హత్యకు ప్లాన్ చేసింది శ్రీలక్ష్మి.

ప్లాన్ లో భాగంగా.. దారుణంగా దాడి చేసి..

దీనిలో భాగంగా.. విజయ్ కుమార్ ను హతమార్చడం కోసం సనత్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్ పటోళ్ల రాజేశ్వర్‌రెడ్డిని సంప్రదించారు శ్రీలక్ష్మి, రాజేశ్ లు. రాజేశ్వరరెడ్డి తనకు తెలిసిన మహ్మద్‌ మైతాబ్‌ అలియాస్‌ బబ్బన్‌తో కలిసి విజయ్‌కుమార్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నారు. ఫిబ్రవరి 1న పిల్లలను స్కూల్‌కు దింపడానికి వెళ్లాడు విజయ్‌కుమార్‌. అప్పటికే పథకం ప్రకారం రాజేశ్‌, రాజేశ్వర్‌రెడ్డి, మైతాబ్‌ ఆ ఇంటి సమీపానికి వచ్చారు. భర్త బయటకు వెళ్లగానే.. శ్రీలక్ష్మి వారిని ఇంటిలోకి పిలిపించి టాయ్‌లెట్‌లో దాచిపెట్టింది.

పిల్లల్ని దింపి భర్త ఇంటికి రాగానే శ్రీలక్ష్మి లోపలి నుంచి గడిపెట్టింది. ఇంతలో బాత్‌రూమ్‌లో దాక్కున్న ముగ్గురు బయటకు వచ్చి.. డంబెళ్లు, ఇనుపరాడ్లతో విజయ్ కుమార్ మీద దాడి చేశారు. తనను చంపొందని విజయ్ వేడుకున్నా వారు కనికరించలేదు. తనని చంపొద్దని.. కావాలంటే ఎంతైనా కొట్టి వదిలేయాలని ప్రాధేయపడ్డాడు. కానీ నిందితులు మాత్రం విచక్షణారహితంగా కొట్టి విజయ్‌ చనిపోయాడని నిర్ధారించుకున్నాక శవాన్ని బాత్‌రూమ్‌లో పడేసి వెళ్లిపోయారు.

గుండెపోటుగా నమ్మించి..

అనంతరం శ్రీలక్ష్మి ఇంట్లోని రక్తపు మరకలను తుడిచేసి, శవంపై బట్టలు మార్చేసింది. తర్వాత డ్రామాకు తెరతీసి.. తన భర్తకు గుండెపోటు వచ్చి బాత్‌రూమ్‌లో పడిపోయి చనిపోయాడని ప్రచారం చేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు నిజమేననుకుని విజయ్‌‌కు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దారుణం జరిగి ఇప్పటికే మూడు నెలలకు పైగా అవుతోంది. ఇక తమకు ఎవరూ అడ్డు రారని.. పైగా తాము చేసిన నేరం కూడా బయట పడదని భావించి.. శ్రీలక్ష్మి, రాజేశ్ లు సంతోషంగా ఉన్నారు. కానీ వారు ఊహించని ఘటన చోటు చేసుకుంది.

ఈ క్రమంలో హత్య అనంతరం నిందితుడు రాజేశ్వర్‌రెడ్డి వికారాబాద్‌‌కు పారిపోయాడు. నేరం బయటపడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు. అయితే, విజయ్‌ను కొడుతుండగా తనను చంపొద్దంటూ తమను వేడుకోవడం రాజేశ్వర్ రెడ్డిని బాధించింది. ఆ మాటలు పదేపదే గుర్తుకొచ్చి పశ్చాత్తాపంతో కుంగిపోయాడు. దీంతో మే 16న మధురానగర్‌ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తాము చేసిన నేరాన్ని అంగీకరించాడు. బయటపెట్టాడు. ఈ హత్యతో తనకు మానసిక ప్రశాంతత కరవైందని, పశ్చాత్తాపంతో లొంగిపోతున్నట్లు వెల్లడించారు. దీంతో అతడ్ని అరెస్ట్ చేపిన పోలీసులు.. రాజేశ్వర్‌రెడ్డి, శ్రీలక్ష్మి, రాజేశ్‌, మైతాబ్‌పై కేసు నమోదు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి