iDreamPost

Hanamkonda: బావమరిదిపై బావకు ఎంత ప్రేమో.. ఏకంగా మోకాళ్ల మీద 70 కిమీ నడిచి

  • Published May 28, 2024 | 11:28 AMUpdated May 28, 2024 | 11:28 AM

బావమరిది అంటే బావ బాగుకోరతాడని అంటారు. కానీ ఈసారి అందుకు భిన్నమైన దృశ్యం కనిపించింది. బావమరిది బాగు కోసం ఓ బావ.. మోకాళ్ల మీద నడుస్తూ.. తన ప్రేమ చాటుకున్నాడు. ఇది తెలంగాణలోనే జరిగింది. ఆ వివరాలు..

బావమరిది అంటే బావ బాగుకోరతాడని అంటారు. కానీ ఈసారి అందుకు భిన్నమైన దృశ్యం కనిపించింది. బావమరిది బాగు కోసం ఓ బావ.. మోకాళ్ల మీద నడుస్తూ.. తన ప్రేమ చాటుకున్నాడు. ఇది తెలంగాణలోనే జరిగింది. ఆ వివరాలు..

  • Published May 28, 2024 | 11:28 AMUpdated May 28, 2024 | 11:28 AM
Hanamkonda: బావమరిదిపై బావకు ఎంత ప్రేమో.. ఏకంగా మోకాళ్ల మీద 70 కిమీ నడిచి

మన సమాజంలో బావబామ్మర్దుల బంధానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. బావ బాగు కోరే వాడే బామ్మరిది అంటారు పెద్దలు. చాలా ఇళ్లల్లో బావ, బావమరుదుల మధ్య మంచి స్నేహం ఉంటుంది. తోడబుట్టిన వారి కన్నా ఎక్కువగా కలిసి మెలిసి ఉంటారు. ప్రతి పనికి ఒకరిని ఒకరు సంప్రదిస్తూ ఉంటారు. ఇక ప్రతి బావమరిది.. తన బావకు ఎంతో మర్యాద.. గౌరవం ఇస్తాడు. అక్కడ తన అక్క సంతోషంగా ఉంది అన్నా.. ఉండాలన్నా బావ బాగుండాలని కోరుకుంటాడు. బావకు కష్టం అని తెలిస్తే.. అందరి కన్నా ముందు స్పందిస్తాడు. నిత్యం తన అక్కాబావలు బాగుండాలని కోరుకుంటాడు.. తాపత్రయపడతాడు. కానీ తొలిసారి బావమరిది బాగు కోసం ఓ బావ సాహసం చేశాడు. ఇది చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాలు..

తన బావమరిది బాగు కోసం ఓ బావ సాహసం చేశాడు. అతడి కోసం ఏకంగా 70 కి.మీ మోకాళ్లపై నడిచి దేవుడికి మెుక్కులు తీర్చుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బావమరిది త్వరగా కోలుకోవాలని కోరుకొని.. ఐనవోలు మల్లన్న ఆలయానికి మోకాళ్లపై నడుచుకుంటూ వెళ్లి మెుక్కు తీర్చున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా కమలాపురం మండలం అంబాల గ్రామానికి చెందిన రజినీకాంత్ అనే యువకుడు ఈనెల 17న రోడ్డు ప్రమాదనికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడటంతో.. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో జాయిన్‌ చేశారు. రజినీకాంత్‌ను పరీక్షించిన డాక్టర్లు అతడి పరిస్థితి విషమంగా ఉందని.. ఇక మీదట అంతటా దేవుడి దయ అన్నారు.

ఈ క్రమంలో రజినీకాంత్ బావ నాగరాజు తన బావమరిది కోలుకుంటే మోకాళ్లపై నడిచి వచ్చి దర్శనం చేసుకుంటానని.. ఐనవోలు మల్లికార్జున స్వామి వారికి మెుక్కుకున్నాడు. డాక్టర్ల కృషి.. దేవుడి దయతో.. రజినీకాంత్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యింది. క్రమంగా కోలుకున్నాడు. దేవుడు తన మోర ఆలకించి.. బావమరిదిని బాగు చేశాడని సంతోషపడ్డాడు నాగరాజు. తన బావమరిది కోలుకోవడంతో.. తన మొక్కును తీర్చుకోవాలని భావించాడు. దానిలో భాగంగానే.. తన ఇంటి నుంచి సుమారు 70 కి.మీ మెకాళ్లపై నడుచుకుంటూ వెళ్లి ఐనవోలు మల్లన్న ఆలయానికి వెళ్లి మెుక్కులు చెల్లించుకున్నాడు.

ఇక నాగరాజు సంకల్పం గురించి తెలుసుకున్న ఆలయ కార్య నిర్వహణ అధికారి, అర్చకులు ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు అందజేశారు. నాగరాజు చేసిన పనిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇన్నాళ్లు బావమరుదులే.. బావల కోసం ఆలోచిస్తారు అనుకునేవాళ్లం. అందుకు భిన్నంగా నాగరాజు.. తన బావమరిది కోసం ఎంత సాహసం చేశాడు.. వీరిద్దరి మధ్య ఎంత మంచి బంధం ఉంది అని హ్యాట్సాప్ చెబుతున్నారు. నిజమైన ప్రేమ ఆప్యాయతలు అంటే ఇవే కదా అని కామెంట్స్‌ చేస్తున్నారు. సొంత తల్లితండ్రుల గురించి పట్టించుకోని ఈ రోజుల్లో బావమరిది కోసం ఈ పని చేశావంటే నీకు సెల్యూట్ చేయాల్సిందేనని అంటున్నారు. బావమరది బావ బాగు కోరుతాడనే పదానికి కొత్త అర్థం చెబుతూ.. బావ కూడా బావమరిది బాగు కోరుతాడని నిరూపించావు అంటూ.. నాగరాజుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజనులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి