iDreamPost

యాంగ్రీ మ్యాన్ కెరీర్లో ‘అల్లరి’ మలుపు – Nostalgia

యాంగ్రీ మ్యాన్ కెరీర్లో ‘అల్లరి’ మలుపు – Nostalgia

స్టార్ హీరోలకు ఒక ఇమేజ్ అంటూ ఏర్పడ్డాక దానికి భిన్నంగా ఏదైనా ప్రయోగం చేసినప్పుడు అందులో రిస్క్ ఉంటుంది. అది సక్సెస్ అయ్యిందా ఓకే లేదా ఏ మాత్రం తేడా కొట్టినా దాని బాక్స్ ఆఫీస్ ఫలితం చాలా తేడాగా ఉంటుంది. చిరంజీవి లాంటి అగ్ర హీరో ఇలాగే రుద్రవీణ, ఆపద్బాంధవుడు, ఆరాధన లాంటి డిఫరెంట్ జానర్ సినిమాలు చేసినప్పుడు తిరస్కారం తప్పలేదు. కారణం అభిమానుల అంచనాలు పూర్తిగా తప్పడమే. అయితే యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరున్న రాజశేఖర్ కు మాత్రం దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు ఓ తీయని మలుపు ఇచ్చారు. అదే 1993లో వచ్చిన అల్లరి ప్రియుడు. టైటిల్ విన్నాక ఇదేంటి రాజశేఖర్ ఇలాంటి చేస్తున్నాడనే కామెంట్సే ఎక్కువగా వచ్చాయి.

1989లో అంకుశం బ్లాక్ బస్టర్ హిట్టయ్యాక ప్రేక్షకులు రాజశేఖర్ నుంచి అలాంటి పవర్ ఫుల్ పాత్రలే ఆశించడం మొదలుపెట్టారు. దాంతో అంతో ఇంతో బాగున్న చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు చేయలేకపోయాయి. కామెడీగా ట్రై చేసిన చెన్నపట్నం చిన్నోళ్లు, థ్రిల్లర్ జానర్ లో యమపాశం, నెగటివ్ షేడ్స్ లో శిలాశాసనం, సాఫ్ట్ సబ్జెక్టుతో మంచివారు మావారు, రీమేక్ తో మొరటోడు నా మొగుడు ఇవేవి భారీ హిట్స్ కాలేకపోయాయి. సెంటిమెంట్ దట్టించిన అక్కమొగుడు పర్వాలేదు అనిపించుకుంది. మగాడు హిట్ క్యాటగిరీలో పడింది. కాని ఇవేవి అంకుశం రేంజ్ లో వసూళ్లు తీసుకురాలేదు. అయితే రాఘవేంద్రరావు గారి ఆలోచన ఇంకోలా సాగింది. అప్పటిదాకా లేని రీతిలో రాజశేఖర్ ని చూపించాలని డిసైడ్ అయ్యారు. అప్పటికే హిందీలో బ్లాక్ బస్టర్ హిట్టైన సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ ల సాజన్ సినిమా మెయిన్ పాయింట్ ని తీసుకుని దాన్ని తెలుగులో హీరో హీరోయిన్ల పాత్రలను రివర్స్ చేసి కొత్త ట్రీట్మెంట్ తో అల్లరి ప్రియుడు కథను సిద్ధం చేయించారు.

ఇందులో యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ కు తగ్గట్టు ఫైట్లు, సవాళ్లు విసురుకోవడాలు ఏమి ఉండవు. హీరో ఒక గాయకుడు. కనిపించకుండా లేఖలు రాసే ఒక అమ్మాయిని బదులు మరో అమ్మాయిని పొరబడి ప్రేమిస్తాడు. తర్వాత నిజం తెలుస్తుంది. అదే కథలో కీలకమైన పాయింట్. కీరవాణి బ్లాక్ బస్టర్ సాంగ్స్, సత్యానంద్ మార్క్ డైలాగ్ ఎంటర్ టైన్మెంట్, రమ్యకృష్ణ-మధుబాల గ్లామర్ అన్నింటిని మించి రాఘవేంద్రరావు గారి మార్క్ టేకింగ్ వెరసి అల్లరి ప్రియుడుని సూపర్ హిట్ చేయించి వంద రోజుల పరుగులు పెట్టించాయి. రాజశేఖర్ ని ఇలా కూడా చూపించవచ్చా అని ఇతర దర్శకులు అర్థం చేసుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా సాఫ్ట్ లవర్ బాయ్ గా రాజశేఖర్ చేసిన అల్లరి ప్రియుడు ఒక స్వీట్ బ్రేక్ గా నిలిచిపోయింది. ఇప్పటికీ ఆ పాటలు, సినిమా మంచి ఎంటర్ టైనింగ్ గా ఉంటాయి. ఆ తర్వాత ఇదే కాంబినేషన్ లో యాక్షన్ కోటింగ్ ఇచ్చి తీసిన రాజసింహం మాత్రం అంచనాలు అందుకోలేకపోవడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి