iDreamPost

ఆరెస్సెస్ పై త్వరలోనే సినిమా, వెబ్ సిరీస్: స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్

ఆరెస్సెస్ పై త్వరలోనే సినిమా, వెబ్ సిరీస్: స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్

బాహుబలి, RRR లాంటి సినిమాలకు సక్సెస్ ఫుల్ స్టోరీస్ అందించిన స్టార్ రైటర్, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పై సినిమాకి సన్నాహాలు చేస్తున్నారు. RSS జాతీయ సమాఖ్య సభ్యుడు రామ్ మాధవ్ రచించిన “ది హిందూత్వ పారడైమ్” పుస్తక పరిచయం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయేంద్ర ప్రసాద్ ఈ మేరకు వెల్లడించారు. నాలుగేళ్ళ క్రితం ఆరెస్సెస్ పై కథ రాయాలని కొందరు కోరగా నాగ్ పూర్ వెళ్ళానని, అప్పుడే సంస్థపై తనకున్న అపోహలు పటాపంచలయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. కొన్నాళ్ళకు కథ పూర్తి చేసి దాన్ని ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ కి చూపించానని, ఆయనకది చాలా నచ్చిందని చెప్పారు. త్వరలోనే ఈ కథ ఆధారంగా సినిమాతో పాటు వెబ్ సిరీస్ కూడా చేస్తానని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టుతో దర్శకుడు రాజమౌళికి సంబంధం ఉండబోదని తెలుస్తోంది. దీని దర్శకత్వ బాధ్యతలు స్వయంగా విజయేంద్ర ప్రసాద్ చేపట్టే అవకాశాలున్నాయి.

ఆరెస్సెస్ ఆవిర్భావం, 90 ఏళ్ళ ప్రస్థానం, సంస్థ ఎదుగుదలలో క్రియాశీలక పాత్ర పోషించిన నాయకుల జీవిత చరిత్రలపై ఈ సినిమా ప్రధానంగా ఫోకస్ చేయనుంది. దీని టైటిల్ “భగవ ధ్వజ్” అని ఉండొచ్చు. ఈ సినిమా బడ్జెట్ వంద కోట్లు దాటొచ్చన్న టాక్ వినిపిస్తోంది. అనధికారిక సమాచారం ప్రకారం ఈ సినిమాకి బీజేపీ ఫండింగ్ చేయబోతోంది. కర్ణాటక బీజేపీ నేత ఒకరు లహరి రికార్డింగ్ కంపెనీతో కలిసి సంయుక్తంగా దీన్ని నిర్మించనున్నట్లు కొన్ని పత్రికలు చెబుతున్నాయి. అక్షయ్ కుమార్ లాంటి టాప్ బాలీవుడ్ యాక్టర్స్ ఇందులో నటిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాని హిందీలో నిర్మించి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోకి డబ్ చేస్తారని సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి