iDreamPost

భారత రోడ్ల పైకి మళ్లీ రానున్న ‘బీస్ట్’.. US ప్రెసిడెంట్ కారు ప్రత్యేకతలు ఇవే..!

  • Author singhj Updated - 09:56 PM, Thu - 7 September 23
  • Author singhj Updated - 09:56 PM, Thu - 7 September 23
భారత రోడ్ల పైకి మళ్లీ రానున్న ‘బీస్ట్’.. US ప్రెసిడెంట్ కారు ప్రత్యేకతలు ఇవే..!

దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ఈ నెల 9, 10వ తేదీల్లో జీ20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్​లో 20 దేశాధినేతలు పాల్గొననున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. భద్రతా సిబ్బందిని, సాంకేతిక నిఘాను పటిష్టంగా ఏర్పాటు చేసింది. సదస్సుకు హాజరయ్యే ఆయా దేశాధినేతలు భారత్ అందించే సెక్యూరిటీతో పాటు సొంత భద్రతను కూడా ఏర్పాటు చేసుకుంటారు. అందులో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రయాణించే కారు ‘ది బీస్ట్’ స్పెషల్ అట్రాక్షన్​గా నిలవనుంది. సెప్టెంబర్ 7న భారత్​కు రానున్న బైడెన్.. 8వ తేదీన ప్రధాని మోడీతో ద్వైపాక్షిక భేటీ కానున్నారు.

యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఆకాశంలో ప్రయాణించేందుకు ఎయిర్​ఫోర్స్ వన్ విమానంతో పాటు హెలికాప్టర్లను వినియోగిస్తారు. అలాగే రోడ్డు మీద ప్రయాణించేందుకు బీస్ట్​ను ఉపయోగిస్తారు. ఈ కారుకు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఈ కారును కాడిలాక్ వన్, ఫస్ట్ కార్ అని కూడా పిలుస్తారు. ఈ మోడల్​ను 2018లో యూఎస్ ప్రెసిడెంట్ కాన్వాయ్​లోకి తీసుకొచ్చారు. అధునాతన ఫీచర్లతో, అత్యంత భద్రతా ప్రమాణాలతో దీన్ని తయారు చేశారు. అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా ఈ కారు అక్కడ ఉండాల్సిందే. బీస్ట్ కారు అద్దాలు 5 ఇంచుల మందం, డోర్లు 8 ఇంచుల మందం ఉంటాయి.

గాజు, పాలీకార్బొనేట్​లతో ఐదు లేయర్లతో బీస్ట్ కారు అద్దాలను రూపొందించారు. ఇందులో డ్రైవర్ విండో మాత్రం 3 ఇంచుల మేర తెరుచుకుంటుంది. అది తప్ప మిగతా అద్దాలేవీ తెరుచుకోవు. బీస్ట్ మొత్తం బుల్లెట్ ప్రూఫ్ కలిగి ఉండి.. రసాయన, జీవాయుధ దాడులను తట్టుకుంటుంది. దీని టైర్లు పగిలిపోకుండా, పంక్చర్ కాకుండా ఉంటాయి. ఒకవేళ టైర్లు డ్యామేజీ అయినా అందులోని స్టీల్ రీమ్​లతో ప్రయాణిస్తుంది. అల్యూమినియం, స్టీల్, సిరామిక్, టైటానియంతో తయారైన బీస్ట్.. బాంబ్ బ్లాస్ట్​ను కూడా తట్టుకుంటుంది. ది బీస్ట్​లో ఎమర్జెన్సీ టైమ్​లో వాడే ప్యానిక్ బటన్​తో పాటు ఆక్సిజన్ కూడా ఉంటుంది.

యూఎస్ ప్రెసిడెంట్ బ్లడ్ గ్రూప్​నకు సంబంధించిన బ్లడ్ బ్యాగులు కూడా బీస్ట్​లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఈ కారు ఫ్యుయల్ ట్యాంక్​ను ఏది ఢీకొట్టినా పేలకుండా ఉంటుంది. అలాగే డ్రైవర్ క్యాబిన్​లో కమ్యూనికేషన్, జీపీఎస్ ట్రాకింగ్ సదుపాయం ఉంటుంది. ఈ కారును సాధారణ డ్రైవర్లు నడపలేరు. బీస్ట్​ డ్రైవర్​కు యూఎస్ సీక్రెట్ సర్వీస్ ట్రైనింగ్ ఇస్తుంది. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ తలెత్తితే ప్రెసిడెంట్​ను ఎలా కాపాడాలో కూడా శిక్షణలో నేర్పుతారు. ఈ కారు డ్రైవర్​కు ప్రతి రోజూ మెడికల్ టెస్టులు చేస్తారు. ఇక, బీస్ట్ లోపలి భాగానికి మొత్తం గ్లాస్​ అడ్డుగా ఉంటుంది. దీన్ని అధ్యక్షుడు మాత్రమే కిందకు దించే వీలుంది. ప్రెసిడెంట్ సీట్ దగ్గర శాటిలైట్ ఫోన్​ ఉంటుంది. దీని నుంచి నేరుగా యూఎస్ వైస్ ప్రెసిడెంట్, పెంటగాన్​కు ఫోన్ చేసే వీలుంటుంది.

ఇదీ చదవండి: ప్లేట్లు కడుగుతూ జడ్జిగా ఎంపికైన యువకుడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి