iDreamPost

దంపతుల హత్యకేసు: ఇద్దరినీ అతి కిరాతకంగా హత్య.. డబ్బు తీసుకుని మోసం..!

Film Nagar Couple Crime News Solved: కొన్నిసార్లు క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలు మొదటికే మోసం తెస్తాయి. అవి జీవితాన్నే ఛిన్నాభిన్నం చేయ్యచ్చు. అలాంటి ఒక స్టోరీనే ఇది కూడా.

Film Nagar Couple Crime News Solved: కొన్నిసార్లు క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలు మొదటికే మోసం తెస్తాయి. అవి జీవితాన్నే ఛిన్నాభిన్నం చేయ్యచ్చు. అలాంటి ఒక స్టోరీనే ఇది కూడా.

దంపతుల హత్యకేసు: ఇద్దరినీ అతి కిరాతకంగా హత్య.. డబ్బు తీసుకుని మోసం..!

సాధారణంగా నేరాలు అన్నీ క్షణికావేశంతో, అనాలోచిత నిర్ణయాలతోనే జరుగుతాయి అంటారు. హత్యలు జరగడానికి కారణం పగ, ప్రతీకారం కూడా కావచ్చు. కానీ, అవి కూడా అనాలోచితంగా తీసుకునే నిర్ణయాల వల్లే జరుగుతాయి. సాధారణంగా ఎవరైనా మోసం చేస్తే.. వాళ్ల అంతుచూస్తాం అంటూ శపథాలు చేసేది సినిమాల్లో మాత్రమే. నిజ జీవితంలో అలా చేస్తే మీరు కూడా ఊచలు లెక్కపెట్టక తప్పదు. ఓ దంపతుల విషయంలో వీళ్లు అలా చేసినందుకు ఇప్పుడు జైలు పాలయ్యారు. తమని మోసం చేశారనే కోపంతో రెండు నిండు ప్రాణాలను బలిగొన్నారు. ఇప్పుడు అరెస్టై జైలుకు వెళ్లారు.

నవంబర్ 28న జరిగిన దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను శనివారం అరెస్టు చేసి రిమాండుకు కూడా తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. సయ్యద్ అహ్మద్ ఖాద్రీ(45), సయ్యద్ మిరాజ్ ఫాతిమా(40) దంపతులు హైదరాబాద్ టోలీ చౌకీలో నివాసం ఉంటున్నారు. వృత్తి పరంగా ఫాతిమా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డైటీషియన్ గా పని చేసేది. భర్త ఖాద్రీ మాత్రం భార్య సంపాదనతో జల్సాలు చేస్తూ ఉండేవాడు. ఖాద్రీ అలా ఖాళీగా ఉండటం మాత్రమే కాకుండా ఒకరిని మోసం కూడా చేశాడు. ముంబయికి చెందిన అజ్గర్ అనే మేకల వ్యాపారితో ఖాద్రీకి పరిచయం ఏర్పడింది. వారి మధ్య పరిచాయాన్ని వ్యాపార భాగస్వామ్యంగా మార్చుకోవాలని చూశారు. తనకు 100 ఎకరాల భూమి ఉందని అజ్గర్ ని ఖాద్రీ నమ్మించాడు. ఆ పొలంలో మేకల ఫామ్ పెడితే బాగా లాభాలు వస్తాయని అతడిని నమ్మించాడు. ఖాద్రీ మాటలు నమ్మిన అజ్గర్ అతనికి పలు దఫాల్లో రూ.20 లక్షల డబ్బు ఇచ్చాడు.

డబ్బు తీసుకున్న తర్వాత ఖాద్రీ అసలు మేకల ఫామ్ గురించి ఊసెత్తడం లేదు. ఎన్నిసార్లు ఆ విషయం మాట్లాడినా తప్పించుకోవడం ప్రారంభించాడు. అంతేకాకుండా డబ్బు తిరిగి ఇచ్చేయమని అడిగినా కూడా ఖాద్రీ స్పందించలేదు. డబ్బు అంశాన్ని వాయిదా వేస్తూ వచ్చాడు. అజ్గర్ కు ఖాద్రీ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. అతని గురించి ఆరా తీయడం ప్రారంభించాడు. అయితే అజ్గర్ కు విస్తుపోయే నిజాలు తెలిశాయి. అసలు ఖాద్రీకి ఎలాంటి పొలం లేదని.. ఆస్తిపాస్తులు కూడా లేవని తెలుసుకున్నాడు. దాంతో అజ్గర్ కు కోపం కట్టలు తెంచుకుంది. తనని మోసం చేశాడనే ఆక్రోశంలో ఖాద్రీని హత్య చేయాలని నిర్ణయానికి వచ్చాడు. అందుకు తన స్నేహితులు మహ్మద్ హుస్సేన్, మహ్మద్ సల్మాన్ తో కలిసి పథకం రచించాడు. ప్లాన్ ప్రకారం ఖాద్రీ హత మార్చాలని అజ్గర్ అనుకున్నాడు. అందులో భాగంగానే ఖాద్రీని విందుకు ఆహ్వానించాడు.

తర్వాత అజ్గర్ అతని మిత్రులు కలిసి ఖాద్రీ ముఖం మీద దిండుతో అదిమి హతమార్చారు. మృతదేహాన్ని షాతన్ తలాబ్ లో పాతిపెట్టారు. అక్కడితో ఆగకుండా తర్వాతి రోడు ఖాద్రీ ఇంటికి వెళ్లారు. అతని భార్యను డబ్బులు ఇవ్వాలని అడిగారు. తన భర్తే తన సంపాదన మీద బతుకున్నాడని.. తాను డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తానంటూ చెప్పింది. కోపంతో రగిలిపోయిన అజ్గర్ ఆమె మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాలని భావించారు. మృతదేహాన్ని ఫ్యానుకు ఉరివేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారం, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు తీసుకున్నారు. గ్యాస్ లీక్ చేసి ఇంటి నుంచి పరారయ్యారు. ఎవరైనా వచ్చి స్విచ్ ఆన్ చేస్తే ఇల్లు పేలిపోతుందనే అంచనాతో ఆ పని చేశారు. ఫాతిమాకి తన సోదరి ఎంత ఫోన్ చేసినా తీయకపోవడంతో ఇంటికి వెళ్లింది.

ఇంటికి తాళం వేసి ఉండటంతో.. అనుమానంతో తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూసింది. ఫ్యానుకు వేలాడుతూ ఉన్న ఫాతిమా మృతదేహం చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది. తన బావే సోదరిని హత్య చేసి ఆత్మహత్యలా చిత్రీకరించి ఉంటాడని భావించి ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఖాద్రీ ఫోన్ నంబరుకు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. కాల్ డేటా, లాస్ట్ టవర్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిలో సల్మాన్.. ఖాద్రీని తరచూ కలుస్తూ ఉంటాడని నిర్ణయానికి వచ్చారు. అతడనిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. అయితే అజ్గర్, హుస్సేన్ ముంబయి పారిపోయారని పోలీసులు గుర్తించారు. అజ్గర్ డబ్బు కోసం పోలీసులను ఆశ్రయించి ఉంటే కనీసం కొంతలో కొంత అయినా దక్కేది. అనాలోచిత నిర్ణయం తీసుకోవడం వల్ల ఇప్పుడు జైలు పాలయ్యాడు. ఈ దంపతుల హత్య కేసుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి