iDreamPost
android-app
ios-app

Peddhanna Review : పెద్దన్న రివ్యూ

  • Published Nov 04, 2021 | 8:34 AM Updated Updated Nov 04, 2021 | 8:34 AM
Peddhanna Review : పెద్దన్న రివ్యూ

2020 సంక్రాంతి దర్బార్ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఈసారి పెద్దన్నగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాస్ ఎంటర్ టైనర్స్ ఇచ్చి అజిత్ తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందించిన శివ దర్శకుడిగా సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో నయనతార, ఖుష్బూ, మీనాల క్యాస్టింగ్ తో పాటు కీర్తి సురేష్ చెల్లెలిగా నటించడం ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచింది. ట్రైలర్ వచ్చాక పాత రజిని మాస్ మసాలా చూడబోతున్నామన్న ఫీలింగ్ ముందే కలిగించడంతో అభిమానులు అంతకన్నా ఇంకేం పండగ అనుకున్నారు. తెలుగులో మార్కెట్ డౌన్ అయిపోయిన రజిని పెద్దన్నతో కంబ్యాక్ ఇచ్చారో లేదో రివ్యూలో చూద్దాం

కథ

అనగనగా రాజోలు అనే ఊళ్ళో ప్రెసిడెంట్ వీరన్న(రజనీకాంత్)కు చెల్లెలు కనకం(కీర్తి సురేష్)అంటే వల్లమాలిన ప్రేమ. ఎంత అంటే కొలవలేనంత. దీంతో సంబంధాలు కూడా అంత సులభంగా కుదరవు. ఈ నేపథ్యంలో తన కొడుక్కి చేసుకోవడానికి వచ్చిన శత్రువు దేవరాజు(ప్రకాష్ రాజ్)కి చేయందిస్తాడు వీరన్న. పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా కనకం మాయమవుతుంది. తీరా చూస్తే కోల్కతాలో తేలుతుంది. దీంతో అక్కడికి వెళ్లిన పెద్దన్నకు పరమ దుర్మార్గుడు మనోజ్ పారేకర్(అభిమన్యు సింగ్), ఉద్ధవ్(జగపతిబాబు) గ్యాంగ్ ల నుంచి చెల్లిని కాపాడుకోవడమే బాధ్యతగా మారుతుంది. చివరికి ఈ తోబుట్టువులు ఎలా కలుసుకున్నారు, అసలు ఆమె అంత దూరం ఎందుకు వెళ్లిందనేది తెరమీదే చూడాలి

నటీనటులు

సూపర్ స్టార్ రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి కొత్తగా చెప్పడానికి ఏమి లేదు. ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం చూసిన రౌడీ జమీందార్ లో ఎలా ఉన్నారో ఇప్పుడూ అదే లుక్ అదే ఫిజిక్ తో మేజిక్ చేయడం ఆయనకే చెల్లింది. ఏడు పదుల వయసులో ఇంత ఎనర్జీ చూపించడం సామాన్యం కాదు. అందులోనూ తరచూ అనారోగ్యంతో బాధ పడుతున్న రజిని ఫ్యాన్స్ ని అలరించడం కోసం ఇంత కష్టపడటం ఇప్పటి జెనరేషన్ స్టార్లు స్ఫూర్తిగా తీసుకుంటే వేగంగా సినిమాలు వస్తాయి. కాకపోతే కథలో కానీ టేకింగ్ లో కానీ నవ్యత లేకపోవడం వల్ల వీరన్న క్యారెక్టర్ తలైవా కెరీర్ బెస్ట్ కాదు కదా కనీసం గుర్తుంచుకునే స్థాయిలో కూడా మిగల్లేదు. అదే అసలు విషాదం

లాయర్ పాత్రలో నయనతారకు దొరికిన స్కోప్ తక్కువే కానీ ఉన్నంతలో చక్కగా కనిపించింది. మీనా ఖుష్బూ లాంటి సీనియర్లను చేతులారా వృథా చేసుకున్నారు. ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్ లవి రొటీన్ క్యారెక్టర్లే. జగపతిబాబు భయపెట్టే లుక్స్ తో ఉన్నాడు కానీ మనం ఎప్పుడో అరవింద్ సమేత వీర రాఘవ లాంటి సినిమాల్లో చూసేశాం కాబట్టి పెద్దగా తేడా అనిపించదు. కీర్తి సురేష్ ని ఎమోషన్స్ వాడుకోవడం కోసం పెట్టుకున్నారు కానీ మరీ సౌండ్ ఎక్కువైపోయి తనకూ ఇదేమి ప్రత్యేకంగా నిలవలేదు. నవ్వించడానికి పెట్టుకున్న కమెడియన్లు, ప్యాడింగ్ ఆర్టిస్టులు నెంబర్ గట్టిగానే ఉంది కానీ ఉపయోగపడింది ఏమి లేదు

డైరెక్టర్ అండ్ టీమ్

విక్రమార్కుడు తమిళ రీమేక్ సిరుతైతో పేరు తెచ్చుకుని కోలీవుడ్ లో జెండా పాతేసిన శివ గతంలో శౌర్యం, దరువు తెలుగులో చేశారు. కానీ అవి వర్కౌట్ కాకపోవడంతో అజిత్ పంచన చేరి స్టార్ డైరెక్టర్ గా ఈ స్థాయికి వచ్చారు. నిజానికి ఈయనలో గొప్ప దర్శకుడు కానీ టెక్నీషియన్ కానీ లేరు. కేవలం స్టార్ ఇమేజ్ ని ఆధారంగా చేసుకుని రొట్ట రొటీన్ కథలతో కాసిన ఎమోషన్లు పండించి ఇప్పటిదాకా బండి నెట్టుకుంటూ వచ్చారు. ఈసారి రజనీకాంత్ లాంటి శిఖరం దొరికినా కూడా తన ఆలోచనా ధోరణి మార్చుకోలేదు. తాను ఎవరిని ఎలా చూపించినా జనం ఎగబడి చూస్తున్నారన్న ధీమా కావొచ్చు. మళ్ళీ అదే ఫార్ములా రిపీట్ చేశారు శివ.

ఒకప్పటిలా ఆడియన్స్ ఇప్పుడు లేరు. మాస్ పల్స్ అంటే అర్థం లేని హీరోయిజం, అవసరం లేని డ్రామాని గంటల తరబడి చూపించడం కాదు. కనీస స్థాయిలో కొత్త మలుపులు ఉండాలి. ఎంత రజిని అయినా కథా కథనాలు తేడా కొడితే బాక్సాఫీస్ దగ్గర ఏమవుతుందో కాలా, కబాలి, పేటలు ఆల్రెడీ ఋజువు చేశాయి. తమిళంలో ఆడాయి కదానే లాజిక్ కరెక్ట్ కాదు. అన్ని చోట్లా మెప్పించాలి. అప్పుడే అది సూపర్ స్టార్ సినిమా అవుతుంది. నరసింహ, అరుణాచలం, బాషా లాంటి బ్లాక్ బస్టర్లు ఎందుకు ఆడాయనేది విశ్లేషించుకుంటే ఇలాంటి పెద్దన్నలు తెచ్చే తలనెప్పులు ప్రేక్షకులకు తగ్గుతాయి. కానీ ఆలా జరగలేదు.

దర్శకుడు శివ ఇప్పటిదాకా ఫాలో అవుతూ వచ్చిన టెంప్లెట్ ఇందులోనూ కొనసాగించాడు. విశ్వాసంలో తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ ని ఇందులో అన్నా చెల్లెలుకి షిఫ్ట్ చేశాడు. భావోద్వేగం ఇంచుమించు ఒకటే. అదే పల్లెటూరి బ్యాక్ డ్రాప్. సెకండ్ హాఫ్ లో కథను కోల్కతాకు షిఫ్ట్ చేసి తిరిగి అక్కడ వేదాళంను గుర్తు చేస్తాడు. కొన్ని సీన్లు వీరంను తలపిస్తాయి. ఇలా పదే పదే తన సినిమాలు తానే కాపీ కొట్టేసి చాలా తెలివైన పని చేశానన్న శివ బంగారం లాంటి అవకాశాన్ని వృథా చేసుకున్నారు. రజని శకం గురించి తర్వాతి తరంలో మాట్లాడుకోవాల్సి వస్తే వాటిలో ఈ పెద్దన్న సినిమా ఖచ్చితంగా ఉండదు. అంతగా విసిగించేశారు.

ఎన్ని జెనరేషన్లు మారినా మాస్ ఫార్ములా అవుట్ డేట్ అయ్యేది కాదు. కాకపోతే మారుతున్న అభిరుచులకు అనుగుణంగా వాళ్ళను మెప్పించే ట్రీట్మెంట్ రాసుకోవాలి. సింహా లెజెండ్ లాంటి హిట్లు తీసిన బోయపాటి శీనే వినయ విధేయ రామ లాంటి డిజాస్టర్ ఇచ్చారు. కారణాలు చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. ఇలాంటి మాస్ ఎంటర్ టైనర్లకి ఎలివేషన్లు ఎంత ముఖ్యమో గ్రిప్పింగ్ గా సాగే స్క్రీన్ ప్లే అంతకన్నా కీలకం. పెద్దన్నలో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్లు ఉన్నాయి. విజిల్స్ కూడా పడతాయి. కానీ మళ్ళీ ఇంకోసారి చూద్దామన్నా గుర్తు చేసుకుందామన్నా అంతగా ప్రభావం చూపించిన సీన్లేవీ ఫ్లాష్ కావు. అందుకే పెద్దన్న ఫెయిలయ్యాడని చెప్పింది.

ఒకరకంగా చెప్పాలంటే ఇలాంటి పెద్దన్నలు ఇతర కమర్షియల్ స్టార్లకు ఒక గుణపాఠం లాంటివి. జీవితంలో అన్నీ చూసేసిన ఎవరెస్ట్ లాంటి రజని సినిమానే సరిగా డీల్ చేయకపోతే ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూస్తున్నారు. తాము అలాంటి పొరపాట్లు చేస్తే కోట్లాది రూపాయల కష్టం ఎలా నిర్వీర్యం అయిపోతుందో నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. పెద్దన్నలో లాజిక్స్ గురించి ప్రసావించడం లేదు. అవి రాస్తే ఓ పుస్తకం అయిపోతుంది. కానీ ఎంత వాటిని గాలికొదిలేసినా వాటిని సగటు ప్రేక్షకుడు థ్రిల్ అయ్యేలా చూపించాలి కానీ నవ్వుకునేలా కాదు. రజని ఇకపై వేగంగా సినిమాలు చేయలేరు. డైరెక్టర్లో ఇలాంటి పొరపాట్లు చేయకపోతే మంచిది

సంగీతం అందించిన ఇమ్మాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో సౌండ్ ఎక్కువయ్యింది. కొన్ని చోట్ల బాగున్నప్పటికీ ఓవరాల్ గా గుర్తుండిపోయే ట్రాక్ అనిపించలేదు. పాటలు కూడా సోసోనే. విజువల్ గా కలిపి చూసినప్పుడు పర్వాలేదనిపిస్తాయి. వెట్రి ఛాయాగ్రహణం రిచ్ నెస్ కు తగ్గట్టు హై స్టాండర్డ్ లో ఉంది. రజనిని అందంగా చూపించడంలో మంచి రోల్ ప్లే చేసింది. రూబెన్ ఎడిటింగ్ నిడివిని తగ్గించే సాహసం చేయలేకపోయింది. దిలీప్ సుబ్బరాయన్ ఫైట్లు బాగానే కుదిరాయి కానీ మరీ నేలవిడిచి సాము చేయించారు. డైలాగులు పాత చింతకాయ పచ్చడే. సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు మాత్రం అదిరిపోయాయి. ఖర్చుకు వెనుకాడలేదు.

ప్లస్ గా అనిపించేవి

రజినీకాంత్
భారీ ఖర్చు

మైనస్ గా తోచేవి

రొటీన్ కథా కథనాలు
దశాబ్దాల నాటి ట్రీట్మెంట్
సాగతీత
ఎక్కువైన డ్రామా

కంక్లూజన్

మీరు సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులైనా కూడా పెద్దన్నను పెద్ద మనసుతో చూడాలంటే చాలా ప్రిపరేషన్ కావాలి. ఎప్పటికప్పుడు వరల్డ్ సినిమా ఓటిటి రూపంలో గుమ్మంలోకే వస్తోంది. ఎప్పుడో 80ల నాటి యాక్షన్ సెంటిమెంట్ డ్రామాని ఇప్పటి డాల్బీ అట్మోస్ సౌండ్ లో చూపించాలంటే తీసేవాళ్ళకు కాదు కానీ చూసేవాళ్లుకు మాత్రం గుండెధైర్యం అవసరం. పెద్దన్న దురదృష్టవశాత్తు ఈ కోవలోకి వచ్చేసింది. రజిని స్వాగ్ ని ఎంత ఎంజాయ్ చేద్దామనుకుని సిద్ధపడినా కూడా శివ వండిన కిచిడి వంటకం ఫైనల్ గా అసంతృప్తినే మిగులుస్తుంది. అంచనాలు జీరోకి తగ్గించుకుని చూడటం సేఫ్.

ఒక్క మాటలో – చల్లారిన చద్దన్నం

Also Read : Jai Bhim Review : జై భీమ్ రివ్యూ