15 ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న రాజాకు హ్యాండిచ్చిన బాబు!

గుంటూరు టీడీపీలో ముసలం మొదలైనట్లు కనపడుతోంది. టీడీపీ, జనసేన నేతలు తెనాలి సీటు కోసం పట్టుబడుతున్నారు. ఆ వివరాలు..

గుంటూరు టీడీపీలో ముసలం మొదలైనట్లు కనపడుతోంది. టీడీపీ, జనసేన నేతలు తెనాలి సీటు కోసం పట్టుబడుతున్నారు. ఆ వివరాలు..

మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రానున్న ఎలక్షన్‌లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రజా వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవడం కోసం తమ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయని వెల్లడించారు. పొత్తైతే కుదిరింది కానీ.. అభ్యర్థుల ఎంపిక, సీట్ల పంపిణీ ప్రక్రియ ముందుకు సాగడంలేదు. అసలు ఈ పొత్తును రెండు పార్టీల కార్యకర్తలు, నేతలు ఆమోదించడం లేదు. పొత్తు గురించి ప్రకటించారు కానీ.. నేతల మధ్య మాత్రం ఇంకా సయోధ్య కుదరలేదు. అనేక నియోజవర్గాల్లో టికెట్లు ఆశించిన ఇరు పార్టీల నేతల మధ్య కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగా ఎన్నో ఏళ్లుగా టీడీపీలో ఉంటూ.. పార్టీ కోసం పని చేస్తున్న వారికి చంద్రబాబు మొండి చెయ్యి చూపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా తెనాలి సీటు విషయంలో టీడీపీ, జనసేన మధ్య కుమ్మలాటలు మొదలయ్యాయి.

తెనాలి సీటు.. జనసేన, నాదెండ్ల మనోహర్‌కు కేటాయించబోతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. త్వరలోనోనే ఇందుకు సంబంధించి అధికార ప్రకటన వస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మాజీ మంత్రి ఆలపాటి రాజా అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెనాలి సీటును జనసేన నేత నాదెండ్ల​ మనోహర్‌కు ఇవ్వొద్దంటూ ఆలపాటి అనుచరులు డిమాండ్‌ చేస్తున్నారు. నాదెండ్లకు తెనాలి సీటు కేటాయిస్తే పార్టీ కేడర్ తలోదారి వెళ్తామని హెచ్చరిస్తున్నారు. కానీ ఆలపాటి మాత్రం అధిష్టానం నుంచి ప్రకటన వచ్చే వరకు ఓపికగా ఉందాము.. ఆ తర్వాత జరిగే పరిణామాలకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకుందామని కార్యకర్తలకు సూచిస్తున్నారట.

15 ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తే..

ఇక్కడ ఆలపాటి రాజా గత మూడుసార్లు అనగా 2009, 2014, 2019 ఎన్నికల్లో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2014లో విజయం కూడా సాధించారు. దాదాపుగా 15 సంవత్సరాలుగా ఆలపాటి రాజా ఇక్కడ టీడీపీ కోసం పని చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఆలపాటి.. రానున్న ఎన్నికల్లో మరోసారి తెనాలి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ ఈలోపే ఆ సీటును జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం తెర మీదకు రావడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఆలపాటికి టికెట్ ఇవ్వకపోతే మాత్రం తలోదారి వెళ్తామని కేడర్ హెచ్చరిస్తోందట.

పొత్తులో భాగంగా తెనాలి టికెట్‌ను జనసేనకు కేటాయిస్తారనే ప్రచారంతో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒకింత ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. అంతేకాక తెనాలి నియోజకవర్గంలో మళ్లీ టీడీపీనే పోటీ చేయాలని, ఆలపాటి రాజాకే కచ్చితంగా టికెట్ ఇవ్వాలని కేడర్ డిమాండ్‌ చేస్తోందని టాక్‌. అలా కాదని పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ ఇస్తే, నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తే.. ఆయనకు తాము సహకరించేది లేదని స్థానిక నాయకులు తెగేసి చెబుతున్నారు. రా కదలి రా వేదిక మీదుగా హెచ్చరించారు. ఒకవేళ ఆలపాటి రాజాకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయాల్సిందే అని ఆయనపై కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ వ్యవహారంపై బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Show comments