Idream media
Idream media
కరోనా సంక్షోభంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ సంక్షేమంలో దూకుడును కనబరుస్తోంది. ప్రజల సంక్షేమంపై ఎక్కడా రాజీపడబోనని సీఎం వైఎస్ జగన్ నిరూపిస్తున్నారు. ఓ వైపు ఇప్పటికే ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తూనే.. మరో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా దర్జీలు, రజకులు, క్షరకులకు ఏడాదికి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసే ‘జగనన్న చేదోడు’ పథకం అమలుకు రంగం సిద్ధం చేశారు. ఇదే సమయంలో గత ఏడాది ప్రవేశపెట్టిన పథకాలను నిరంతరం కొనసాగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
గత ఏడాది ‘వైఎస్సార్ వాహన మిత్ర పథకం’ ద్వారా ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్‌లు నడుపుకుని జీవనం సాగించే వారికి ఏడాదికి 10 వేలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా రెండో ఏడాది కూడా వారికి నగదు అందించేందుకు వైసీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకం రెండో దఫా అమలు తేదీని తాజాగా ప్రకటించింది. వచ్చే నెల 4వ తేదీన అర్హుల ఖాతాల్లో 10 వేల రూపాయలు చొప్పున జమ చేయనున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు.
ఈ పథకం కోసం అర్హుల నుంచి నూతనంగా దరఖాస్తులు కూడా ప్రభుత్వం స్వీకరిస్తోంది. ఇప్పటికే లబ్ధి పొందిన వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, కొత్తగా పథకం లబ్ధి కోసం అర్హులు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి నాని చెప్పారు. ఈ నెల 26వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ఆ తర్వాత సచివాలయ సిబ్బంది సామాజిక తనిఖీ తర్వాత అర్హులను ఎంపిక చేస్తామని చెప్పారు. కాగా, గత ఏడాది మొదటి సారిగా ఈ పథకం కింద దాదాపు 2 లక్షల మంది ఆర్థిక లబ్ధి పొందారు. నూతన అర్హులతో ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరగనుంది.