iDreamPost
android-app
ios-app

అనుకున్న సమయానికే పోలవరం పూర్తవనుందా?

అనుకున్న సమయానికే పోలవరం పూర్తవనుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి.అనిల్ కుమార్ యాదవ్ గత రెండురోజుల నుండి పోలవరంలో పర్యటిస్తూ ప్రాజెక్ట్ పనులను సమీక్షిస్తున్న సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం 2021 నాటికల్లా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తుందని మరోసారి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి పేర్కొన్నట్టు పోలవరం నిర్మాణం 2021-22 ఆర్ధిక సంవత్సరం నాటికి నిజంగా పూర్తి అవుతుందా అనే సందేహం రాష్ట్ర ప్రజల్లో సర్వత్రా నెలకొని వుంది. ప్రాజెక్ట్ పురోగతి పై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ ఒక ప్రణాళికా బద్దంగా ముందుకెళితే 2021-22 ఆర్ధిక సంవత్సరం నాటికల్లా పోలవరం నిర్మాణం పూర్తి అవ్వడం కష్టమేమి కాదు.అదే సమయంలో ఈ బృహత్ జాతీయ ప్రాజెక్ట్ కి కేంద్ర ప్రభుత్వం నుండి అన్నివిధాలా సరైన సహకారం కూడా అవసరం.

గత వారం రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు డిపిఆర్ కి ఆమోదముద్ర వేయించడానికి కేంద్రానికి పంపిన స్టేటస్ రిపోర్ట్ లో ఇప్పటివరకు 58% పనులు పూర్తయ్యాయని తెలిపింది. ఈ నేపద్యంలో 2021-22 నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళాల్సి ఉంటుంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక తోర్పాటు తప్పనిసరి. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు ప్రాజెక్ట్ హెడ్ వర్క్ పనులు 60 శాతం, కుడి కాలువ 91 శాతం, ఎడమ కాలువ 70 శాతం పనులు పూర్తయ్యాయి.

ప్రాజెక్ట్ స్పిల్ వే, స్పిల్ వే ఛానెల్, అప్ప్రోచ్ చానెల్ తవ్వకం పనులు 1169 లక్షల ఘనపు మీటర్లకి గాను 1050 లక్షల ఘనప మీటర్లు అయిపోయింది. అంటే 90 శాతం పనులు అయ్యాయి. స్పిల్ వే కాంక్రీట్ పనులు 39 లక్షల ఘనపు మీటర్లకి గాను 31 లక్షల ఘనపు మీటర్లు అయిపోయాయని అధికారిక గణాంకాల ప్రకారం తెలుస్తుంది. దీనిని బట్టి కోర్ ప్రాజెక్టు తాలూకు కాంక్రీట్ పనులు, మట్టి పనులు, మెయిన్ డ్యాం గేట్లు అసెంబ్లింగ్ పనులు 2022 లోపు పూర్తి చెయ్యడం పెద్ద కష్టమేమి కాదు.

అయితే ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్న అతిపెద్ద సవాలు పోలవరం ప్రాజెక్ట్ ముంపుప్రాంత గ్రామాల నిర్వాసితులకు నష్టపరిహారం తో పాటు పునరావాసం (ఆర్ & ఆర్) కల్పించడమే. ఇంత పెద్ద బహుళార్ధ సాధక ప్రాజెక్టుని నిర్మిస్తున్నప్పుడు ముంపు ప్రాంత వాసులకు నష్ట పరిహారం.. పునరావాసం.. కల్పించడమే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాలు. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికిచ్చిన డిపిఆర్ ప్రకారం ముంపు ప్రాంతంలో దాదాపు లక్ష కుటుంబాలకి పునరావాసం కల్పించాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 4000 కుటుంబాలకి మాత్రమే పునరావాసం కల్పించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈసారి వరదలు వచ్చేసరికి 100 గ్రామాల ప్రజలకి పునరావాసం కల్పించే దిశగా పని చేస్తుంది. గత చంద్రబాబు ప్రభుత్వంలో పోలవరం ముంపుప్రాంత నిర్వాసితుల పునరావాసానికి ఖర్చుచేసిన నిధులు 6,700 కోట్ల రూపాయలతో కేవలం 4 వేల మందికి మాత్రమే పునరావాసం కల్పించారు. గతప్రభుత్వంలో పునరావాసం ప్యాకేజి విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ ముంపు ప్రాంత నిర్వాసితులకు పునరావాసానికి దాదాపు 25 వేల కొట్ల ఖర్చు అవుతుందని అంచనా. ఆ నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సకాలంలో ఇస్తుందా అనే సందేహం సర్వత్రా ఆసక్తి నెలకొనివుంది. ఇటీవల వచ్చిన వరదల నేపథ్యంలో కాఫర్ డ్యాం వలన చాలా గ్రామాలు ముంపునకు గురయ్యాయి.

గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తమ హాయంలో చేసిన 25-30% పనులకే ప్రాజెక్ట్ మొత్తం పూర్తి చేశామని చేసుకున్న అతి ప్రచారాన్ని ప్రజలే తిరస్కరించారు. గతంలో చంద్రబాబు ప్రాజెక్ట్ మొత్తాన్ని తానొక్కడిచేతుల మీదగానే పూర్తి చేస్తున్నట్టు అతి ప్రమోషన్.. ఈవెంట్ మేనేజ్మెంట్.. లతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం బెడిసికొట్టి చివరికి మొన్న జరిగిన ఎన్నికలల్లో ప్రజల తిరస్కారానికి గురైన విధానం మన కళ్ళముందే మెదులుతుంది. గతంలో అప్పటి భారీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అసెంబ్లీ వేదికగా జగన్… రాసిపెట్టుకో… 2018 కి పోలవరం పూర్తి చేస్తాం అని సవాల్ విసిరిన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూస్తున్నాం.

రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ ఇప్పటినుండే అధికారులతో నిత్యం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ, ప్రాజెక్ట్ నిర్మాణపనులని స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ తాలూకు స్టేటస్ ని ప్రజలకి తెలియాచేస్తూ.. ఒక సమగ్ర ప్రణాళికతో ముందుకెళితే ప్రాజెక్ట్ నిర్మాణం సకాలంలో పూర్తి చేయొచ్చు. దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం తో పాటు కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక తోర్పాటు కుడా చాలా అవసరం.

ఏది ఏమైనా ఆంద్రుల జీవనాడి పోలవరంతో పాటు వెనుకబడిన ప్రకాశం, నెల్లూరు జిల్లా వాసుల చిరకాల స్వప్నం వెలుగొండ ప్రాజెక్టు ని కూడా పూర్తి చేసి కాలువల్లో నీరు పారించగలిగితే మళ్ళీ ప్రజలు ఈ ప్రభుత్వానికి బ్రహ్మరధం పడతారు. అదేసమయంలో ఈ ప్రయత్నంలో అనుకోకుండా ఏవైనా అవాంతరాలు ఎదురైతే వాటిని కూడా ప్రజల ముందుకి తీసుకెళ్లాల్సిన భాద్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అనుకున్న విధంగా ఇబ్బందులేమీ లేకుండా సరైన సమయానికి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసుకోగలిగితే ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలు మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.