Idream media
Idream media
మద్యం, డబ్బుతో సంబంధం లేని ఎన్నికలు జరగాలని జగన్ స్పష్టంగా ఆదేశించాడు. ఇది సాధ్యమేనా? ఏమో చెప్పలేం. ఈ మధ్య ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రభావం లేదు. పూర్తి పారదర్శకంగా జరిగాయా అంటే అది కూడా సందేహమే. అసలు జగన్ పార్టీలోనే మద్యం, డబ్బు లేకుండా ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్లంతా (90 శాతం) కాంగ్రెస్ నుంచి లేదా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్లే. స్థానిక ఎన్నికల్లో ఒక్కో ఓటు విలువ ఒక దశలో రూ.10 వేలకు కూడా చేరుకుంటుందని వాళ్లకు తెలుసు. అలాంటిది డబ్బే లేకుండా సాధ్యమా అని వాళ్లకే అనుమానం. మనం పంచకపోతే అవతలి వాళ్లు పంచుతారు. వాళ్లని కట్టడి చేయడం అంత సులభమా? రేయింబవళ్లు కాపలా ఉండలేరు కదా! పోలీసులు మాత్రం ఏం చేస్తారు. అయినా ప్రతి ఎన్నికలోనూ అన్ని పార్టీల వాళ్లు పోలీసులకి డబ్బులిస్తారని తెలియనంత అమాయత్వంలో ఉందా వైసీపీ.
స్థానిక ఎన్నికలు ముఖ్యంగా వ్యక్తిగత ఆధిపత్యం, ఈగోలతో జరుగుతాయి. ఇక్కడ పార్టీల కంటే వ్యక్తుల మధ్యే పోటీ ఉంటుంది. జగన్ ఎన్ని పథకాలు పెట్టినా వెళ్లి ఓట్లు వేయరు. అక్కడ నిలబడిన వ్యక్తి ఎలాంటి వాడు, వాడిని భరించగలమా లేదా అని తూకం వేసుకుంటారు. దీనికి తోడు కులం, మతం, స్థానికంగా ఉన్న సమస్యలు ఎన్నో ఓటర్‌ని ప్రభావితం చేస్తాయి. ఇది కాకుండా ఓటుని అమ్ముకోడానికి దశాబ్దాలుగా అలవాటు పడి ఉన్నారు.
ఓటర్‌కి ప్రలోభాలు ఈనాటివి కావు. 1977 నుంచి చిన్నచిన్న కానుకలు, బిర్యానీ పొట్లాలు, మందు ఇవ్వడం మొదలైంది. 1980లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటుకి రూ.15 ఇచ్చారు. 83 నుంచి 94 వరకు జరిగిన ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉంది కానీ, మరీ తీవ్రంగా లేదు.
చంద్రబాబు అడుగు పెట్టాడు. దీన్ని పరాకాష్టకి తీసుకెళ్లాడు. ఎన్టీఆర్ ప్రభావం ఓటర్లపై లేదని నిరూపించుకోడానికి బరితెగించాడు. 1996 లోక్ సభ ఎన్నికల్లో మంత్రులను అనేకచోట్ల బరిలోకి దించాడు. ఆ ఎన్నికల్లోనే మొట్టమొదటిసారి 500రూపాయల నోటును ఓటరు చూసాడు. నర్సాపురం నియోజకవర్గంలో నాటి టీడీపీ అభ్యర్థి సుబ్బారాయుడు ఆకాశమే హద్దుగా ఖర్చు పెట్టారు.
సాధారణ ఓటర్లకి కూడా మద్యం పంపిణీ చేయడం బాబుతోనే మొదలైంది. ఓటు రేటు ఇష్టానుసారం పెరిగింది. తప్పనిసరై ఇతర పార్టీలు కూడా ఇదే మార్గం పట్టాయి. ఫలితంగా చివరికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డబ్బున్న వాళ్లే గెలుస్తున్నారు. టీచర్లు కూడా సెల్‌ఫోన్లు తీసుకుని ఓటు వేయడం దిగజారుడికి పరాకాష్ట. ఇక మద్యం లేకుండా ఒక్కరోజు కూడా ప్రచారం చేయలేని స్థితి. రాష్ట్రం విడిపోయిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రెండుసార్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన వాళ్లంతా కోట్లకు పడగలెత్తిన వాళ్లే. సామాన్యులు నామినేషన్ వేయలేని స్థితి. ప్రధాన పార్టీలు డబ్బులేని వాళ్లకి బీ ఫారం ఇవ్వను కూడా ఇవ్వవు.
ఇప్పుడేమో జగన్ మార్పు తేవాలంటున్నాడు. మంచిదే. ప్రతిదీ ఎక్కడో ఒకచోట మొదలు కావాలి. మరి బాగా డబ్బున్న వాళ్లకి కాకుండా సామాన్యులకి, నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకునే వాళ్లకి జగన్ టికెట్లు ఇస్తే బాగుంటుంది. మంత్రులకి , ఎమ్మెల్యేలకి టార్గెట్లు ఇచ్చాడు. గెలిపించలేక పోతే పదవి ఉండదు, వచ్చేసారి టికెట్ ఉండదు. మరి మద్యం, డబ్బు లేకుండా గెలిపించాలంటే వీళ్ల వల్ల అవుతుందా? జగన్ పథకాలను పొందుతున్న జనం అంతా ఏమీ ఆశించకుండా ఓట్లు వేస్తారా?
మార్పుని ఆశిస్తున్న జగన్‌ని ఆదరిస్తారా? ఓటు అమ్ముకోవడం జన్మహక్కు అని భావిస్తారా?
ఏమో, ఒక్కోసారి గుర్రం ఎగిరినా ఎగరవచ్చు.