బాలయ్య.. నువ్వెక్కడయ్య..?

యువరత్న నందమూరి బాలకృష్ణ.. రాజకీయంగా, సినిమాల పరంగా ఈయనకున్న ఫ్యాన్ ఫాలోయింగే వేరు. సోషల్ మీడియాలోనూ బాలయ్యను ట్రోల్ చేసేవాళ్లు ఎంతమంది ఉంటే ఆయనను సపోర్ట్ చేసేవాళ్ల సంఖ్య కూడా అంతే ఉంటుంది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలపై ఇప్పటివరకూ ఈ అగ్రనటుడు కమ్ శాసనసభ్యుడు నోరు మెదపలేదు.

కరోనాపై ముందు జాగ్రత్త సూచనలు చేస్తూ హీరో, హీరోయిన్లంతా తమవంతుగా ప్రచారం చేస్తున్నారు. మొదట రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు సంయుక్తంగా వీడియో రిలీజ్ చేసి పలు సూచనలు చేసారు. వెంటనే కరోనా అంటే భయం వద్దు.. అలా అని నిర్లక్ష్యం చేయొద్దంటూ మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చారు. మోహన్ బాబు కూడా తన పుట్టినరోజు వేడుకను విరమించుకున్నారు. ఇలా హీరోలు, హీరోయిన్లు, డైరక్టర్లు, కమెడియన్లు సోషల్ మీడియా వేదికగా తమ సామాజిక బాధ్యతను నెరవేర్చుతున్నారు. వీడియోలు విడుదల చేస్తూ అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం వారి అభిమానులు ఆయా వీడియోలను వైరల్ చేస్తున్నారు. స్టేటస్ లు పెడుతూ షేర్ చేస్తున్నారు.

అయినా ఈ నందమూరి వారసుడు మాత్రం కరోనాపై ఇప్పటివరకూ స్పందించలేదు. దీంతో సోషల్ మీడియాలో బాలయ్య సైన్యం వెనుకబడిపోతోంది. కొందరైతే బాలకృష్ణ స్పందించరా.. ఆయనకు తీరికలేదా లేక కరోనా వచ్చిందని తెలియలేదా అని ప్రశ్నిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన దిశ అత్యాచారహత్యోదంతంపై కూడా బాలకృష్ణ వేగంగా స్పందించలేకపోయారు. ఇండస్ట్రీలోని నటులు, సాంకేతిక నిపుణులు, డైరక్టర్లు అందరూ తమ నిరసన తెలిపిన తర్వాత నెటిజన్లు బాలయ్యను ట్రోల్ చేసారు.. ఆ తర్వాతే బాలయ్య స్పందించడం జరిగింది. అదికూడా బోయపాటి శ్రీను సినిమా ఓపెనింగ్ సందర్భంగా బయటకు వచ్చిన బాలయ్య దిశ ఘటనపై మాట్లాడారు.

అయితే రాష్ట్రంలో పేరుగాంచిన కుటుంబం నుంచి వచ్చి, తెలుగు సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా ఉంటూ, శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న బాలయ్య ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు, అధికారుల సూచనల కంటే ఇలాంటి ఘటనల్లో సెలబ్రిటీల ప్రచారం ఉపయోగకరమని తెలుసుకోవాలి. అయినా సమాజంలోని బాధ్యతగల వ్యక్తిగా ప్రతీ ఒక్కరూ తమవంతు బాధ్యతగా తమ చుట్టుప్రక్కల వారిని అప్రమత్తం చేయాలి. బాలకృష్ణ లాంటివ్యక్తుల ప్రభావం సమాజంపై ఉంటుంది కాబట్టి ఇలాంటి ముఖ్యమైన సందర్భాల్లో వారి స్పందన అవసరమని గ్రహిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Show comments