iDreamPost
android-app
ios-app

కరోనా పై పోరు..శ్రీకాకుళంపై ప్రత్యేక దృష్టి..

కరోనా పై పోరు..శ్రీకాకుళంపై ప్రత్యేక దృష్టి..

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు కరోనా రహిత జిల్లాలుగా శ్రీకాకుళం, విజయనగరం నిలిచాయి. అయితే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మూడు కేసులు వెలుగు చూడడంతో ఆ జిల్లాపై కూడా కరోనా పంజా విసిరినట్లయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు అప్రమత్తమైంది. ఆదిలోనే వైరస్ను అదుపు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. ఈరోజు జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం వైఎస్ జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా కట్టడికి శ్రీకాకుళం జిల్లాకు సమర్ధుడైన అధికారిని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు.

కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ వల్ల అందుబాటులోకి తెచ్చినా టెలీ మెడిసిన్ విధానాన్ని శాశ్వత ప్రాతిపదికన కొనసాగించాలని సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో టెలీ మెడిసిన్ విధానంలో దాదాపు 300 మంది డాక్టర్లు ప్రజలకు ఆన్లైన్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనా లాంటి విపత్తులు వల్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు మెరుగు పరచుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ని సమర్థవంతంగా ఎదుర్కోగలమని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

భవిష్యత్తులో కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొనేందుకు వార్డు విలేజ్ క్లినిక్స్ కీలక పాత్ర పోషిస్తాయని సీఎం జగన్ పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు పక్కన వార్డు, విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేయాలని ఇప్పటికే సీఎం జగన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది నాటికి ఈ క్లినిక్ లు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ క్లినిక్లో ఇప్పటికే ఉన్న ఆశా వర్కర్, హెల్త్ అసిస్టెంట్ తో పాటు బీఎస్సీ నర్సింగ్ చదివిన ఉద్యోగిని నియమించనున్నారు. తమ పరిధిలోని ప్రజలకు వీరు ప్రాథమిక వైద్యం అందించనున్నారు. ప్రజల ఆరోగ్యంపై నిత్యం అప్రమత్తంగా ఉంటూ అవసరమైతే ఉన్నత వైద్యం కోసం సిఫార్సు చేస్తారు.