Idream media
Idream media
స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తుల కోసం వెంపర్లాడుతున్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఊరట లభించే వార్త ఇది. ఇప్పటికే సీపీఐతో పొత్తు ఖాయం కాగా.. తూర్పు గోదావరి జిల్లాలో మరో పార్టీతో పొత్తుకు అవకాశం కలసివచ్చింది. ఆ పార్టీ ఏదో కాదు.. పూర్వ మిత్రపక్షమైన జనసేన. అయితే ఈ పొత్తు అధికారికంగా కాదు.. అనధికారికమే. ఒక అవగాహనతో రెండు పార్టీలు ముందుకుపోనున్నాయి. జనసేనతోనే కాదు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ ఆసక్తిగా ఉంది. అయితే గత అనుభవాల దృష్ట్యా టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రశ్నేలేదని బీజేపీ భీష్మించుకూర్చుంది.
ఏపీలో ఇటీవల బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేసే విషయమై ఇటీవల రెండు పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలన్న విషయంపై ఒక అవగాహనకు వచ్చారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఇందుకు మినహాయింపు ఇచ్చారు. ఎవరు ఎక్కడ నుంచి, ఎవరితో పొత్తు పెట్టుకుని పోటీ చేసే అంశం.. స్థానిక నాయకత్వానికి వదిలేశారు. జనసేనకు అంతో ఇంతో బలమున్నది గోదావరి జిల్లాల్లోనే. స్థానిక సంస్థల్లో కొన్ని స్థానాలైనా గెలుచుకోవాలని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో రాజోలు నుంచి జనసేన అభ్యర్థి గెలవగా.. రాజమహేంద్రవరం రూరల్‌లో దాదాపు 40 వేల ఓట్లు ఆ పార్టీ అభ్యర్థి కందుల దుర్గేష్ సాధించారు. ఇతర నియోజకవర్గాలోనూ చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేమన్న అంచనాకొచ్చిన జనసేన.. తమతో కలసి వచ్చేందుకు ఉత్సాహం చూపిస్తోన్న టీడీపీతో కలసి వెళ్లేందుకు సుముఖంగా ఉంది. రెండు పార్టీలు కలసి ఒకే అభ్యర్థిని పోటీ పెట్టడం వల్ల గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్ స్థానాల్లో ఎక్కడ..? ఎవరు..? బలంగా ఉంటే.. అక్కడ ఆ పార్టీ అభ్యర్థి బరిలో దిగేలా జనసేన, టీడీపీ పార్టీల నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. జనసేన అభ్యర్థిని నిలబెట్టిన చోట టీడీపీ పోటీ నుంచి తప్పుకోనుంది. ఒకవేళ టీడీపీ కార్యకర్తల్లో వ్యతిరేకత వస్తే.. డమ్మీ అభ్యర్థిని నిలబెట్టాలని టీడీపీ స్థానిక నేతలు నిర్ణయించారు. మొత్తం మీద తూర్పు గోదావరిలో జనసేన, టీడీపీ పొత్తు.. ఆ పార్టీలకు ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచి చూడాలి.