iDreamPost
android-app
ios-app

మున్సిపల్ ఎన్నికల పూర్తి ఫలితలు

మున్సిపల్ ఎన్నికల పూర్తి ఫలితలు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టిఆర్ఎస్ హవా కొనసాగింది. మొత్తం 120 మున్సిపాలిటీల్లోని 2727 వార్డుల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి మొత్తం 1579 వార్డులలో టిఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ 537 వార్డులు, భారతీయ జనతా పార్టీ 236 వార్డులు, ఎంఐఎం పార్టీ 69 వార్డులు, స్వతంత్రులు, ఇతర రిజిస్టర్ పార్టీల నుంచి పోటీచేసిన వారు 306 వార్డుల్లో గెలుపొందారు. దీంతో 109 మున్సిపాలిటీల ఛైర్ పర్సన్ పదవులు అధికార పార్టీకే దక్కనున్నాయి. కాంగ్రెస్కు 4,బీజేపీ 3,MIM 2,ఇతరుల 2 మున్సిపాలిటీలు దక్కించుకోనున్నారు.తొమ్మిది కార్పొరేషన్లలో 325 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి 154 డివిజన్‌లను టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.

మరిపెడ మున్సిపాలిటీలోని 15 వార్డులు, భీమ్‌గల్‌లోని 12 వార్డులను గులాబీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. కార్పొరేషన్ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ 40, బిజెపి 65, ఎంఐఎం 17, ఇతరులు 49 స్థానాలలో విజయం సాధించారు. రామగుండం, మీర్‌పేట, బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేటలో టిఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీతో గెలుపొందింది.

నిజామాబాద్ కార్పొరేషన్లలో 60 డివిజన్‌లకు టిఆర్ఎస్ పార్టీ 13, ఎంఐఎం పార్టీ 16 గెలిచాయి. అయితే బిజెపి 28 స్థానాలలో గెలిచినా మ్యాజిక్ ఫిగర్‌కు మూడు స్థానాలు రావాల్సిఉంది. ఈ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు రెండు, ఇతరులు ఒక డివిజన్‌లో విజయం సాధించారు. ఎంఐఎం భైంసా, జల్పల్లి మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. అలాగే ఐజా, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో ఫార్వర్డ్ బ్లాక్ తరపున టిఆర్‌ఎస్ రెబల్స్ బరిలోకి దిగి ఆరెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నారు. ఇవికూడా అధికార పార్టీ ఖాతాలో చేరే అవకాశం ఉంది. అలాగే ఎక్స్‌అఫీషియో ఓట్లతో ఒకటి రెండు మున్సిపాలిటీల్లో టిఆర్‌ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది.

అలాగే మున్సిపల్ కార్పోరేషన్లలోనూ టీఆరెస్ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 9 మున్సిపల్ కార్పోరేషన్లలో 325 డివిజన్లకు గానూ 154 డివిజన్లలో టిఆర్‌ఎస్ విజయఢంకా మోగించింది. కాంగ్రెస్ 40, బిజెపి 65, ఎంఐఎం 17 స్థానాల్లో గెలిచారు.. 49 డివిజన్లలో స్వతంత్రులు విజయం సాధించారు. 9 మున్సిపల్ కార్పోరేషన్లలో ఏడింటిలో సంపూర్ణ విజయం సాధించి మెజారిటీతో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోనుండగా, ఎక్స్‌అఫీషియో ఓట్లతో ఒక కార్పోరేషన్‌ను కైవసం చేసుకోనుండగా, ముజ్లిస్ పార్టీతో కలిసి నిజామాబాద్ కార్పోరేషన్‌ను టిఆర్‌ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది.

పట్టణ ఓటర్లు కూడా టిఆర్‌ఎస్ పార్టీకే పట్టంకట్టారు. ఓటర్లు ఇచ్చిన తీర్పు ప్రభుత్వంపై పాజిటివ్ సంకేతాలు చూపుతున్నాయి. గత ఎన్నికలతో పోల్చితే, రాష్ట్రంలో పాజిటివ్ ఓటు పెరిగినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్‌కు 47 శాతం ఓట్లు రాగా, స్థానిక ఎన్నికల్లో సుమారు 51 శాతం వచ్చినట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

ముఖ్యంగా తెలంగాణలో ప్రతిపక్షాలు విఫలం అయినట్లు చెబుతున్నారు. అలాగే ప్రతీ ఎన్నికలకు ముందుగానే టిఆర్‌ఎస్ పటిష్టవ్యూహాన్ని రచించి కార్యరంగంలోకి దిగుతుంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావుతో పాటు మంత్రులు, స్థానిక నేతలు సమన్వయంతో కదిలారు.టికెట్ల అంశంపై పలు ప్రాంతాల్లో అసమ్మతి ఏర్పడినా సమస్యను పరిష్కరించి స్థానిక నేతలు, కార్యకర్తలు ఒక్కటిగా ప్రచారం చేశారు. గడప గడపకీ ప్రచారం చేసి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలు వివరించడం గులాబీ పార్టీకి కలిసివచ్చింది. జిల్లాల్లో మంత్రులే పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలు చేపట్టాలని పార్టీ అగ్రనాయకత్వం సూచించింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రులు తమ జిల్లాల పరిధిలో చివరివరకు ప్రచారంలో పాల్గొన్నారు. గత ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. పురపోరులో రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పథకాల సమర్థ నిర్వహణ ఓటర్లపై ప్రభావం చూపాయి. టిఆర్‌ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి అన్న నినాదాన్ని పట్టణ ఓటర్లు విశ్వసించారు.

మరోవైపు ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో 3 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పురపోరులో ఎక్కువ సీట్లు సాధించాలని ఆశించినా ఫలితాలు వారికి నిరాశ మిగిల్చాయి. లోకసభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు సీట్లను గెలిచిన హస్తం పార్టీ స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపించలేకపోయింది. పార్టీలో వర్గపోరు, టికెట్ల పంపకాల్లో పెరిగిన అసమ్మతితో పాటు పలు అంశాలు పార్టీ పరాజయానికి దారి తీశాయి. దాంతో కాంగ్రెస్‌కు ఒక్క కార్పోరేషన్ కూడా దక్కలేదు.

ఈ ఎన్నికల్లో బీజేపీ రెండవ స్థానంలో నిలుస్తుందని ప్రచారంజరిగినా బీజేపీ కన్నా ఎక్కున స్థానాలు గెలవటం మాత్రమే కాంగ్రెస్ కు ఊరటనిచ్చే అంశం.మిగతా పార్టీలైన ఎం.ఐ.ఎం, బిజెపి పార్టీలు అందరూ ఊహించిన విధంగానే తమ శక్తిమేర ఓట్లు రాబట్టి మున్సి పోరులో తమ ప్రభావం చూపించాయి.