iDreamPost
android-app
ios-app

కరోనాను వ్యాప్తి చేసిన వారికి రెండేళ్ల జైలుశిక్ష

కరోనాను వ్యాప్తి చేసిన వారికి రెండేళ్ల జైలుశిక్ష

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా పలు రాష్ట్రాలు ఈనెల 31 వరకూ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజా సంక్షేమం దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది.

కానీ ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించే కరోనా వైరస్ సోకిన అనుమానితులను ఐపీసీ లోని పలు సెక్షన్లను ఉపయోగించి కేసులు నమోదు చేయడంతో పాటు,జైలు శిక్షతో పాటుగా జరిమానా కూడా విధించనుంది. ఈమేరకు డీజీపీ కార్యాలయం ఒక ప్రకటన ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా దురుద్దేశపూర్వకంగా కరోనా వైరస్ ను ఇతరులకు వ్యాప్తి చేస్తే అంటువ్యాధుల నియంత్రణ చట్టం కింద కూడా చర్యలు తీసుకోనుంది.

ఒకవేళ ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే ప్రభుత్వం విధించే శిక్షలు ఈ విధంగా ఉన్నాయి.

ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించటం లాంటివి చేస్తే ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం నెల రోజుల వరకూ జైలు శిక్ష..

ప్రాణాలకు ముప్పు కలిగించే వైరస్‌లు, ఇన్‌ఫెక్షన్లను వ్యాప్తి చేసే నిర్లక్ష్యపూరిత చర్యలకు పాల్పడినట్లయితే ఐపీసీ సెక్షన్‌ 269 ప్రకారం ఆరు నెలల వరకు జైలు శిక్ష, మరియు జరిమానా లేకపోతే రెండూ విధించే అవకాశం ఉంది.

మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగించే వ్యాధులకు సంబంధించిన వైరస్‌లు, ఇన్‌ఫెక్షన్లను దురుద్దేశపూరితంగా వ్యాప్తి చేసే చర్యలకు పాల్పడితే ఐపీసీ సెక్షన్‌ 270 ప్రకారం రెండేళ్ల వరకూ జైలు శిక్ష,మరియు జరిమానా విధిస్తారు.

ప్రభుత్వం ప్రకటించిన క్వారంటైన్‌ నిబంధనలను ఉల్లంఘించటం లాంటి పనులు చేస్తే ఐపీసీ సెక్షన్‌ 271ప్రకారం ఆరు నెలల వరకూ జైలు శిక్ష,మరియు జరిమానా.