iDreamPost
android-app
ios-app

వెలకట్టలేని రీతిలో వాలంటీర్ల కృషి

  • Published May 05, 2020 | 3:42 AM Updated Updated May 05, 2020 | 3:42 AM
వెలకట్టలేని రీతిలో వాలంటీర్ల కృషి

మనిషి జీవితంలో అన్నింటికన్నా అంత్యక్రియల సందర్భంగా సాటి వారి అవసరం ఎక్కువ. ఆ నలుగురు లేకపోతే అసలు కార్యక్రమమే సాగడం చాలా కష్టం. అలాంటిదిప్పుడు కరోనా వేళ చాలామంది మొఖం చాటేస్తున్నారు. బంధువులు, స్నేహితులు అనే విషయాన్ని కూడా తాత్కాలికంగా మరుగునపరుస్తున్నారు. వైరస్ ఏ రూపంలో వ్యాప్తిచెందుతోననే భయమే దానికి మూలం. అయినప్పటికీ కొందరు మానవత్వంతో ముందుకు వచ్చి అంతిమ కార్యక్రమం బాద్యతలు తీసుకుంటున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. తమ వారు కాకపోయినా మనిషితత్వం చాటుతున్న తీరు మెచ్చుకోవాల్సిందే అన్నట్టుగా ఉంది. అలాంటి ఓ కార్యక్రమాన్ని నర్సారావుపేటలో వాలంటీర్లు తమ భుజాన వేసుకున్న దృశ్యం అందరినీ ఆకర్షించింది. వాలంటీర్ల శ్రమ వెలకట్టలేనిదనే అభిప్రాయం బలపడింది.

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అనేక విధాలుగా తోడ్పడుతోంది. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా తెరమీదకు తీసుకొచ్చిన వాలంటీర్ల కారణంగా ఇప్పటికే ఇంటింటీకి పెన్షన్ల పంపిణీ, అనేక చోట్ల రేషన్ కూడా నేరుగా అందించేందుకు అవకాశం ఏర్పడింది. అదే సమయంలో కరోనా వేళ ఏ ఇంట్లో ఎవరు, ఎలా ఉన్నారు, ఎవరు కొత్త వ్యక్తులు, వారి పరిస్థితి ఏమిటనే అంశంలో సమగ్ర సర్వేకి తోడ్పడ్డారు. తద్వారా కరోనా కట్టడికి సానుకూల మార్గాన్ని సృష్టించారు. ఇలాంటి క్షేత్రస్థాయి యంత్రాంగం కారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు వేగంగా, ప్రణాళికాబద్దంగా, ప్రజలకు చేరేందుకు తోడ్పడుతోంది.

తాజాగా నర్సారావుపేటలో వాలంటీర్ల కృషి ఈ విషయంలో మరో అడుగు ముందుకేసింది. కరోనా వైరస్ తో ప్రస్తుతం పల్నాడులోని ఈప్రధాన పట్టణం విలవిల్లాడుతోంది. పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడతో కలకలం రేగింది. అలాంటి సమయంలో ఓవ్యక్తి సహజ మరణం పొందినప్పటికీ పట్టించుకునే వారు కరువయ్యారు.

చివరకు  30వ వార్డ్ మాజీ కౌన్సిలర్ Sk.రెహమాన్ చొరవతో వార్డ్ వలంటీర్స్ సయ్యద్ జానీబాషా , ఎస్ కే సైదావలి , సయ్యద్ జాఫర్ ఖాదర్ లు పూనుకొని  ఖనన కార్యక్రమాలను నిర్వహించి పెద్ద మనసు చాటుకున్నారు. ఇప్పటికే వివిధ సేవలు అందిస్తూ సమాజంలో సదాభిప్రాయాలను కలిగిస్తున్న వాలంటీర్లు పెద్ద మనసుతో చేపట్టిన ఈ కార్యక్రమం అందరినీ ఆలోచింపజేసింది.

చిరుద్యోగులే అయినప్పటికీ సామాజిక బాధ్యతతో పెద్ద పాత్ర పోషిస్తున్న తీరుని అంతా అబినందిస్తున్నారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఇలాంటి వాలంటీర్ల వ్యవస్థ ఎంతో మేలు చేసేందుకు దోహదపడుతోందనే అభిప్రాయం బలపడుతోంది.