iDreamPost
android-app
ios-app

గూడెం టీడీపీకి గడ్డు కాలం

గూడెం టీడీపీకి గడ్డు కాలం

పశ్చిమగోదావరి జిల్లాలో రాజకీయంగా అన్ని పార్టీలకు కీలకమైన నియోజకవర్గం తాడేపల్లిగూడెం. ఇక్కడి ప్రజలు ఏకంగా ఐదు పార్టీలను ఆదరించారు. 1989, 1994, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, 2004లో కాంగ్రెస్‌ పార్టీ, 2009లో ప్రజారాజ్యం, 2014లో భారతీయ జనతా పార్టీ, 2019లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలిచారు.

2019 ఎన్నికల తర్వాత విపక్ష పార్టీల్లో నిరాశ నిస్పృహలు ఆవహించాయి. ముఖ్యంగా టీడీపీ కేడర్‌ నిస్తేజం అయిపోయింది. ఈ 9 నెలల్లో టీడీపీ పిలుపునిచ్చిన ఒక్క ఆందోళనకు కూడా టీడీపీ కేడర్‌ స్పందించలేదు. టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఈలి వెంకట మధుసూధనరావు (ఈలి నాని) తన సొంత వ్యవహరాల్లో బిజీ అయిపోయారు. నియోజకవర్గంలో తమను ముందుండి నడిపించే నాయకులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొందరు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇప్పటికే చాలా మంది పార్టీ వీడిపోయారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో టీడీపీకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పినట్లు సమాచారం.

అయితే గూడెంలో టీడీపీ బాధ్యతలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. పార్టీ నుంచి ఆర్థికంగా అండదండలు అందిస్తామని ఆఫర్‌ ఇచ్చినా ఎవరూ స్పందించడం లేదట. దీంతో ఏంచేయాలో తోచని చంద్రబాబు.. తనని కలసిన స్థానిక నేతలతో రెండు మూడు నెలల తర్వాత నియోజకవర్గంపై దృష్టి సారిస్తానని చెప్పి పంపినట్లు సమాచారం.

హ్యాట్రిక్‌ విజయాలతో ఊపుమీదున్న తెలుగుదేశం పార్టీని దెబ్బతీస్తూ 2004లో కాంగ్రెస్‌ నుంచి కొట్టు సత్యనారాయణ గెలుపొందారు. ఓడిపోయిన కనక సుందరరావు రాజకీయాల నుంచి దూరమయ్యారు. అప్పటి వరకు టీడీపీలో రెండో స్థానంలో ఉన్న ఈలినానికి 2009లో టికెట్‌ ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధపడుతుండగా.. అనూహ్యంగా ఆయన ప్రజారాజ్యంలోకి జంప్‌ అయ్యారు. ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక ఓటర్లు ఎక్కువగా ఉండడం, చిరంజీవి గాలి వీయడంతో ఈలినాని గెలిచారు. ఆ సందర్భంలో టీడీపీకి పెద్ద దిక్కుగా ముళ్లపూడి బాపిరాజు వ్యవహరించారు.

ఆ తర్వాత బాపిరాజుకు జెడ్పీ చైర్మన్‌ పదవిని టీడీపీ కట్టబెట్టింది. ఆ సమయంలో గూడెం పట్టణం, పెంపాడు మండలాల్లో తన పట్టును పెంచుకోవడం మొదలుపెట్టారు. సొంతంగా రాయితీ పథకాలు అందజేస్తూ మంచిపేరు సంపాదించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ సీటు దక్కుతుందని ఆశించారు. అయితే చివరి నిమిషంలో పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీకి కేటాయించారు. అప్పుడు మాణిక్యాలరావును గెలిపించడంలో బాపిరాజు కృషి చేశారు. అలాగే పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు.

2019 ఎన్నికల్లోనైనా సీటు దక్కుతుందని ఆశించగా.. మళ్లీ ఈలి నానికి కేటాయించారు. ఈ వ్యవహారాన్ని జీర్ణించుకోలేని మున్సిపల్‌ చైర్మన్‌ బొల్లిశెట్టి శ్రీనివాస్‌ టీడీపి నుంచి జనసేనలోకి జంప్‌ అయ్యారు. ముక్కోణపు పోటీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ 16వేలకు పైగా మెజారీటీతో ఘన విజయం సాధించారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీని మొదటి నుంచి నమ్ముకుని ఉన్న బాపిరాజు పూర్తిగా సైలెంట్‌ అయిపోయారు. ఓడిపోయిన ఈలినాని తన బిజినెస్‌ వ్యవహారాల్లో మునిగిపోయారు. జనసేన, బీజేపీ పరిస్థితి ఎంత చెప్పుకుంటే అంత తక్కువ.