iDreamPost
android-app
ios-app

జగన్‌ సర్కార్‌ ఆశలపై నీళ్లు

జగన్‌ సర్కార్‌ ఆశలపై నీళ్లు

ఈ నెలాఖరులోపే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న లక్ష్యంతో ఉన్న జగన్‌ సర్కార్‌ ఆశలు అడియాశలయ్యేలా ఉన్నాయి. కరోనాను కారణంగా చూపుతూ ఏపీలో స్థానిక ఎన్నికలను ఆరు వారాలపాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వాయిదా వేయగా.. ఆ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రింలో నిన్న సోమవారం పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్‌ కారణంగా సుప్రింలో ఈ రోజు మంగళవారం జరగాల్సిన విచారణలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు సుప్రిం అదనపు రిజిస్ట్రార్‌ ప్రకటించారు.

తదుపరి విచారణలను ఎప్పుడు నుంచి నిర్వహిస్తారన్న విషయం అదనపు రిజిస్ట్రార్‌ తెలుపలేదు. ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజంపై విచారణ కూడా ఈ నెల 19వ తేదీకి వాయిదా పడింది. ఈ అంశంపై సుప్రింలో పిటిషన్‌ ఉన్నందున వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఇప్పుడు సుప్రింలో అన్ని విచారణలు వాయిదా పడడంతో రెండు చోట్లా విచారణలు నిలిచిపోయాయి. కరోనా వైరస్‌ కారణంగా అత్యవసర పిటిషన్లు, బెయిల్‌ కేసులు మాత్రమే విచారిస్తామని హైకోర్టు తాజాగా నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో న్యాయస్థానాల్లో విచారణలను దీర్ఘకాలం వాయిదా వేసినా ఆశ్చర్యం లేదు.

ఈ నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదివారం షాక్‌ ఇచ్చారు. ఓ పక్క ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తవగా.. మరో వైపు ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసి రాజకీయ పార్టీలతోపాటు, అభ్యర్థులకు దిమ్మతిరిగే నిర్ణయం వెలువరించారు. ఫలితంగా జగన్‌ సర్కార్‌ లక్ష్యానికి అడ్డుకట్ట పడింది. ఈ నెలాఖరులోపు ఎన్నికలు పూర్తి చేస్తే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి స్థానిక సంస్థలకు దాదాపు 5800 కోట్ల రూపాయలు వస్తాయి. ప్రధానంగా ఈ లక్ష్యంతోనే ఏపీ ప్రభుత్వం మండల, జిల్లా పరిషత్, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధం కాగా ఎన్నికల కమిషనర్‌ నిర్ణయం శరాఘాతంలా మారిందని చెప్పవచ్చు.

తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ రమాకాంత్‌ రెడ్డితో భేటీ అయ్యారు. ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.