iDreamPost
android-app
ios-app

పాపం బొబ్బిలి రాజు-అభ్యర్థులు కూడా కరువు

పాపం బొబ్బిలి రాజు-అభ్యర్థులు కూడా కరువు

పిలిచి టిక్కెట్ ఇస్తామన్నా వద్దంటున్న క్యాడర్

బొబ్బిలి సంస్థానంలో ఇంతకన్నా దారుణమైన, దయనీయమైన పరిస్థితులు ఉండవేమో.. చిటికేస్తే వచ్చి నాయినా అంటూ వంగుని నిలబడే అభిమానులు ఇప్పుడు దూరం దూరం జరిగిపోతున్నారు.. పిలిచి టిక్కెట్ ఇస్తామన్నా వద్దు నాయినా అని జారుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బొబ్బిలిలో అన్ని సీట్లలో అభ్యర్థులను నిలబెట్టడమే కష్టం అయింది. అంతలోనే ఎంత మార్పు.. అవును… బొబ్బిలి సంస్థానాధీశుడు ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు 2009, 2014 లో కాంగ్రెస్స్ తరఫున ఎన్నికై 2016లో టిడిపిలోకి ఫిరాయించారు.

రాజకుటుంబంలో ఉంటూ పదిమందికి నీతులు చెప్పే మీరు ఇలా పార్టీ మారడం తప్పు అని ఆరోజుల్లో కార్యకర్తలు చెప్పినా వినని ఆయన అధికార యావతో టీడీపీలో చేరి కొన్నాళ్లు గనుల మంత్రిగా పని చేశారు. ఆయన అధికారంలో ఉన్నన్నాళ్లు ఎక్కడున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి. ఆయన్ను కలవడం దుర్లభం. ఇవన్నీ జనాల మనసుల్లో నాటుకోవడంతో బాటు జగన్ హవా తోడవడంతో మొన్నటి 2019 ఎన్నికల్లో సంబంగి వెంకట చినఅప్పలనాయుడు చేతిలో ఘోరంగా ఓడిపోయారు.

ఓటమి తరువాత కూడా ఆయనలో మార్పు రాలేదు. జనంతో కలిసింది లేదు…వారి కష్ట సుఖాల్లో చూసింది లేదు. ఇదిలా ఉండగానే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఈ ఎన్నికలు సుజయ్ కు మరింత భారం అయ్యాయి. పిలిచి సీట్లు ఇస్తాం అన్నా క్యాడర్ ముందుకు రావడం లేదు. 30 వార్డులకు గాని కష్టం మీద 20 వార్డులకు అభ్యర్థులను నిలబెట్టిన సుజయ్ మిగతా వార్డులకు వెతుక్కోవాల్సి వచ్చింది. ఆయన సోదరుడు, జనం మనిషి అయిన బేబీ నాయిన కూడా జనాన్ని, క్యాడర్ ను కన్విన్స్ చేస్తున్నా ప్రయోజనం లేకపోతోంది. అధికారం ఉన్నన్నాళ్లు, కనిపించలేదని, ఇప్పుడు వచ్చి టిడిపి తరఫున పోటీ చేసి ఓటమిని మూటగట్టుకోవడం ఎందుకని క్యాడర్ వేస్తున్న ప్రశ్నలను వీరి దగ్గర సమాధానం లేకపోతోంది.

దానికి తోడు, ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి, రైతు భరోసా, వసతిదీవెన వంటి పథకాలు జనాలకు, ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసాయి. ఇలాంటప్పుడు టిడిపికి ఓటు ఎందుకు వేయాలన్న ప్రశ్న ఉత్పన్నమవుత్తోంది. ఇదిలా ఉండగానే బొబ్బిలికి చెందిన బలమైన నాయకుడు తుముల భాస్కర్ర రావు తన భార్య, మాజీ మున్సిపాల్ ఛైర్మన్ అచ్యుతవల్లి తో కలిసి నేడో రేపో ఫ్యాన్ కిందకు చేరే ఆలోచనలో ఉన్నారు. దీంతో సుజయ్ కు తన కోట చుట్టు పక్కల కూడా క్యాడర్ దొరకడం లేదు. అయ్యో..హతవిధీ ఇలా జరిగిందేమిటి అనుకోవడం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితుల్లో పడ్డారు ఆయన.