Idream media
Idream media
కరోనా వైరస్ నియంత్రణలోకి రాకపోవడంతో లాక్‌డౌన్‌ను పొడిగించాలన్న డిమాండ్ పెరుగుతోంది. గత నెల 25వ తేదీ నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఈ నెల 14వ తేదీతో మూడు వారాల గడువు ముగుస్తోంది. మూడు వారాలు ప్రజలు ఇళ్లకే పరిమితమైతే వైరస్‌ను నియంత్రించవచ్చన్న కేంద్ర ప్రభుత్వ ఆశలపై ఢిల్లీ ఘటన నీళ్లు చల్లింది. ఢిల్లీ కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరించిందని ఈ నెల మొదటి నుంచి నమోదైన కేసులు చెబుతున్నాయి.
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా సాగుతోంది. ప్రతి రోజు వందల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ రోజు 354 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తం కేసులు సంఖ్య 4,400 దాటాయి. దేశ వ్యాప్తంగా అత్యధిక రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలతోపాటు, దక్షిణ భారత్‌లోని రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్రలో కరోన కేసులు వెయ్యి దాటడం ఆ రాష్ట్రంలో వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో అర్థమవుతోంది.
లాక్‌డౌన్ గడువు మరో వారంలో ముగస్తుండగా.. ఈ లోపే లాక్‌డౌన్ గడువు పొడిగించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు డిమాంyŠ చేస్తున్నాయి. నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెలాఖరు వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయగా.. ఈ రోజు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సీఎంలు ఉద్ధవ్ ఠాక్రే, శివరాజ్‌సింగ్ చౌహాన్, యోగీ ఆధిత్యనాథ్‌లు లాక్‌డౌన్ పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. కరోన కట్టడికి లాక్‌డౌన్ ఒక్కటే మార్గమని పాలకులు భావిస్తున్నారు. భౌతిక దూరం పాటించడం వల్ల మాత్రమే వైరస్‌ను అరికట్టగలమని ప్రభుత్వాలు, నిపుణులు పేర్కొంటున్నారు.