బాలీవుడ్ ఊపిరి పీల్చుకో.. 500 కోట్లు కాదు, 1000 కోట్ల టార్గెట్!

కొంతకాలంగా బాలీవుడ్ పరిస్థితి ఏమంత బాలేదు. ఓ వైపు సౌత్ సినిమాలు రూ.500 కోట్లు, రూ.1000 కోట్లు అంటూ సంచలనాలు సృష్టిస్తుంటే.. బాలీవుడ్ స్టార్స్ నటించిన హిందీ సినిమాలు మాత్రం 200-300 కోట్లు వసూలు చేయడానికే అవస్థలు పడుతున్నాయి. చివరిసారిగా 2018లో ‘పద్మావత్’, ‘సంజూ’, ‘టైగర్ జిందా హై’ ఇలా ఒకే ఏడాది మూడు హిందీ సినిమాలు 500 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరాయి. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్స్ నటించిన ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఒక్కటి కూడా ఆ ఫీట్ సాధించలేదు. మరోవైపు సౌత్ సినిమాలు ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాయి. పొన్నియన్ సెల్వన్-1 500 కోట్ల మార్క్ ని టచ్ చేయగా.. విక్రమ్, కాంతార వంటి సినిమాలు 400 కోట్లకు పైగా వసూలు చేశాయి. బాలీవుడ్ లో రీసెంట్ గా బ్రహ్మాస్త్ర మాత్రమే 400 కోట్ల మార్క్ దాటింది. ఇక 500 కోట్ల కలెక్షన్ చూసి నాలుగేళ్లు దాటింది. అయితే ఈ నాలుగేళ్ళ నిరీక్షణకు ‘పఠాన్’తో తెరపడేలా ఉంది.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘పఠాన్’ జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. విడుదల తర్వాత కూడా జోరు చూపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ప్రస్తుత జోరు చూస్తుంటే 500 కోట్ల క్లబ్ అనేది ఈ సినిమాకి చాలా చిన్న విషయం. చాలాకాలం తర్వాత బాలీవుడ్ కి 500 కోట్ల చిత్రాన్ని అందించడమే కాకుండా.. ఈ చిత్రంతో తాను మొదటిసారి 500 కోట్ల క్లబ్ లో చేరబోతున్నాడు షారుఖ్.

షారుఖ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్న అతి కొద్దిమంది హీరోలలో షారుఖ్ ఒకడు. 2013 సమయంలోనే 400 కోట్ల కలెక్ట్ చేసి సత్తా చాటాడు. కానీ చాలా కాలంగా ఆయన మార్కెట్ సత్తా తెలిపే సినిమా పడలేదు. దానికితోడు ఈ నాలుగేళ్లలో ఆయన హీరోగా నటించిన సినిమానే రాలేదు. చివరిగా 2018 లో జీరో సినిమా విడుదల కాగా, అది 200 కోట్ల లోపు గ్రాస్ కే పరిమితమైంది. ఇక ఈ నాలుగేళ్లలో బాలీవుడ్ కూడా ఎన్నో పరాజయాలు చూసింది. ముఖ్యంగా లాక్ డౌన్ తర్వాత పరిస్థితి దారుణంగా ఉంది. స్టార్స్ నటించిన సినిమాలు కూడా 200 కోట్లు రాబట్టలేక చతికిల పడుతున్నాయి. ఈ క్రమంలో వచ్చిన పఠాన్.. షారుఖ్ తో పాటు, బాలీవుడ్ కి కూడా కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 230 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ వర్గాల అంచనా. త్వరలోనే ఈ చిత్రం 500 కోట్ల క్లబ్ లో చేరి 1000 కోట్ల దిశగా పయనించినా ఆశ్చర్యం లేదంటున్నారు. అదే జరిగితే బాలీవుడ్ కి మళ్ళీ మంచిరోజులు వచ్చినట్లే.

Show comments