Idream media
Idream media
దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) రోజురోజుకూ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నది. కొన్ని రోజులుగా రోజుకు దాదాపు 10 వేలకు దగ్గరగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో పది రాష్ట్రాల నుంచే అత్యధిక కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.
మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్నది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 84 శాతం కేసులు ఈ పది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అలాగే, దేశంలోని ఇప్పటి వరకూ నమోదైన మొత్తం మరణాల్లో ఈ పది రాష్ట్రాల్లోనే 95 శాతం మరణాలు నమోదుకావడం మరింతగా ఆందోళన కలిగిస్తున్నది.
కాగా, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచే 83 శాతం కరోనా మరణాలు ఉండటం గమనార్హం. ఇక నగరాల విషయానికి వస్తే ముంబయి, అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నైలలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక అత్యధికంగా టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్రలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.
తమిళనాడులో నమోదైన కరోనా కేసుల్లో 86 శాతం లక్షణాలు లేకుండానే నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర ముఖ్యమంత్రి పళని స్వామి వెల్లడించారు. అయితే, దేశంలోనే అత్యధిక రికవరీ రేటు రాష్ట్రంలో నమోదవుతున్నదనీ, మరణాలు ప్రపంచ రేటు కంటే తక్కువగా ఉన్నదని ఆయన అన్నారు. కాగా, రాష్ట్రంలో కొత్తగా 1,515 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 31,667కు చేరింది. ప్రస్తుతం 14,396 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గుజరాత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. రాష్ట్రంలో రోజురోజుకూ వందల్లో కొత్త కేసులు నమోదవుతుండటంతో వైరస్ సోకిన వారి సంఖ్య 20 వేల మార్క్‌ను దాటింది. తాజాగా 480 పాజిటివ్ కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య 20,097కు చేరింది. మరణాల సంఖ్య 1,249కి పెరిగింది. అయితే, రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికం అహ్మదాబాద్‌లోనే నమోదుకావడం గమనార్హం. అలాగే, బెంగాల్‌లోనూ కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తూనే ఉంది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పట్లో స్కూళ్లు, కాలేజీలు తెరవొద్దని తల్లిదండ్రుల నుంచి విజ్జప్తులు వస్తున్న నేపథ్యంలో కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలు ఆగస్టు 15 తర్వాతే పున:ప్రారంభమవుతాయని కేంద్ర మనవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ వెల్లడించారు. ఈ సమయంలో పరీక్షల ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు.