iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో పాలనా వికేంద్రీకరణ నిర్ణయంతో మొదలయిన రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంలో తాజాగా ఆర్ఎస్ఎస్ తలదూర్చింది. ఏకంగా ముఖ్యమంత్రిని తుగ్లక్, జగ్లక్ అంటూ సంబోధించడమే కాకుండా, ఈ పరిణామాలు బీజేపీ బలోపేతానికి దోహదం చేస్తాయని, కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆ సంస్థ అధికారిక పత్రికలో వచ్చిన కథనం కలకలం రేపుతోంది. రాజకీయాలకు సంబంధం లేదని లిఖితపూర్వకంగా చెప్పిన ఆర్ఎస్ఎస్ రాజకీయం పలువురిని విస్మయ పరుస్తోంది. ఏపీ అభివృద్ధి విషయంలో ఎన్నడూ పట్టని కాషాయ సంస్థకు హఠాత్తుగా రాజధాని విషయంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
కేంద్రం హామీల గురించి ఎప్పుడయినా మాట్లాడారా
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను కూడా మోడీ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. చివరకు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారు. తిరుమల వెంకన్న సాక్షిగా చెప్పిన మాటలను కొండెక్కించారు. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని మాటలే తప్ప మట్టి, నీరు మినహా చేసింది కనిపించడం లేదు. అయినా ఇలాంటి విషయాల్లో ఎన్నడూ ఆర్ఎస్ఎస్ పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం తమ గూటి పక్షి అధికారంలో ఉండగా ఆంధ్రాకు అన్యాయం చేస్తుంటే పల్లెత్తు మాట అనని ఆర్ఎస్ఎస్ కి ఇప్పుడు అనూహ్యంగా రాజధాని అంశంలో ఆసక్తి ప్రదర్శించడమే ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది.
పాలన వికేంద్రీకరణకు ఆర్ఎస్ఎస్ అడ్డంకుల వెనుక
ఆర్ఎస్ఎస్ అనేది పూర్తిగా కేంద్రీకరణ కోరుకునే సంస్థ. అధికారం ఒక కేంద్రం చేతుల్లోనే ఉండాలని వారి మౌలిక సిద్ధాంతం. చివరకు రాష్ట్రాల హక్కులను కాజేసేందుకు తగ్గట్టుగా బలమైన కేంద్రం- బలహీన రాష్ట్రాలు ఉండాలని చెప్పే సంస్థ. ఆంధ్రప్రదేశ్ విభజనను మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ బలపరచడం వెనుక ఏపీ ఉమ్మడిగా ఉంటే బలమైన రాష్ట్రంగా ఉంటుందనే దుగ్దతోనే అన్నది కాదనలేని సత్యం. చిన్న రాష్ట్రాలుగా విభజిస్తే కేంద్రం చెప్పుచేతల్లో ఉంటారన్నది వారి విధానం. అందుకే అధికార, పాలనా వికేంద్రీకరణను ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం దానికి భిన్నంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అభివృద్ధి వికేంద్రీకరణ కోసం అడుగులు వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అందులో భాగంగా పాలనా మూడు ప్రాంతాలకు వికేంద్రీకరణ చేయడం శ్రేయస్కరమని పలు కమిటీలు కూడా సూచించాయి. గతంలో శివరామకృష్ణన్ కమిటీ చేసిన ప్రతిపాదనలు కూడా దానికి అనుగుణంగానే ఉన్నాయి. నిపుణులు చేసిన సూచనలను చంద్రబాబు బేఖాతరు చేస్తే, జగన్ వాటిని అమలు చేస్తున్నారు. అయినా విధానపరంగా కేంద్రీకరణ కోరుకునే ఆర్ఎస్ఎస్ కి అది కంటగింపుగా మారడంలో వింతేమీ కనిపించడం లేదు.
ఫెడరల్ సూత్రాలకు వ్యతిరేకంగా కేంద్రం జోక్యం కోరుకుంటుంది
భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు కొన్ని హక్కులు ఉంటాయి. ఫెడరల్ సూత్రాల ప్రకారం ఎవరి పరిధిలో వారు వ్యవహరించాల్సి ఉంటుంది. అందులో భాగంగా రాజధాని విషయంలో రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటాయి. తాజాగా జార్ఖండ్ లో కూడా రాజధానుల పెంపుదల ప్రతిపాదన అక్కడి ప్రభుత్వం చేస్తోంది. అయినా ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆర్ఎస్ఎస్ పత్రిక సూచించడం వారికి రాజ్యాంగ సూత్రాల పట్ల ఎంత విముఖత ఉందో అర్థమవుతోంది. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించాలని చెప్పడం ద్వారా ప్రజాస్వామ్యం పట్ల ఆర్ఎస్ఎస్ కి అయిష్టత ఉందనే అభిప్రాయం బలపడుతోంది. ఇలాంటి వైఖరి మూలంగా ఆర్ఎస్ఎస్ తన మార్క్ రాజకీయాలతో ఏపీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే యత్నం చేస్తుందా అనే సందేహాలను కలిగిస్తోంది.
బీజేపీ బలపడడం కోసం ఏదయినా చేస్తారా
ఆర్ఎస్ఎస్ పత్రికలో మూడు పేజీల వ్యాసం ద్వారా జగన్ ని నిందించడం, సమగ్రాభివృద్ధి కోసం చేస్తున్న నిర్ణయాలను అడ్డుకోవాలనే లక్ష్యం ద్వారా ఏపీలో బీజేపీ బలపడుతుందని సూచించడం విశేషం. అంటే బీజేపీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డంకిగా మారతారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. బీజేపీ కోసం రాజ్యాంగ నియమాలు, ఫెడరల్ సూత్రాలు , ప్రజాస్వామ్య విలువలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని కూడా అడ్డుకోవాలని ఆర్ఎస్ఎస్ ఆశిస్తోందా అనే అనుమానం కలుగుతోంది. మొత్తంగా అమరావతి విషయంలో ఇప్పటికే శేఖర్ గుప్తా వంటి కొందరు జర్నలిస్టుల రాతలను, అభిప్రాయాలను, చివరకు హెడ్డింగును కూడా ఆర్ఎస్ఎస్ ఆర్గనైజర్ లో కాపీ చేసిన తీరు విడ్డూరంగా ఉంది. దాని వెనుక అసలు వ్యూహాలు ఎవరివో అన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీ ప్రభుత్వం మీద నిందలు వేసే ముందు ఆర్ఎస్ఎస్ తాను చెప్పుకునే విలువల విషయంలో ఏమేరకయినా పాటించి ఉంటే నైతికంగా కొంతయినా హక్కు ఉండేది. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ఆంధ్ర్రప్రదేశ్ లో ప్రభుత్వ నిర్ణయాలకు మోకాలడ్డడానికే తాము ఉన్నామనే అభిప్రాయం కలిగించడం విచారకరం. ఏపీకి అన్యాయం జరుగుతున్నప్పుడు నోరు మెదపకుండా ఇప్పుడు మాత్రం రాజకీయ లక్ష్యంతో రచ్చ చేయాలని చూస్తే జనం అర్థం చేసుకోరు అనుకోవడం అవివేకం.