iDreamPost
iDreamPost
ఏడాదిన్నర పైగా నిర్మాణంలో ఉన్నా ఇప్పటిదాకా ఎలాంటి ఫస్ట్ లుక్ కానీ ఇద్దరు హీరోల కంబైన్డ్ వీడియో కానీ రిలీజ్ చేయకుండా ఊరిస్తూ వచ్చిన ఆర్ఆర్ఆర్ టీమ్ ని ఎట్టకేలకు కోవిడ్ 19 వైరస్ ఆ పని చేయించింది. కాకపోతే సదుద్దేశంతో చేసింది కాబట్టి అభిమానులు దీన్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతున్న వేళ ఆ వ్యాధి ప్రబలకుండా ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యల గురించి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి జాయింట్ గా ప్రెజెంట్ చేసిన ఒక వీడియో నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
రాజమౌళి బృందం అధికారికంగా విడుదల చేసిన వీడియో కావడంతో ఇందులో తారక్ చరణ్ తమ ఒరిజినల్ లుక్స్ లోనే దర్శనమిచ్చారు. దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు మోచేతిని అడ్డం పెట్టుకుని చేయామనే మంచి సూచనలు ఇందులో ఉన్నాయి. రామ్ చరణ్ కొత్త మీసకట్టుతో అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ రఫ్ గా అనిపించే స్టైల్ లో రెగ్యులర్ గానే ఉన్నాడు. గెటప్ పరంగా ఏదో వైవిధ్యం ఉండబోతోందన్నది అర్థమయ్యింది.అన్నిచోట్లా షూటింగులు వాయిదా పడిపోవడంతో రాజమౌళి ఇప్పుడు ప్రత్యాన్మాయం వేటలో పడ్డారు.
వచ్చే జనవరికి ప్రకటించిన రిలీజ్ డేట్ ని మీట్ కావాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న షెడ్యూల్స్ జరిగే తీరాలి. ఓ రెండు వారాలు అటుఇటు అయినా వాటిని బాలన్స్ చేసుకునేలా సర్దుబాటు జరగాలి. ఇదంతా అంత సులభం కాదు. అలియా భట్ పార్ట్ కూడా త్వరలోనే షూట్ చేయబోతున్నారు. చేతిలో ఇంకో 9 నెలలు మాత్రమే సమయం ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ప్రమోషన్ కోసం జక్కన్న టీమ్ ప్రత్యేకంగా ప్లాన్ లో ఉంది. ఇంకోసారి వాయిదా వేసే అవకాశం దాదాపు లేనట్టే. ఆర్ఆర్ఆర్ వస్తోందనే ఇతర నిర్మాతలు 2021 సంక్రాంతి మీద పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. ఏదైతేనేం సినిమా కోసం కాకపోయినా ఇలా కరోనా వల్లైనా ఇద్దరు హీరోలను ఒకే వీడియోలో పక్కపక్కనే చూసి అభిమానులు మాత్రం మురిసిపోతున్నారు.