భరోసా ఇచ్చే నేతలాగే మాట్లాడుతున్నాడు… ఆ మీడియా మాత్రం బురద చల్లుతూనే ఉంది

పరిపాలనా పరంగా చూస్తే కరోనా వైరస్ సంక్షోభంపై మొదటినుండి జగన్మోహన్ రెడ్డి సరిగ్గానే మాట్లాడుతున్నాడు. కాకపోతే చంద్రబాబునాయుడు అండ్ కో తో పాటు ఎల్లోమీడియానే నొటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చేతిలో పెన్ను, పేపర్ ఉంది కాబట్టి కొత్తపలుకు అనే శీర్షికలో ఏబిఎన్-ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణ జగన్ పై బురద చల్లుతున్నాడు. ప్రతి ఆదివారం రాసే కొత్తపలుకులో కూడా జగన్ పై చెత్తంతా రాశాడు. వైరస్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న పరీక్షలను, తగ్గుతున్న వ్యాప్తిని బహుశా ఎల్లోమీడియా తట్టుకోలేకపోతోందేమో.

ఈ వారం రాసిందేమంటే కొత్తగా రాయటానికి ఏమీ లేక పాత విషయాలను తిరిగి రాసేశాడు. అదేమిటంటే వైరస్ ను జగన్ చాలా తేలిగ్గా తీసుకున్నాడట. అందువల్లే వైరస్ రాష్ట్రంలో తీవ్రంగా పెరిగిపోయిందట. వైరస్ తీవ్రతను జగనే తేలిగ్గా తీసుకుంటే ఇక జనాలు మాత్రం ఎందుకు సిరీయస్ గా తీసుకుంటారని లాపాయింట్ కూడా తీశాడు. కరోనా మామూలు జ్వరం లాంటిదే జగన్ ఇంత హైరానా ఎందుకు పడుతున్నాడు ? అంటూ ఓ ప్రశ్న వేశాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైరస్ నియంత్రణకు జగన్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడన్న విషయాన్ని రాధాకృష్ణే అంగీకరించటం.

శతృవులతో పోరాటం చేయాల్సొస్తే నిజంగా నాయకుడన్న వాడు ప్రత్యర్ధుల గురించి తన సైన్యానికి తక్కువ చేసే చెబుతాడు. శతృవు చాలా బలవంతుడని, గొప్పోడని చెబితే సైన్యం ముందే నీరసించిపోతుందన్న చిన్న విషయం కూడా వేమూరి అర్ధం కాలేదు. జగన్ ఇపుడు చేస్తున్నది కూడా అదే. కరోనా వైరస్ అన్నది మామూలు జ్వరం లాంటిది అని జగన్ చెప్పటంలో ఉద్దేశ్యం జనాలు, ప్రభుత్వ యంత్రాంగం బెంబేలు పడకూడదనే. ఒకవైపు శతృవు గురించి తక్కువగా చెబుతునే వైరస్ నియంత్రణకు తీసుకునే చర్యలు మాత్రం గట్టిగానే తీసుకుంటున్నాడు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన రోగిని పరీక్షించిన డాక్టర్ జబ్బు నయం అయిపోతుందని హామీ ఇస్తాడే కానీ నువ్వు రెండు రోజుల్లో చనిపోతావని చెబుతాడా ?

జగన్ వైరస్ ను తేలిగ్గా తీసుకున్నాడని నిత్యం ఆరోపిస్తున్న రాధాకృష్ణ కరోనా వ్యాప్తి నిరోధంలో ఆంద్ర ముందున్న సంగతిని కానీ,చేస్తున్న టెస్టుల సంఖ్యను కానీ పట్టించుకోడు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైరస్ నియంత్రణకు జగన్ తీసుకుంటున్న చర్యలను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసిస్తున్నారు. దాన్ని ఎల్లోమీడియా తట్టుకోలేకపోతోంది. ఈ విషయంలో చంద్రబాబునాయుడు బాధనే తన బాధగా వేమూరి కొత్తపలుకులో విషం చిమ్మటం స్పష్టంగా కనబడుతోంది.

ఇక మీడియా సమావేశాలు కూడా పెట్టటానికి జగన్ భయపడుతున్నాడంటూ విషప్రచార మొదలుపెట్టాడు. ఇందులో భయపడాల్సిన విషయం ఏముంది ? మొదటి నుండి జగన్ మీడియా ప్రచారానికి దూరంగానే ఉంటున్నాడు. చంద్రబాబు లాగ గోరంత పనిచేసి కొండంత ప్రచారం చేసుకునేందుకు జగన్ దూరమన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతిరోజు మీడియాలో కనబడాలన్న తాపత్రయం జగన్ కు లేదు. తాను చేసే పనుల ద్వారానే జగన్ జనాలను పలకరించాలని కోరుకుంటున్నాడు. చంద్రబాబు పనులు చేసేది తక్కువ కాబట్టి ప్రచారం ఎక్కువ చేసుకుంటాడు.

ఇదే జగన్ పాదయాత్రలో అనర్గళంగా ఉపన్యాసాలు ఇచ్చాడని వేమూరి చెప్పుకున్నాడు. అంటే అనర్గళంగా మాట్లాడకలిగిన నేత ఇపుడు వీడియో సందేశాలు మాత్రమే ఇస్తున్నాడంటే ఉద్దేశ్యపూర్వకంగానే ప్రచారానికి దూరంగా ఉంటున్నాడని అర్ధం అవటం లేదా ? ఇంతచిన్న విషయాన్ని కూడా అర్ధం చేసుకోకుండా బురలచల్లుతున్నారంటే వీళ్ళ టార్గెట్ ఏమిటో అర్ధమైపోతోంది.

Show comments