Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగబోయే మొదటి గణతంత్ర వేడుకలకు విశాఖపట్నం వేదిక కాబోతోంది. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటుపై ముమ్మరంగా సమాలోచనలు జరుగుతున్న నేపథ్యంలో గణతంత్ర వేడుకలు విశాఖలో నిర్వహించాలని నిర్ణయించడంతో విశాఖపట్నం రాష్ట్ర కార్యనిర్వాహఖ రాజధానిగా దాదాపు ఖాయమైనట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. గణతంత్ర వేడుకలకు విశాఖలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం విజయవాడ కేంద్రంగా గణతంత్ర వేడుకలు నిర్వహించింది. 2015 నుంచి 2019లో జరిగిన 70వ గణతంత్ర వేడుకల వరకు ఐదు సార్లు విజయవాడ నగరంలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుకలు జరిగాయి.
అయితే 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆరేడు నెలల్లోనే సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపై సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే గత నెల 17న అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున మూడు రాజదానుల ఏర్పాటు అనే ప్రతిపాదనను తెరమీదకు తెచ్చి సరికొత్త చర్చకు తెరతీశారు.
అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణతో అన్నిప్రాంతాలు అభివృద్ధి సాధించాలన్నదే తమ లక్ష్యమంటూ కర్నూలను న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన నిర్మాణ రాజధానిగా, విశాఖను కార్యనిర్వాహఖ రాజధానిగా చేస్తామని ప్రతిపాదించారు. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీ నుంచి, అమరావతి ప్రాంతంలోని కొన్నిగ్రామాల రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నా.. మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే వైఎస్సార్‌సీపీ సర్కార్ ముందుకు వెళుతోంది. అందులోభాగంగా జీఎన్ రావు, బీసీజీ నివేదికలు, వాటిని పరిశీలించేందుకు హైపవర్ కమిటి ఏర్పాటు తదితర నిర్ణయాలు తీసుకుంది. మూడు రాజధానులు తప్పక ఉంటాయని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, మంత్రులు ప్రతి సందర్భంలోనూ ప్రత్యక్షంగానూ, లేదా పరోక్షంగానూ సంకేతాలు ఇస్తున్నారు.
ఈ నెల 21వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, అనంతరం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగుతున్న నేపథ్యంలో మూడు రాజధానుల అంశంపై నిర్ణయం వెలువడడం ఖాయంగా కనిపిస్తోంది. గణతంత్ర వేడుకలు ఈ నెల 26న జరగనున్నాయి. అంటే కార్యనిర్వాహఖ రాజధాని హోదాలోనే విశాఖలో గణతంత్ర వేడుకలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.